కలం, నిజామాబాద్ బ్యూరో : ప్రజల సౌకర్యార్ధం అభివృద్ధి పనులను నిరంతరంగా చేపడుతున్నామని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ షబ్బీర్ అలీ (Shabbir Ali), ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. నిజామాబాద్ (Nizamabad) నగరంలోని వివిధ డివిజన్లలో అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ, అదనపు కలెక్టర్ అంకిత్ తదితరులతో కలిసి పలు అభివృద్ధి పనులకు ఆదివారం శంకుస్థాపనలు చేశారు. నగరంలోని ఆయా డివిజన్లలో రూ. 60 కోట్ల టీయూఎఫ్ఐడీసీ నిధులతో చేపడుతున్న అంతర్గత రోడ్లు, సీసీ డ్రెయిన్లు, కల్వర్టుల నిర్మాణ పనులకు వినాయకనగర్ వద్ద శంకుస్థాపన చేశారు.
అదేవిధంగా సుమారు రూ. 6 కోట్లను వెచ్చిస్తూ అధునాతన సాంకేతికతతో నిర్మిస్తున్న ఇండోర్ విద్యుత్ సబ్ స్టేషన్ పనులకు భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా షబ్బీర్ అలీ, మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ, ప్రజలకు మరింత మెరుగైన సౌకర్యాలు అందుబాటులోకి తేవాలనే లక్ష్యంతో కోట్లాది రూపాయల నిధులను వెచ్చిస్తూ రోడ్లు, డ్రైనేజీలు, మంచినీటి సరఫరా విస్తరణ వంటి అభివృద్ధి పనులను చేయిస్తున్నామని అన్నారు. జిల్లాను అన్ని రంగాలలో అగ్రగామిగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో కలిసికట్టుగా కృషి చేస్తున్నామని తెలిపారు. ప్రజల అవసరాలను గుర్తిస్తూ తమ ప్రభుత్వం అభివృద్ధి పనులకు పెద్ద ఎత్తున నిధులు మంజూరు చేస్తోందన్నారు.
నిజామాబాద్ నగర అభివృద్ధి కోసం మంజూరైన నిధులే ఇందుకు నిదర్శనం అని అన్నారు. గతంలో నిధుల కేటాయింపులో వివక్ష ఉండేదని, కానీ ఇప్పుడు పార్టీలకు అతీతంగా 60 డివిజన్లలో ఒక్కో డివిజన్‌కు కోటి రూపాయలు చొప్పున నిధులు కేటాయించి అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు. డ్రైనేజీ వ్యవస్థ మెరుగుదల, అంతర్గత రోడ్ల నిర్మాణం, వీధి దీపాల ఏర్పాటు వంటి మౌలిక వసతులకు పెద్దపీట వేస్తున్నామని, తమ ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత స్వల్ప కాలంలోనే నగర ప్రగతి కోసం రూ. 500 కోట్ల పైచిలుకు నిధులు ఖర్చు చేశామని అన్నారు. నిజామాబాద్ నగరాన్ని ‘మోడల్ సిటీ’గా తీర్చిదిద్దడమే లక్ష్యంగా ముందుకెళ్తున్నామని వారు స్పష్టం చేశారు. ఈ కార్యక్రమాలలో నుడా చైర్మన్ కేశవేణు, మాజీ ఎమ్మెల్సీ అర్కెల నర్సారెడ్డి, నగర పాలక సంస్థ కమిషనర్ దిలీప్ కుమార్, నిజామాబాద్ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ నగేష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Read Also: రేవంత్ నిజాయితీ గల మోసగాడు : కేటీఆర్
Follow Us On : WhatsApp


