Mobile Popup Ad
Mobile Popup Ad

ప్రాజెక్టుల పేరుతో ప్రజలను మోసం చేశారు : మంత్రి జూపల్లి

కలం, మహబూబ్‌నగర్ బ్యూరో : ఉపాధి కోసం వలసలు, ఆత్మహత్యలకు పేరుగాంచిన పాలమూరు జిల్లాను సస్యశ్యామలం చేస్తామని చెప్పిన గత బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజలను మోసం చేసిందని రాష్ట్ర ఆప్కారి శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు (Minister Jupally) ఆరోపించారు. బుధవారం మహబూబ్‌నగర్ (Mahabubnagar) డీసీసీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.

అధికారానికి దూరమైన బీఆర్ఎస్ నేతలు ప్రజలు తమను మరిచిపోతారనే భయంతో తప్పుడు ప్రచారాలు చేస్తూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని మంత్రి విమర్శించారు. పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టు( Palamuru- Rangareddy Lift Irrigation Project)  90 శాతం పూర్తైందని చెప్పడం వాస్తవాలకు విరుద్ధమని అన్నారు. కేవలం రూ.25 వేల కోట్లతో ప్రాజెక్టు పూర్తయిందని చెప్పడం విడ్డూరమని, 2023లోనే ప్రాజెక్టు పూర్తికి రూ.50 వేల కోట్లు అవసరమని గత ప్రభుత్వమే అంచనా వేసిందని గుర్తుచేశారు. ప్రస్తుతం ప్రాజెక్టు పూర్తి చేయాలంటే రూ.లక్ష కోట్ల వరకు వ్యయం కావచ్చని తెలిపారు. మాటల గారడీతో ప్రజలను మోసగించినందుకే గత ఎన్నికలలో  బీఆర్ఎస్‌ను ప్రజలు అధికారానికి దూరం చేశారని జూపల్లి అన్నారు. ప్రాజెక్టులకు అవసరమైన నికర జలాల కేటాయింపులు, పర్యావరణ అనుమతులు లేకుండానే పనులు చేపట్టారని ఆరోపించారు. నేటికీ పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుకు పూర్తి స్థాయి పర్యావరణ అనుమతులు, నీటి కేటాయింపులు లేవని పేర్కొన్నారు.

రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు క్లిష్టంగా ఉన్నప్పటికీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను సమర్థంగా ముందుకు తీసుకెళ్తున్నారని మంత్రి అన్నారు. తెలంగాణ ఏర్పాటైన సమయంలో వేల కోట్లలో ఉన్న అప్పులను లక్షల కోట్ల స్థాయికి చేర్చిన ఘనత గత పాలకులదేనని విమర్శించారు. పాలమూరు బిడ్డగా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత జిల్లాలోని పెండింగ్ ప్రాజెక్టులపై ప్రత్యేక దృష్టి సారించారని తెలిపారు. ఈ ప్రాజెక్టులను ఇప్పుడు పూర్తి చేయకపోతే భవిష్యత్తులో సాధ్యం కాదని పేర్కొన్నారు. అందుకే పాలమూరు ప్రజాప్రతినిధులు, ముఖ్యమంత్రి కలిసి ప్రాజెక్టుల పూర్తికి కృషి చేస్తున్నారని చెప్పారు.ఈ నేపథ్యంలో జూన్ 4, 5 తేదీల్లో ఉమ్మడి పాలమూరు జిల్లాలోని ప్రాజెక్టులను ముఖ్యమంత్రి సందర్శించనున్నట్లు మంత్రి వెల్లడించారు.

అనంతరం ప్రభుత్వ విప్, మహబూబ్‌నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ, పాలమూరు అభివృద్ధి కోసం ముఖ్యమంత్రి చేస్తున్న కృషికి ప్రజలు మద్దతు తెలపాలని, భారీ సంఖ్యలో పాల్గొని బహిరంగ సభను విజయవంతం చేయాలని కోరారు. ఈ సమావేశంలో డీసీసీ అధ్యక్షుడు సంజీవ్ ముదిరాజ్, రాష్ట్ర మైనార్టీ కార్పొరేషన్ చైర్మన్ ఓబేదుల్లా కొత్వాల్, మూడా చైర్మన్  లక్ష్మణ్ యాదవ్, గ్రంథాలయ సంస్థ చైర్మన్  మల్లు నరసింహారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>