ఛత్తీస్‌గఢ్(Chhattisgarh) రాష్ట్రంలోని సుక్మా జిల్లా, ఎప్పటినుంచో మావోయిస్టు కార్యకలాపాలకు అడ్డాగా ఉంది. ఇక్కడ అనేక రహస్య ప్రాంతాల్లో మావోయిస్టులు స్వయంగా ఆయుధాలు(Maoist Arms) తయారు చేస్తూ పోలీసులు, భద్రతా బలగాలకు సవాల్ విసురుతున్నారు. తాజాగా భద్రతా దళాలు వ్యూహాత్మక ఆపరేషన్‌లో చేపట్టాయి. మావోయిస్టుల ఆయుధ తయారీ కేంద్రాన్ని (ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ) స్వాధీనం చేసుకున్నాయి. భారీ మొత్తంలో ఆయుధాలు, సామగ్రిని లభ్యం చేసుకున్నాయి. ఈ ఘటన మావోయిస్టులకు భారీ ఎదురుదెబ్బగా మారింది.
గోంగూడ-కంచాల అడవుల్లో భద్రతా బలగాలు కూంబింగ్ చేపట్టాయి. సుక్మా జిల్లాలోని గోంగూడ, కంచాల ప్రాంతాలకు చెందిన దట్టమైన అడవులు మావోయిస్టులకు సురక్షిత ఆశ్రయంగా ఉండేవి. మంగళవారం డిస్టిక్ట్ రిజర్వ్ గార్డ్ (డీఆర్‌జీ) బలగాలు ఈ ప్రాంతంలో విస్తృతమైన కూంబింగ్ ఆపరేషన్ చేపట్టాయి. ఇంటెలిజెన్స్ సమాచారం ఆధారంగా నిర్వహించిన ఈ ఆపరేషన్‌లో డీఆర్‌జీ జవాన్లు అప్రమత్తంగా ముందుకు సాగారు. అడవిలో రహస్యంగా ఉన్న స్థావరాన్ని గుర్తించారు. ఇది మావోయిస్టులు ఆయుధాలు(Maoist Arms) తయారు చేసే ఆర్డినెన్స్ ఫ్యాక్టరీగా గుర్తించారు.
ఈ ఫ్యాక్టరీలో మావోయిస్టులు రైఫిల్స్, రాకెట్ లాంచర్లు వంటి భారీ ఆయుధాలను తయారు చేస్తున్నట్టు తేలింది. భద్రతా దళాలు ఈ ప్రాంతాన్ని పూర్తిగా సీజ్ చేసి, లోపల ఉన్న సామగ్రిని స్వాధీనం చేసుకున్నాయి. 17 రైఫిల్స్, రాకెట్ లాంచర్లు, ఆయుధాల తయారీ సామగ్రి, పరికరాలు, మెషినరీ, ముడి సామగ్రి, టూల్స్ వంటివి లభ్యమైనట్టు తెలిసింది.
ఈ సామగ్రి మావోయిస్టులు భవిష్యత్తులో దాడులు చేయడానికి సిద్ధం చేసుకున్నట్టు సూచిస్తోంది. ఈ ఆపరేషన్ సమయంలో మావోయిస్టులు పారిపోయినట్టు తెలుస్తోంది. ఈ ప్రాంతంలో ఎటువంటి ఎదురుకాల్పులు జరగలేదు. సుక్మా జిల్లా పోలీస్ సూపరింటెండెంట్ (ఎస్పీ) కిరణ్ చవాన్ ఈ ఘటనను అధికారికంగా ధ్రువీకరించారు. “డీఆర్‌జీ బలగాలు చేపట్టిన ఆపరేషన్ విజయవంతమైంది.’ అని పేర్కొన్నారు. డీఆర్‌జీ జవాన్ల ధైర్యం, నైపుణ్యాన్ని ఆయన ప్రత్యేకంగా అభినందించారు.
“మావోయిస్టులు తమ తప్పిదాలను గుర్తించి, ఆయుధాలు పక్కన పెట్టి, జనజీవన స్రవంతిలోకి వచ్చి చక్కటి జీవితాన్ని ప్రారంభించుకోవాలి. ప్రభుత్వం సరెండర్ పాలసీ ద్వారా వారికి అవకాశం ఇస్తోంది. హింసను విడనాడితే, సమాజంలో గౌరవప్రదమైన జీవితం సాధ్యమవుతుంది.” అని ఆయన పేర్కొన్నారు.
ఈ ఆపరేషన్ సుక్మా జిల్లాలో మావోయిస్టు కార్యకలాపాలపై పెద్ద దెబ్బగా మారనున్నది. గత కొన్ని నెలలుగా భద్రతా దళాలు ఇలాంటి ఆపరేషన్లను తీవ్రతరం చేశాయి. ఫలితంగా మావోయిస్టుల బలం తగ్గిపోతున్నది. అడవుల్లో ఇంకా కొన్ని రహస్య కేంద్రాలు ఉండవచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు.
Read Also: స్థానిక ఎన్నికలపై హైకోర్టు కీలక ఆదేశాలు.. ఆ తేదీలోపు ఎన్నికలు జరగుతాయా?
Follow Us On : Instagram

