కలం, వరంగల్ బ్యూరో : స్టేషన్ ఘన్‌పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి (Kadiyam Srihari).. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కుటుంబంపై మరోసారి హాట్ కామెంట్స్ చేశారు. జనగామ జిల్లా లింగాల ఘనపురం మండలం నవాబ్ పేటలో మంగళవారం పలు అభివృద్ధి పనులు ప్రారంభించిన ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రజా సమాఖ్య పోరాటం, సకల జనుల సమ్మె, అమరుల త్యాగాల ఫలితంగా వచ్చిన తెలంగాణ ఒక కల్వకుంట్ల కుటుంబానికే పరిమితమైందని.. రాష్ట్రంలో ఆ ఒక్క కుటుంబమే బాగుపడిందని ఆరోపించారు. కల్వకుంట్ల కుటుంబం వేల ఆస్తులు, వందల ఎకరాల భూములు, ఫామ్ హౌస్‌లు సంపాదించి.. అప్పు మాత్రం తెలంగాణ ప్రజల నెత్తి మీద వేశారని తీవ్ర ఆరోపణలు చేశారు.
గత బీఆర్ఎస్ ప్రభుత్వం అవినీతి, అప్రజాస్వామిక పద్ధతులు నచ్చక నియోజకవర్గ అభివృద్ధి కోసం తాను కాంగ్రెస్ ప్రభుత్వంతో కలిసి పనిచేస్తున్నట్లు తెలిపారు. గతంలో పనిచేయని, తప్పుడు పనులు చేసి తలవంపులు తెచ్చిన వాళ్లు, ఎమ్మెల్యే పేరు చెప్పుకోవాలంటే సిగ్గుపడాల్సిన పరిస్థితి తెచ్చిన వాళ్ళు ఈరోజు చాలా మాటలు మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. ఎన్నడూ రూపాయి అవినీతికి పాల్పడలేదని, నిజాయితీగా పని చేస్తున్నానని తన నిజాయితీయే రాజకీయంగా నిలబెట్టిందని చెప్పుకొచ్చారు. స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గ ప్రజల గౌరవాన్ని కాపాడే విధంగా తన పనితీరు ఉంటుంది తప్ప తలవంపులు తీసుకొచ్చే విధంగా ఉండదన్నారు. తాను అవినీతికే పాల్పడ్డట్టు నిరూపిస్తే రాజీనామా చేస్తానని ఆయన (Kadiyam Srihari) స్పష్టం చేశారు.
Read Also: ప్రధాని మోదీ ఉగ్రవాది.. ఖర్గే సంచలన వ్యాఖ్యలు
Follow Us On: Instagram

