కలం, వెబ్ డెస్క్ : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (Chandrababu) నేడు దేశ రాజధాని ఢిల్లీలో పర్యటిస్తున్నారు. ఈ పర్యటనలో భాగంగా ఆయన ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో ప్రత్యేకంగా భేటీ కానున్నారు. వచ్చే ఆగస్టు 1వ తేదీన ప్రతిష్ఠాత్మకంగా ప్రారంభం కానున్న భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయ (అల్లూరి సీతారామరాజు విమానాశ్రయం) ప్రారంభోత్సవానికి ప్రధాని మోదీని సీఎం చంద్రబాబు అధికారికంగా ఆహ్వానించనున్నారు.
ప్రధాని మోదీతో పాటు కేంద్ర హోంమంత్రి అమిత్ షా, అలాగే పలువురు కీలక కేంద్ర మంత్రులను కూడా ముఖ్యమంత్రి కలవనున్నారు. ఈ సమావేశాల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధి, విభజన హామీలు, పెండింగ్ ప్రాజెక్టులకు సంబంధించిన నిధుల విడుదలపై చంద్రబాబు చర్చించనున్నారు. రోజంతా వరుస భేటీలతో బిజీగా గడపనున్న సీఎం చంద్రబాబు, ఈ రాత్రికి ఢిల్లీలోనే బస చేయనున్నారు. రేపు (గురువారం) ఉదయం ఆయన తిరిగి అమరావతికి చేరుకుంటారు.

