వెలుగులు నింపిన కార్మికులకు.. చీకటి జీవితం

కలం, ఖమ్మం బ్యూరో : దేశానికి వెలుగులు ప్రసాదించిన సింగరేణి రిటైర్డ్ కార్మికుల(Singareni Retired Workers) పరిస్థితి నేడు అంధకారంలో మగ్గుతుంది. సుమారు 30-40 సంవత్సరాల పాటు సింగరేణికి సేవలందించిన కార్మికులు, నేడు చాలీ చాలని పెన్షన్‌తో బతుకు వెళ్లదీస్తున్నారు. ఇరవై ఏళ్ల క్రితం రిటైర్ అయిన ఒక బొగ్గు గని కార్మికుడు, కేవలం వెయ్యి లోపు పెన్షన్ అందుకుంటున్నాడంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ప్రభుత్వం ఇచ్చే వృద్ధాప్య పెన్షన్ కంటే కూడా తక్కువ పెన్షన్ పొందుతూ, కుటుంబ సభ్యులకు భారంగా మారుతున్నామని వాపోతున్నారు. కొంత మంది ఈ వయస్సులోనూ రోజు వారీ కూలీకి వెళ్తున్నారు.

ప్రభుత్వ రంగంలో పని చేసిన ప్రతి ఉద్యోగికి కనీస జీవన వ్యయాలకు సరిపోయే పెన్షన్ లభిస్తుంది. అలాగే పెరుగుతున్న ధరలకు అనుగుణంగా పెన్షన్ కూడా పెరుగుతుంది. కానీ సింగరేణి కార్మికులకు మాత్రం ఆ పరిస్థితి లేదు. దీంతో ముసలితనంలో కుటుంబ సభ్యులపై ఆధారపడడం భారంగా ఉందని అంటున్నారు. భూగర్భంలో ప్రమాదాల మధ్య పనిచేసి, ఆరోగ్యాన్ని కోల్పోయి, కొంత మంది శరీర అవయవాలను కూడా త్యాగం చేసిన సందర్భాలు ఉన్నాయి. అంత కష్టపడ్డా కూడా నేడు ఆర్ధిక ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుంది.

ఒక ప్రజా ప్రతినిధి ఒకసారి ఎమ్మెల్యే అయితే ఒక పెన్షన్. రెండోసారి గెలిస్తే మరో పెన్షన్, ఎంపీ అయితే మళ్ళీ ఆ పెన్షన్ సెపరేటుగా ఉంటుంది. మరి దేశ ఆర్ధిక వ్యవస్థకు వెన్నెముకగా నిలిచిన సింగరేణి కార్మికులకు మాత్రం ఒక్క పెన్షన్ కూడా గౌరవ ప్రదంగా ఎందుకు లేదు అని వారు ప్రశ్నిస్తున్నారు. ఈరోజు మార్కెట్ ధరలు, నిత్యావసర వస్తువుల ధరలు, వైద్యం కోసం, నెలవారి మందుల కోసం చేసే ఖర్చులు ఎంత భారీగా పెరిగిపోయాయో అందరికీ తెలిసిన విషయమే.

అందుకే ప్రభుత్వాలు కూడా వృద్ధాప్య పెన్షన్ రెండు వేలు చేసింది. అలాంటిది కొంత మంది సింగరేణి (Singareni) కార్మికులు ఇంకా వెయ్యి లోపు పెన్షన్‌తో జీవించడం సాధ్యమా అని కార్మికులు వాపోతున్నారు. పెన్షన్ అనేది సింగరేణి సంస్థ ఇస్తున్న దానం కాదు.. అది వారి హక్కు.. వారి నలభై ఏళ్ల శ్రమకు ఇచ్చే గుర్తింపు. ఇప్పటికైనా సింగరేణి ప్రాంత అధికారులు, ప్రజాప్రతినిధులు.. రిటైర్డ్ కార్మికులకు పెన్షన్ పెంచేలా చర్యలు చేపట్టాలని బాధిత కుటుంబాలు ఆశా భావం వ్యక్తం చేస్తున్నారు.

జాడి చొక్కా రావు, న్యాయవాది, మణుగూరు

భారతదేశం ఒక ప్రజాస్వామ్య దేశం. సమాన హక్కులు, సమాన అవకాశాలు ప్రతి పౌరుడికి కల్పించాలన్నదే భారత రాజ్యాంగ సారాంశం. మరి సింగరేణి బొగ్గు గనుల్లో, భూగర్భంలో పని చేసి, దేశానికి వెలుగులు నింపిన రిటైర్డ్ కార్మికుల విషయంలో ఈ రాజ్యాంగ ఆత్మ ఎక్కడా కనిపించడం లేదు.

Read Also: డీప్‌ఫేక్ వీడియోలపై అప్రమత్తంగా ఉండండి: సజ్జనార్

Follow Us On: Facebook

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>