తెలంగాణ రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల(Local Body Polls) అంశం ఎటూ తేలడం లేదు. ఓ వైపు బీసీ రిజర్వేషన్లు పెండింగ్, ఎన్నికల షెడ్యూల్‌ను కోర్టు కొట్టేయడం వెరసి ఎలక్షన్లు వాయిదా పడ్డాయి. ఈ ఎన్నికలు ఎప్పుడు జరగబోతున్నాయి అన్న విషయంపై క్లారిటీ రావడం లేదు. తాజాగా ఇదే విషయంపై హైకోర్టు(TG High Court) తెలంగాణ ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. స్థానిక సంస్థల ఎన్నికలు ఎప్పటిలోగా నిర్వహిస్తారు? అంటూ ప్రశ్నించింది. ఎన్నికల నిర్వహణలో జరుగుతున్న ఆలస్యం పట్ల హైకోర్టు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. ప్రజాస్వామ్యంలో స్థానిక సంస్థలు కీలకమైనవని, వాటి ఎన్నికలను నిరవధికంగా వాయిదా వేయడం రాజ్యాంగ విరుద్ధమని స్పష్టం చేసింది. ఈ నెల 24వ తేదీ లోపు ఎన్నికల తేదీలను ప్రకటించాలని ప్రభుత్వం, రాష్ట్ర ఎన్నికల సంఘానికి ఆదేశాలు జారీ చేసింది.
రాజ్యాంగ స్పష్టతపై హైకోర్టు దృష్టి
రాజ్యాంగంలోని ఆర్టికల్ 243–E ప్రకారం పంచాయతీల పదవీకాలం ముగిసిన ఆరు నెలల్లోపే కొత్త ఎన్నికలు నిర్వహించాల్సి ఉంటుంది. అయితే తెలంగాణలో స్థానిక సంస్థల కాలపరిమితి పూర్తయ్యి చాలాకాలం అయినా, ఎన్నికల ప్రక్రియ ప్రారంభం కాకపోవడం కోర్టు దృష్టికి వచ్చింది. దీనిపై విచారణ జరిపిన హైకోర్టు, ప్రభుత్వం ఎస్ఈసీ వైఖరిని తీవ్రంగా ప్రశ్నించింది.
బీసీ రిజర్వేషన్ల జాప్యం వల్లే ..
ప్రభుత్వం తరఫు న్యాయవాదులు, బీసీ రిజర్వేషన్ అమలుపై ఉన్న చట్టపరమైన అంశాల కారణంగానే ఎన్నికలు వాయిదా పడ్డాయని వాదించారు. అయితే తాము బీసీ రిజర్వేషన్ల విధానం పట్ల మాత్రమే అభ్యంతరం వ్యక్తం చేశామని, ఎన్నికల నిర్వహణను నిలిపేయమని చెప్పలేదని స్పష్టం చేశారు.
దీనిపై ఎస్ఈసీ, బీసీ రిజర్వేషన్ ఉన్న గ్రామాలను మినహాయించి మిగతా ప్రాంతాల్లో అయినా ఎన్నికలు జరపవచ్చని తెలిపింది. కానీ ఆ ప్రతిపాదనను హైకోర్టు సవాల్ చేస్తూ, ఎన్నికలను విభజించి జరపడం ప్రజాస్వామ్య పద్ధతికి విరుద్ధమని వ్యాఖ్యానించింది.
ప్రజాస్వామ్య ప్రక్రియకు ఆటంకం వద్దు
స్థానిక సంస్థల ఎన్నికలు ప్రజల పాలనలో భాగస్వామ్యానికి మౌలికమైనవని, ప్రభుత్వం సాకులు చెబుతూ ఎన్నికలను వాయిదా వేయడం అంగీకారయోగ్యం కాదని కోర్టు వ్యాఖ్యానించింది. ప్రజాస్వామ్య వ్యవస్థలో నిరంతర ఎన్నికలు నిర్వహించడం రాష్ట్ర ప్రభుత్వ ప్రాధమిక బాధ్యత అని గుర్తు చేసింది. హైకోర్టు(TG High Court) చివరగా, ఈ నెల 24వ తేదీ లోపు తప్పనిసరిగా ఎన్నికల షెడ్యూల్‌ను ప్రకటించి, అవసరమైన ప్రక్రియ ప్రారంభించాలని ఆదేశాలు జారీ చేసింది. ఇక ఈ ఆదేశాల తర్వాత ప్రభుత్వం, ఎన్నికల సంఘం ఏ విధంగా స్పందిస్తాయన్నదే ఇప్పుడు రాష్ట్ర రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
Read Also: యువతిపై గ్యాంగ్ రేప్.. నిందితులపై పోలీసుల కాల్పులు
Follow Us On : Instagram

