కలం, వెబ్ డెస్క్ : చెరువుల పరిరక్షణ దిశగా హైడ్రా (HYDRAA) కీలక ముందడుగు వేసింది. ఆక్రమణదారులు మట్టితో చెరువులను పూడ్చివేసే ప్రయత్నాలకు అడ్డుకట్ట వేస్తూ పటిష్టమైన నిఘా వ్యవస్థను సిద్ధం చేసింది. నగరవ్యాప్తంగా ఉన్న చెరువుల వద్ద నిరంతరం పర్యవేక్షణ కొనసాగేలా సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేసింది.
ఈ కెమెరాలన్నింటినీ హైడ్రా కార్యాలయంలోని ప్రధాన సర్వర్‌కు అనుసంధానించారు. దీనివల్ల క్షేత్రస్థాయిలో ఏం జరుగుతుందో ఉన్నతాధికారులు కార్యాలయం నుంచే నేరుగా వీక్షించే అవకాశం కలిగింది. నగరంలోని 264 చెరువుల వద్ద మొత్తం 900 సీసీటీవీ కెమెరాలను అమర్చారు. హైడ్రా కమిషనర్ ఏ.వి. రంగనాథ్ (A.V. Ranganath) మంగళవారం ఈ అత్యాధునిక నిఘా వ్యవస్థను అధికారికంగా ప్రారంభించారు.

