నిజామాబాద్ రౌడీ షీటర్ రియాజ్(Riyaz) ఎన్‌కౌంటర్ అంశం నివురుగప్పిన నిప్పులా మారింది. ఈ అంశంపై సోషల్ యాక్టివిస్ట్‌లు స్పందిస్తున్నారు. అసలు ఒక పోలీసు అధికారిని హత్య చేసిన తర్వాత ఏ రౌడీ షీటర్ అయినా అదే జిల్లాలో తిరుగుతాడా? అని సోషల్ యాక్టివిస్ట్ ప్రశ్నించారు. కానిస్టేబుల్ ప్రమోద్ కుటుంబానికి, అదే విధంగా రియాజ్ కుటుంబానికి న్యాయం జరగాలని వాళ్లు డిమాండ్ చేశారు. రియాజ్ కుటుంబం తీవ్ర వేధింపులకు గురవుతోందని ఆవేదన వ్యక్తం చేశారు.
‘‘రియాజ్ ఒక పోలీస్ అధికారిని నిజంగా చంపితే అతను నిజామాబాద్‌లో ఉంటాడా.. వాళ్ళ ఫ్యామిలీని తీసుకొని పారిపోడా? పోలీసులు తన కుటుంబాన్ని హింసిస్తున్నారని రియాజ్ తానే స్వయంగా లొంగిపోయాడు. లొంగిపోయిన తరువాత పోలీసులు అతనిపై థర్డ్ డిగ్రీ ప్రయోగించి, చిత్రహింసలు పెట్టారు.. అతను కస్టడీలోనే చనిపోయాడు. రియాజ్ చనిపోయాక అతన్ని ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లి, 407 ఖైదీల రూంలో పెట్టారు, 4వ ఫ్లోర్‌లో ఉన్న రోగులు అందరిని ఖాళీ చేయించారు. చేతులు కట్టేసి ఉంటాయి.. రియాజ్ మెడ విరిగిపోయింది, శరీరం మీద తీవ్ర గాయాలు ఉన్నాయి.. అలాంటి మనిషి పోలీసులను ఎదిరించి గన్ లాక్కుంటాడా?’’ అని ప్రశ్నించారు.
‘‘అలా చెప్పి, పోలీసుల ఉన్నతాధికారుల సమక్షంలో మృతదేహానికి మూడు బుల్లెట్లను కాల్చారు. రియాజ్(Riyaz) కస్టడీలో బ్రతికే ఉంటే ఆసుపత్రికి తీసుకెళ్లినప్పుడు నడుచుకుంటునో, వీల్ చైర్‌లోనో తీసుకెళ్తారు కదా.. ఆ సీసీటీవీ ఫుటేజ్ చూపించడం లేదు. మృతదేహం చూశాక అతని మెడ ఊగిపోతోంది, ముక్కు విరిగిపోయింది, పెదాలు పగిలిపోయాయి. లారెన్స్ బిష్ణోయ్, నిజామాబాద్ పోలీస్ కమిషనర్ ఫోటోలు పక్క పక్కన పెట్టి, పోలీసుల సమక్షంలో డాన్సులు చేశారు. దీనిపై సీబీఐ ఎంక్వేరీ వేసి నిజానిజాలు బయటకు చెప్పాలి. నా బిడ్డకు జరిగింది ఇంకెవరికి జరగకూడదు’’ అని రియాజ్ తల్లి కన్నీరుమున్నీరయ్యారు.
‘‘కానిస్టేబుల్ ప్రమోద్ హత్యపై లోతుగా విచారణ జరపాలి. కానిస్టేబుల్ ప్రమోద్‌ను నిజంగా హత్య చేసిన వాడిని అరెస్ట్ చేసి.. ప్రమోద్ కుటుంబానికి న్యాయం చేయాలి. రియాజ్ కుటుంబంపై ఇప్పటికి వేధింపులు జరుగుతున్నాయి.. ఆ కుటుంబంలోని చిన్న పిల్లలను రోడ్ల మీద వేధిస్తున్నారు. దీనిపై వాళ్ళకు న్యాయం జరగాలి. ఈ ఘటనలో ఆసిఫ్ పాత్ర ఉంది.. అతనిపై లోతుగా విచారణ చేయాలి. ఈ బూటకపు ఎన్‌కౌంటర్‌లో భాగమైన పోలీసులపై చర్యలు తీసుకోవాలి. మేము పోలీసులకు వ్యతిరేకం కాదు.. ఈ ఎన్‌కౌంటర్‌ను కొందరు పోలీసులు కుట్రపూరితంగా చేశారు. తెలంగాణ ప్రభుత్వం సీబీఐ ఎంక్వైరీ వేయలేదు.. అందుకే జాతీయ స్థాయిలో దీనిపై లోతుగా విచారణ జరపాలని అడగడానికి వచ్చాం’’ అని సోషల్ యాక్టివిస్ట్ తెలిపారు.
Read Also: శంషాబాద్ విమానాశ్రయంలో ప్రయాణికుల ఆందోళన
Follow Us on : Pinterest

