కలం, వెబ్ డెస్క్: తెలంగాణ రాజకీయాల్లో సోషల్ మీడియా వేదికగా సాగుతున్న దుష్ప్రచారంపై మాజీ మంత్రి, ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి (Jagadish Reddy) ఘాటు వ్యాఖ్యలు చేశారు. ప్రతిపక్ష నేతలను లక్ష్యంగా చేసుకుని అడ్డగోలు రాతలు రాస్తున్న ఘోస్ట్ సైట్ల వెనుక అధికార కాంగ్రెస్ పార్టీ హస్తం ఉందని ఆయన సంచలన ఆరోపణలు చేశారు. గాంధీ భవన్, ముఖ్యమంత్రి కార్యాలయం (CMO) నుంచే ఈ సైట్లు ఆపరేట్ అవుతున్నాయని, వీటి ద్వారానే బీఆర్ఎస్ నేతలపై బురద చల్లుతున్నారని ఆయన మండిపడ్డారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో జరిగిన మున్సిపల్ ఎన్నికల సన్నాహక సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు.
గత కొంతకాలంగా బీఆర్ఎస్ అగ్రనేతలు కేసీఆర్, కేటీఆర్ కుటుంబ సభ్యులను లక్ష్యంగా చేసుకుని సోషల్ మీడియాలో వస్తున్న అసత్య ప్రచారాల వెనుక ప్రభుత్వ హస్తం ఉందని జగదీష్ రెడ్డి (Jagadish Reddy) స్పష్టం చేశారు. ‘ఇష్టమొచ్చినట్లు పిచ్చి రాతలు రాయించినప్పుడు అధికారులకు సోయి లేదా?’ అని ఆయన నిలదీశారు. కేటీఆర్ కుటుంబ సభ్యులను ఇబ్బంది పెట్టేలా మంత్రులు మాట్లాడినప్పుడు మౌనంగా ఉన్న యంత్రాంగం, ఇప్పుడు కాంగ్రెస్ మంత్రులపై ఆరోపణలు రాగానే ఉరుకులు పరుగులు పెడుతోందని ఆయన విమర్శించారు.
ఐఏఎస్ (IAS), ఐపీఎస్ (IPS) అధికారులు నిష్పక్షపాతంగా వ్యవహరించడం లేదని జగదీష్ రెడ్డి ధ్వజమెత్తారు. మొదటి నుంచీ ప్రతిపక్షాలపై వస్తున్న తప్పుడు రాతలపై చర్యలు తీసుకుంటే బాగుండేదని, కానీ ఇప్పుడు కేవలం అధికార పక్షాన్ని కాపాడుకోవడానికే పైస్థాయి అధికారులు స్పందిస్తున్నారని ఆరోపించారు. రాజకీయాల్లో విలువలు పాటించాల్సిన బాధ్యత అందరిపై ఉందని, తప్పుడు రాతలు ఎవరిపై వచ్చినా చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.
ప్రభుత్వం ముందుగా గాంధీ భవన్, సీఎం ఆఫీస్ కేంద్రంగా నడుస్తున్న ఆ ఘోస్ట్ సైట్లను మూసివేయాలని జగదీష్ రెడ్డి డిమాండ్ చేశారు. అడ్డగోలు ప్రచారాలతో కాలక్షేపం చేయడం మానేసి, రాష్ట్ర అభివృద్ధిపై దృష్టి పెడితే మంచిదని హితవు పలికారు. రేవంత్ రెడ్డి తన రాజకీయ అవసరాల కోసం తెలంగాణ ప్రయోజనాలను పక్కన పెట్టి, మరోవైపు ఇలాంటి చిల్లర రాజకీయాలకు పాల్పడుతున్నారని ఆయన (Jagadish Reddy) ఆగ్రహం వ్యక్తం చేశారు.
Read Also: రేవంత్ నిజాయితీ గల మోసగాడు : కేటీఆర్
Follow Us On: X(Twitter)


