కలం, వెబ్ డెస్క్: ఐపీఎల్ (IPL) 2026 సీజన్‌లో వరుస ఓటములతో సతమతమవుతున్న చెన్నై సూపర్ కింగ్స్ (CSK)కు ఒక ఆశాకిరణం లభించింది. భారీ ధర వెచ్చించి కొనుగోలు చేసిన యువ ఆల్‌రౌండర్ ప్రశాంత్ వీర్ (Prashant Veer), బెంగళూరుతో జరిగిన గత మ్యాచ్‌లో మెరుపు ఇన్నింగ్స్‌తో ఆకట్టుకున్నారు. ఈ నేపథ్యంలో ప్రశాంత్ ప్రతిభపై మాజీ క్రికెటర్లు మనోజ్ తివారీ (Manoj Tiwary), వీరేంద్ర సెహ్వాగ్ (Virender Sehwag) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వేలంలో 14.20 కోట్ల భారీ ధరకు అమ్ముడైన ప్రశాంత్ వీర్, తన అరంగేట్రం మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్‌పై కేవలం ఆరు పరుగులు మాత్రమే చేసి నిరాశపరిచారు.
అయితే, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన తర్వాతి మ్యాచ్‌లో 29 బంతుల్లో 43 పరుగులు చేసి తన సత్తా చాటారు. జట్టు ఓడిపోయినప్పటికీ, ప్రశాంత్ పోరాట పటిమను మాజీ ఆటగాడు మనోజ్ తివారీ ప్రశంసించారు. ప్రశాంత్ అగ్రశ్రేణి క్రికెట్ ఆడగల సామర్థ్యం కలవాడని నిరూపించుకున్నాడని, అయితే ఇదే ఫామ్‌ను నిలకడగా కొనసాగించాలని ఆయన సూచించారు. మరోవైపు, సీజన్ ఆరంభంలోనే మూడు వరుస ఓటములు చవిచూసిన రుతురాజ్ గైక్వాడ్ సేనపై ఒత్తిడి పెరుగుతోంది.
గత 2025 సీజన్‌లో కూడా పట్టికలో అట్టడుగున నిలిచిన చెన్నై, ప్రస్తుతం కొత్త టీమ్ నిర్మాణంలో ఉందని వీరేంద్ర సెహ్వాగ్ (Sehwag) గుర్తు చేశారు. ఒకప్పుడు ముంబై ఇండియన్స్ కూడా వరుసగా ఐదు మ్యాచులు ఓడిపోయి, ఆ తర్వాత పుంజుకుని క్వాలిఫై అయ్యిందని ఆయన ఉదాహరణగా చెప్పారు. ప్రస్తుతం జట్టులో యువ ఆటగాళ్లు ఎక్కువగా ఉన్నందున ఇలాంటి ఫలితాలు సహజమని, త్వరలోనే సీఎస్‌కే తిరిగి పుంజుకుంటుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. గతంలో 2022లో రవీంద్ర జడేజా నాయకత్వంలో కూడా సీఎస్‌కే ఇలాగే వరుసగా నాలుగు ఓటములతో సీజన్‌ను ప్రారంభించింది. ప్రస్తుత 2026 సీజన్‌లో కూడా అదే పరిస్థితి పునరావృతం కాకుండా ఉండాలంటే శనివారం, ఏప్రిల్ 11న ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరగబోయే మ్యాచ్‌లో గెలుపు అత్యవసరం.
Read Also: ఎండల నుంచి ఉపశమనానికి ఆయుర్వేద చిట్కాలు
Follow Us On: X(Twitter)

