కలం, నిజామాబాద్ బ్యూరో : కామారెడ్డి(Kamareddy) జిల్లా బాన్సువాడ మండలం బోర్లం క్యాంపులోని సాంఘిక సంక్షేమ బాలికల గురుకుల (Gurukul) పాఠశాలలో విషాదం చోటు చేసుకుంది. కొడిచిర గ్రామానికి చెందిన కౌవస్కర్ సంగీత అనే ఎనిమిదో తరగతి విద్యార్ధిని ప్రమాదవశాత్తు ఆటోలో నుంచి పడి మృతి చెందింది. పీఎం శ్రీ కింద ఎంపికైన గురుకుల పాఠశాలలో ఐసీటీ ప్రోగ్రాం కోసం కిరాయికి ఫర్నీచర్ తెప్పించారు. ప్రిన్సిపల్ సునీత ఇంట్లో ఆదివారం ఫంక్షన్ ఉండటంతో వాటిని బాన్సువాడలోని ఆమె ఇంటికి తీసుకువెళ్లారు. ప్యాసింజర్ ఆటోలో తిరిగి గురుకులానికి పంపించారు. కుర్చీలను విద్యార్థులు, సిబ్బంది కిందికి దించుతుండగా చివరి కుర్చీ దించే క్రమంలో ఆటోడ్రైవర్ ఆటోను అకస్మాత్తుగా ముందుకు తీసుకెళ్లాడు. ఈ క్రమంలో విద్యార్థిని సంగీత ఆటోలో నుంచి సీసీ రోడ్డుపై పడిపోయింది. తలకు తీవ్ర గాయమై రక్తస్రావం కావడంతో అదే ఆటోలో బాన్సువాడ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. బాలికను పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు ధ్రువీకరించారు.
ఈ విషయం తెలుసుకున్న బీఆర్ఎస్ నాయకులు అంజిరెడ్డి, జుబేర్, రాంచందర్ ఆస్పత్రికి చేరుకొని పాఠశాల ప్రిన్సిపల్ సునీత, ఉపాధ్యాయులు, సిబ్బంది తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాన్ రెడ్డి (Pocharam Srinivas Reddy), ఆగ్రో ఇండస్ట్రీస్ చైర్మన్ కాసుల బాల్ రాజు, సబ్ కలెక్టర్ కిరణ్మయి ఆస్పత్రికి చేరుకొని వివరాలు తెలుసుకున్నారు.. విద్యార్థి సంగీత మృతి పట్ల ఎమ్మెల్యే పోచారం కంటతడి పెట్టుకున్నారు. ఆస్పత్రి వద్ద అవాంఛనీయ సంఘటనలు జరగకుండా బాన్సువాడ సీఐ తుల శ్రీధర్ భారీభద్రత ఏర్పాటు చేశారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్నట్లు తెలిపారు.
గురుకులం ముందు బంధువుల ఆందోళన
ఈ సంఘటన జరిగిన గురుకుల పాఠశాల (Kamareddy Gurukul) ముందు బాలిక సంగీత తల్లిదండ్రులు, బంధువులు ఆందోళనకు దిగారు. తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు. చదువు కోసం గురుకులానికి పంపిస్తే ఇంత నిర్లక్ష్యంగా పిల్లలతో పనులు చేయించడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. ప్రిన్సిపల్ తీరు పట్ల స్థానికంగా తీవ్ర నిరసన వ్యక్తమవుతోంది.
Read Also: పార్టీ మారిన స్థానాల్లో మళ్లీ ఎన్నికలు పెట్టండి : కేటీఆర్
Follow Us On: Instagram


