కలం, కరీంనగర్ బ్యూరో : భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ, డీవైఎఫ్ఐ, ఐద్వా జిల్లా కమిటీల ఆధ్వర్యంలో బండి భగీరథ్ ను అరెస్టు చేసి రిమాండ్ చేయాలని నిరసన తెలిపారు. మంగళవారం కరీంనగర్ (Karimnagar) లోని తెలంగాణ చౌక్ వద్ద నిర్వహించిన కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షులు శనిగరపు రజినీకాంత్, డీవైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి నరేష్ పటేల్ మాట్లాడారు. మైనర్ బాలికపై లైంగిక దాడికి పాల్పడ్డ గాని ప్రభుత్వం ఏ మాత్రం చర్యలు తీసుకోకుండా బండి సంజయ్ కొడుకుకి కొమ్ము కాస్తూ ప్రభుత్వ చట్టాలను ఉల్లంఘిస్తున్నారని విమర్శించారు.
బండి సంజయ్ అధికార బలంతో తన కొడుకు చేసిన తప్పుల్ని కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. అధికార అహంకారంతో మహిళల భద్రతను బండి సంజయ్ తాకట్టు పెడతారా అని ప్రశ్నించారు. పోక్సో కేసు నమోదైన బీజేపీ నాయకత్వం స్పందించడం లేదన్నారు. రాష్ట్రంలో ఎక్కడైనా అల్లర్లు సృష్టించడం, మతోన్మాదం పేరుతో గొడవలు చేయడం మాత్రమే బీజేపీ నైజామా? అని దుయ్యబట్టారు. దేశంలో చట్టాన్ని, భద్రతను కాపాడాల్సిన కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి ఇంట్లోనే చట్టాన్ని ఉల్లంఘించడం ద్వారా సమాజానికి ఏం సందేశాన్నిస్తున్నారని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు.
తన కుమారుడిపై పోక్సో కేసు నమోదు అవుతుంటే ఏ నైతిక విలువలతో తన కేంద్ర మంత్రి పదవిలో కొనసాగుతున్నారన్నారు. బండి సంజయ్ తక్షణమే తన మంత్రి పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. మైనర్ బాలిక తల్లి ఫిర్యాదు చేసినా రాష్ట్ర ప్రభుత్వం, పోలీస్ యంత్రాంగం బండి సంజయ్ కి కొమ్ము కాస్తున్నాయని ఆరోపించారు. ఇప్పటికైనా భగీరథ్ ను అరెస్టు చేసి రిమాండ్ చేయాలని డిమాండ్ చేశారు . అన్యాయానికి గురైన మైనర్ బాలిక కుటుంబానికి భద్రత కల్పించాలన్నారు.
ఈ కేసుపై సమగ్ర విచారణ జరిపించాలని లేకపోతే డీజీపీ కార్యాలయాన్ని ముట్టడిస్తాం అని వారు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్ష,కార్యదర్శులు కాంపెల్లి అరవింద్, గజ్జెల శ్రీకాంత్ జిల్లా సహాయ కార్యదర్శులు దుర్గం బోగేష్, గట్టు ఆకాష్ జిల్లా కమిటీ సభ్యులు రత్నం సురేష్, రాకేష్, సందేశ్, నాయకులు సన్నీ, డివైఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షుడు శివకుమార్ రాజ్ కుమార్, సహాయ కార్యదర్శులు అశోక్, అరవింద్, నాయకులు విజయ్, చందు, సిన, నితిన్ కుమార్, ఐద్వా నాయకురాలు చెనీ రోజా, ఉప్పునూటి లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

