కలం, వెబ్ డెస్క్ : తెలంగాణ హైకోర్టులో వైసీపీ నేత బొల్లా బ్రహ్మనాయుడు (Bolla Brahmanaidu) పిటిషన్ దాఖలు చేశారు. ఫేక్ జీవో కేసులో ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని హైకోర్టును ఆశ్రయించారు. తప్పుడు పత్రాలతో ప్రభుత్వ భూమిని కాజేయబోయారంటూ నమోదైన కేసులో అరెస్టు నుండి మినహాయింపు ఇవ్వాలని బ్రహ్మనాయుడు విన్నపం. బెయిల్ పిటిషన్ కు సంబంధించి రేపు (గురువారం) హైకోర్టు విచారణ చేపట్టే అవకాశం ఉంది.
కాగా, ఫేక్ జీవో సృష్టించి గండిపేటలో రూ. వెయ్యి కోట్ల ప్రభుత్వ భూమిని విక్రయించేందుకు ప్రయత్నించారంటూ ఆయనపై నార్సింగి పీఎస్ లో కేసు నమోదైంది. బ్రహ్మనాయుడుతో పాటు ఆయన అనుచరులపై పోలీసులు కేసు నమోదు చేశారు. పక్కా ఆధారాలు సేకరించిన హైదరాబాద్ సీసీఎస్ పోలీసులు నర్సరావుపేటలోని బ్రహ్మనాయుడు నివాసంలో తనిఖీలు నిర్వహించారు. అక్కడ ఆయన అందుబాటులో లేడు. దీంతో పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. ఈ క్రమంలో బ్రహ్మనాయుడు తెలంగాణ హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు.

