Mobile Popup Ad
Mobile Popup Ad

లిక్కర్ వ్యాన్ బోల్తా: పది లక్షల మద్యం బాటిళ్లను ఎత్తుకెళ్లిన జనం!

కలం, వెబ్ డెస్క్ : రోడ్డు ప్రమాదం జరిగితే సాధారణంగా క్షతగాత్రులను కాపాడటానికి జనం పరుగు తీస్తారు. కానీ, చిత్తూరు (Chittoor) జిల్లాలో మాత్రం సీన్ రివర్స్ అయింది. అక్కడ ఓ మద్యం వ్యాన్ బోల్తా పడటమే ఆలస్యం.. గాయపడిన వారిని పట్టించుకోవడం పక్కన పెట్టి, రోడ్డుపై పడిన లిక్కర్ బాటిళ్లను ఏరుకోవడానికి జనం పోటీ పడ్డారు. చేతికి దొరికినవాళ్లు బాటిళ్లు పట్టుకుపోగా, దొరకనివాళ్లు ఏకంగా లుంగీలు, టవళ్లలోనే మద్యం సీసాలను మూటగట్టుకుని పరుగు తీశారు.

వివరాల్లోకి వెళ్తే.. చిత్తూరు నగరం నుండి కార్వేటినగరం మండలానికి మద్యం లోడ్‌తో ఒక వ్యాన్ బయలుదేరింది. ఎస్.ఆర్ పురం మండలం బసిరెడ్డిపల్లి సమీపంలో అకస్మాత్తుగా వాహనం టైర్ పగిలిపోయింది. దీంతో డ్రైవర్ నియంత్రణ కోల్పోవడంతో వ్యాన్ రోడ్డు పక్కన బోల్తా పడింది. ప్రమాద తీవ్రతకు వ్యాన్ లోని మద్యం సీసాలన్నీ రోడ్డుపై, పక్కనే ఉన్న పొలాల్లో చెల్లాచెదురుగా పడిపోయాయి.

ఈ విషయం చుట్టుపక్కల గ్రామస్తులకు తెలియడంతో క్షణాల వ్యవధిలోనే అక్కడికి భారీగా జనం చేరుకున్నారు. రోడ్డుపై పడి ఉన్న మద్యం సీసాలను పట్టుకెళ్లడానికి పోటీ పడ్డారు. చేతికి దొరికినన్ని సీసాలను పట్టుకుని పరుగులు తీశారు. కొందరు ఏకంగా మద్యం బాక్సులను ఎత్తుకెళ్లగా, మరికొందరు తమ లుంగీలు, టవళ్లలో మద్యం సీసాలను మూటగట్టుకుని అక్కడి నుంచి జారుకున్నారు. ఈ తోపులాటలో సుమారు పది లక్షల రూపాయల విలువైన మద్యం బాటిళ్లను జనం మాయం చేసినట్లు తెలుస్తోంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకునే సరికే అక్కడ మద్యం బాక్సులన్నీ ఖాళీ అయిపోయాయి. పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>