నీట్ రద్దు.. NTAను పూర్తిగా రద్దు చేయాలి: శ్రీనివాస్ గౌడ్

కలం, వెబ్ డెస్క్: నీట్-యూజీ 2026 పేపర్ లీకేజీ అనేది దురదృష్టకరమని, బాధాకరమని బీఆర్ఎస్ మాజీ మంత్రి శ్రీనివాస్ (Srinivas Goud) అన్నారు. నీట్ పేపర్ లీకేజీ ఘటనను నిరసిస్తూ తెలంగాణ విద్యార్థి జేఏసీ చైర్మన్ వేముల రామకృష్ణ ఆధ్వర్యంలో హైద్రాబాద్‌లోని RTC ఎక్స్ రోడ్డు వద్ద శ్రీనివాస్ గౌడ్ పాల్గొని నిరసన వ్యక్తం చేశారు. శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ.. లక్షలాది విద్యార్థులు, తల్లిదండ్రుల డాక్టర్ కావాలనే కలలు ఈ లీకేజీతో కృంగిపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. కష్టపడి చదువుకున్న అర్హులైన విద్యార్థుల భవిష్యత్తు ప్రశ్నార్థకం అయిందని చెప్పారు. అర్హత లేని వ్యక్తులు డాక్టర్లు అయితే దేశానికి ఎలాంటి సేవలు అందించగలరు? అని ఆయన ప్రశ్నించారు. నీట్ పేపర్ లీకేజీ వ్యవహారంలో నిర్వహించిన ఏజెన్సీ NTA (నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ) ను పూర్తిగా రద్దు చేయాలని డిమాండ్ చేశారు.

బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యా శాఖ మంత్రి తక్షణం రాజీనామా చేయాలని శ్రీనివాస్ గౌడ్ మండిపడ్డారు. భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా కఠిన చట్టాలు రూపొందించాలని చెప్పారు. పేపర్ లీకేజీ చేసిన వారికి ఉరి శిక్ష విధించేలా చట్టాలను సవరించాలని తెలిపారు. దేశవ్యాప్తంగా లక్షలాది మంది విద్యార్థులు రాసే పరీక్షలను ఒక్క ఏజెన్సీ చేతుల్లో పెట్టడం సరైన పద్ధతి కాదని.. కేంద్రానికి నిర్వహించే శక్తి లేనప్పుడు, రాష్ట్రాలకు అధికారాలు ఇవ్వాలని అన్నారు.

ఈ ఘటనపై సుప్రీం కోర్టు సిట్టింగ్ జడ్జీతో విచారణ జరిపి.. లీకేజీలో ప్రమేయం ఉన్న ప్రతి ఒక్కరినీ కఠినంగా శిక్షించాలని మాజీ మంత్రి డిమాండ్ చేశారు. ప్రధాని మోదీ ఈ సంఘటనపై స్పందించి విద్యార్థులకు భరోసా కల్పించాలని కోరారు. గతంలో మహబూబ్‌నగర్ రైలు ప్రమాదం సందర్భంగా రైల్వే మంత్రి రాజీనామా చేశారని.. అదే విధంగా ఈ లీకేజీకి బాధ్యత వహించి కేంద్ర విద్యా శాఖ మంత్రి రాజీనామా చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో సురేష్, నందగోపాల్, సాయి, సతీష్, ప్రవీణ్, హరి శంకర్, వినయ్, వినోద్ మరియు తదితర విద్యార్థి నాయకులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>