కలం, ఖమ్మం బ్యూరో : సామాజిక న్యాయం కోసం జీవితాంతం పోరాడిన మహనీయుడు మహాత్మా జ్యోతిరావు ఫూలే (Jyotirao Phule) అని రాష్ట్ర రెవెన్యూ, హౌజింగ్, సమాచార పౌరసంబంధాల శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి (Minister Ponguleti Srinivasa Reddy) పేర్కొన్నారు. ఖమ్మం నగరంలోని శ్రీ శ్రీ సర్కిల్ వద్ద వెనుకబడిన తరగతుల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన మహాత్మా జ్యోతిరావు ఫూలే జయంతి కార్యక్రమంలో మంత్రి పొంగులేటి, జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఫూలే విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.
మంత్రి మాట్లాడుతూ.. సమ సమాజ నిర్మాణంలో జ్యోతిరావు ఫూలే కీలక పాత్ర పోషించారని తెలిపారు. కుల, మత వివక్షలు తీవ్రమైన ఆ కాలంలోనే సామాజిక సంస్కరణలకు ఫూలే శ్రీకారం చుట్టారని గుర్తుచేశారు. ముందుగా తన భార్య సావిత్రిబాయి ఫూలేకు విద్యాబోధన చేసి, ఆమె ద్వారా బాలికల విద్యకు మార్గం సుగమం చేసిన గొప్ప సంస్కర్తగా ఆయనను కొనియాడారు. అప్పటి సమాజంలో కుల వివక్ష కారణంగా అనేక వర్గాల ప్రజలను దేవాలయాలు, పాఠశాలల్లోకి అనుమతించని పరిస్థితులను ఫూలే ధైర్యంగా ఎదిరించి సమాజంలో మార్పు తీసుకువచ్చారని మంత్రి (Minister Ponguleti) పేర్కొన్నారు.
వెనుకబడిన వర్గాల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని, బీసీ వర్గాల అభ్యున్నతికి పలు సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నామని స్పష్టం చేశారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్ అంశంపై ప్రభుత్వం చిత్తశుద్ధితో ప్రయత్నిస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ పి. శ్రీనివాస రెడ్డి, పాలేరు నియోజకవర్గ ప్రత్యేక అధికారి రమేష్, జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ధి అధికారి జి. జ్యోతి తదితరులు పాల్గొన్నారు.
Read Also: తప్పుడు ప్రచారం చేస్తే చెప్పుతో కొడతా: సీతక్క స్ట్రాంగ్ వార్నింగ్
Follow Us On: Instagram

