కలం, వెబ్ డెస్క్ : హైదరాబాద్ లో స్నైడర్ ఎలక్ట్రిక్ ఇండియా (Schneider Electric India) కంపెనీ రూ.623 కోట్ల పెట్టుబడులు పెట్టడానికి ముందుకొచ్చింది శంషాబాద్ గాగిల్లాపూర్ లో తన కంపెనీని విస్తరిస్తున్నట్టు ప్రకటించింది. దావోస్ (Davos) ఎకనమిక్ ఫోరమ్ సదస్సులో సీఎం రేవంత్ రెడ్డితో స్నైడర్ కంపెనీ సీఈవో దీపక్ శర్మ భేటీ అయ్యారు. ఇందులో అనేక అంశాలపై చర్చించుకున్నారు. ఇండస్ట్రియల్ పార్కులు, విద్యుత్ రంగంలో వస్తున్న కొత్త టెక్నాలజీ, హైదరాబాద్ లో తమ ప్రభుత్వం కంపెనీలకు కల్పిస్తున్న సౌకర్యాలు, ప్రోత్సాహకాలను దీపక్ శర్మకు సీఎం రేవంత్ రెడ్డి వివరించారు.
తెలంగాణలో ఇప్పటి వరకు స్నైడర్ కంపెనీకి 38 స్కిల్ డెవపల్ మెంట్ సెంటర్లు ఉన్నాయి. ఇప్పుడు ఈ కొత్త పెట్టుబడులతో ఎయిర్ సర్క్యూట్ బ్రేకర్లు, మోల్డెడ్ కేస్ సర్క్యూట్ బ్రేకర్లు, కాంట్రాక్టర్లు, పుష్ బటన్ల ఉత్పత్తి కెపాసిటీ బాగా పెరగబోతోందని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. ఈ పెట్టుబడులను హైదరాబాద్ కు తీసుకురావడంలో కీలకంగా వ్యవహరించిన మంత్రి శ్రీధర్ బాబును సీఎం రేవంత్ రెడ్డి ప్రశంసించారు. అనంతరం ఎలక్ట్రిక్ వెహికల్స్ కంపెనీల విస్తరణపై మంత్రులు చర్చించుకున్నారు.


