Mobile Popup Ad
Mobile Popup Ad

సిబ్బంది కొరత.. రోగుల వెత‌.. దీన స్థితిలో కొత్తగూడెం ఆసుపత్రి!

కలం, ఖమ్మం బ్యూరో: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలోని గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్‌ (Bhadradri Kothagudem GGH)లో ప్రజలకు వైద్య సేవలు అందక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఏజెన్సీ ప్రాంతాల ప్రజలకు మెరుగైన ఉచిత వైద్యం అందించాల్సిన ఈ ఆసుపత్రే ప్రస్తుతం డాక్టర్లు, కీలక సిబ్బంది కొరతతో రోగాల బారిన పడినట్లుగా తయారైంది. ఆసుపత్రిలో మధ్యాహ్నం 12 గంటల తర్వాత ఓపీ సేవలు నిలిచిపోతున్నాయి. ఎమర్జెన్సీ కేసులన్నీ క్యాజువాలిటీ విభాగానికి వస్తున్నాయి. అయితే, అక్కడ ప్రజలకు అత్యవసర వైద్యం అందించడానికి ఒక్క రెగ్యులర్ డాక్టర్ కూడా అందుబాటులో లేకపోవడం ఆందోళన కలిగిస్తోంది. రోజుకు దాదాపు 50కి పైగా వచ్చే అత్యవసర కేసులను నర్సింగ్ ఆఫీసర్లే చూసుకోవాల్సిన దుస్థితి నెలకొంది. ​ఆసుపత్రిలో స్పెషలిస్ట్ డాక్టర్ల కొరత తీవ్రంగా ఉండటంతో రోగులు ప్రైవేట్ ఆసుపత్రులను ఆశ్రయించి వేలాది రూపాయలు ఖర్చు చేస్తున్నారు.

ఆసుపత్రిలో పోస్టుల‌న్నీ ఖాళీ…

ఇక్కడ 16 అసోసియేట్ ప్రొఫెసర్ పోస్టులకు గాను కేవలం నలుగురే పని చేస్తున్నారు. 82 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల్లో ఏకంగా 62 ఖాళీలు ఉన్నాయి. జనరల్ మెడిసిన్ విభాగంలో 15 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల్లో 10 ఖాళీగా ఉన్నాయి. పీడియాట్రిక్ విభాగంలో 8 పోస్టులకు 7 ఖాళీలు, జనరల్ సర్జరీలో 15 పోస్టులకు 10 ఖాళీలు, గైనకాలజీలో 15 పోస్టులకు 13 ఖాళీలు ఉండటం గమనార్హం. సర్జరీలకు అత్యంత కీలకమైన అనస్థీషియా విభాగంలో 15 పోస్టులకు గాను 11 ఖాళీలు ఉండటంతో ప్రస్తుతం హాస్పిటల్ మొత్తానికి ఒకే ఒక్క అనస్థీషియా డాక్టర్ మిగిలారు. దీని వల్ల ఆసుపత్రిలో శస్త్రచికిత్సల సంఖ్య గణనీయంగా తగ్గిపోయి, కేవలం అత్యవసర కేసులకే ప్రాధాన్యత ఇస్తున్నారు.

రిపోర్టుల ఖ‌చ్చిత‌త్వంపై ఆందోళ‌న‌

​మరోవైపు రేడియాలజీ విభాగంలోనూ పోస్టులన్నీ ఖాళీగా ఉండటంతో ఇటీవల నియ‌మితుడైన‌ ఒక్క రేడియాలజిస్టుపైనే మొత్తం భారం పడింది. ఆయన ఒకరోజు జీజీహెచ్‌లో, మరోరోజు రామవరంలోని మాతా, శిశు ఆరోగ్య కేంద్రంలో సేవలు అందించాల్సి రావడం వల్ల గర్భిణులు, బ్రెస్ట్ క్యాన్సర్ పరీక్షల కోసం వచ్చే మహిళలు స్కానింగ్‌ల కొరకు గంటల తరబడి వేచి ఉండాల్సి వస్తోంది. సాంకేతిక సిబ్బంది కొరత కూడా ఆసుపత్రిని వేధిస్తోంది. ఎక్స్‌రే టెక్నీషియన్లు లేకపోవడంతో రోజుకు వచ్చే 50 నుండి 100 ఎక్స్‌రేలను హాస్పిటల్ సూపరింటెండెంట్ పేషెంట్ కేర్ సిబ్బందికి తాత్కాలిక శిక్షణ ఇప్పించి తీయిస్తున్నారు. దీని వల్ల రిపోర్టుల ఖచ్చితత్వంపై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.

ఉన్న వారిపై ప‌ని ఒత్తిడి

రూ.లక్షలు వెచ్చించి కొనుగోలు చేసిన అధునాతన సీటీ స్కాన్ యంత్రం ఉన్నప్పటికీ, దానిని నిర్వహించడానికి తగిన సిబ్బంది లేక సేవలు పూర్తిగా నిలిచిపోయాయి. ​ప్రస్తుతం ఆసుపత్రికి రోజుకు 600 నుంచి 800 వరకు ఓపీ నమోదవుతోంది. ఉన్న కొద్దిపాటి వైద్యులపైనే ఓపీ, వార్డుల తనిఖీ, ఎమర్జెన్సీ కేసుల భారం పడటంతో వారు తీవ్ర పని ఒత్తిడిని ఎదుర్కొంటున్నారు. డాక్టర్ల కొరత ఉన్న మాట వాస్తవమేనని, ఈ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి కూడా తీసుకెళ్లడం జరిగిందని జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ రాధామోహన్ తెలిపారు. అయితే అందుబాటులో ఉన్న సిబ్బందితో రోగులకు మెరుగైన వైద్యం అందించేందుకు శాయశక్తులా ప్రయత్నిస్తున్నామని ఆయ‌న స్ప‌ష్టం చేశారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>