కలం, మెదక్ బ్యూరో : తెలంగాణ ప్రభుత్వం తీసుకువచ్చిన సెక్షన్ – 22 ఏ (Section 22A) అంశం ఉమ్మడి మెదక్ జిల్లా బీఆర్ఎస్ పార్టీకి (BRS) సందిగ్ధంలో పడేసింది. రాష్ట్ర రాజధాని హైదరాబాద్ కు దగ్గరగా ఉన్న ఉమ్మడి మెదక్ జిల్లాలో ఎకరాకు కోట్లు రుపాయల పలికే వేలాది ఎకరాల భూమి నిషేదిత జాబితాలోకి వెళ్ళాయి. అయితే తమ ప్రభుత్వ హయంలో జరిగిన భూ వ్యహహరాలు వివాదస్పదంగా ఉండటంతో బీఆర్ఎస్ పార్టీ బడా నాయకులు పరిస్ధితి కక్కలేక మింగలేక అనే పరిస్ధితి నెలకొంది. ముఖ్యంగా ప్రభుత్వం నిర్ణయంపై గట్టిగా ప్రశ్నిస్తే తమకు సంబంధించిన భూములు వ్యవహరాలు ఎక్కడ బయటకు వస్తయోనని లోలోపల మదనపడుతున్నట్లు తెలుస్తోంది.
వేలాది ఎకరాలు నిషేదిత జాబితాలోకి
సంగారెడ్డి జిల్లాలో వేలాది ఎకరాల భూములు నిషేదిత సెక్షన్ 22ఏ జాబితాలోకి వెళ్లాయి. హైదరాబాద్ కు సరిహద్దు జిల్లా కావడంతో పాటు అవుట్ రింగు రొడ్డు, ప్రతిపాదిత రిజినల్ రింగు రొడ్డు జిల్లాలోని చాలా మండలాల్లో వస్తున్న నేపథ్యంలో గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయంలో ఉమ్మడి మెదక్ జిల్లాకు చెందిన ముఖ్యనేతలు ధరణి పేరుతో వేలాది ఎకారల ప్రభుత్వ, అసైన్డ్ , బిల్లా దఖలు భూములను పట్టా భూములుగా మార్చుకున్నరనే అరోపణలు పెద్దఎత్తున ఉన్నాయి. పటాన్ చెరు, అమీన్ పూర్, గుమ్మడిదల , జిన్నారంలోని వేలాది ఎకరాలను జిల్లా ఉన్నతాధికారుల అండతో ఇష్టరాజ్యంగా మార్పిడి చేస్తున్నారని ప్రచారంలో ఉన్నాయి.
బీఆర్ఎస్ పార్టీలో కీలకంగా ఉన్న రాష్ట్రస్థాయి నేత పటాన్ చెరువు నియోజకవర్గంలో రింగురొడ్డు, ఫైనాన్షియల్ల్ డిస్ట్రిక్ట్ కు దగ్గరగా ఉన్న రామచంద్రపురం మండలంలోని కొల్లూరు, వెలిమల, ఈదుల నాగులపల్లి, తెల్లపూర్ , ఉస్మాన్ నగర్ లోని వందలాది ఎకరాలను అప్పటి కలెక్టర్ తో కలిసి రికార్డులను తారుమారు చేసి స్వంతం చేసుకున్నట్టు అరోపణలు ఉన్నాయి. పటాన్‌చెరు నియోజకవర్గ పరిధిలోని 22A (నిషేధిత వ్యవసాయ మరియు వ్యవసాయేతర భూములు) వివరాలు వెల్లడయ్యాయి. నియోజకవర్గ వ్యాప్తంగా మొత్తం 50,565 ఎకరాల భూమి నిషేధిత జాబితాలో ఉన్నట్లు తెలుస్తోంది. గుమ్మడిదల మండలంలో 12,430 ఎకరాల భూమి 22A జాబితాలో ఉంది.
అమీన్‌పూర్ మండలంలో 3,266 ఎకరాల భూమి నిషేధిత పరిధిలోకి వచ్చింది. అమీన్ పూర్ ప్రాంతంలోని నివాస కాలనీలను పెద్దఎత్తున నిషేదిత జాబితాలోకి చేర్చారు. ఫైనన్షియల్ డిస్ట్రిక్ట్ , కోకాపేట కు దగ్గర రామచంద్రాపురం మండలం 8,360 ఎకరాల భూమి నమోదైంది. పటాన్‌చెరు మండలంలో 12,593 ఎకరాల భూమి నిషేధిత జాబితాలో ఉంది. జిన్నారం మండలంలో 13,916 ఎకరాల భూమి 22A కింద నమోదైంది. మొత్తంగా పటాన్ నియోజకవర్గంలోని 50,565 ఎకరాల వ్యవసాయ, వ్యవయేతర భూములు సెక్షన్ 22 ఏ పరిధిలోకి వచ్చాయి.
అందరూ కలిసి.. అసైన్డ్ భూములు స్వాహా..!
సంగారెడ్డి నియోజకవర్గంలోని మరో తరహ భూదోపిడికి తెరతీసారు. పొతిరెడ్డిపల్లి, కంది, కొత్లాపూర్, కొండపూర్, సంగారెడ్డి ప్రాంతాల్లో అయితే అన్ని పార్టీల నాయకులు కలిసికట్టుగా పొతిరెడ్డిపల్లి, కంది ప్రాంతాల్లోని వందలాది ఎకరాల అసైన్డ్ ల్యాండ్ ను రికార్డులు తారుమారు చేసి, పేదలకు కేటాయించిన భూములకు అగ్రిమెంట్లు చేసుకున్నట్లు సృష్టించినట్లు ఆరోపణలు ఉన్నాయి. వీటిని తర్వాత అసైన్డ్ భూములకు ఎన్ఓసీ సర్టిఫికెట్లను తీసుకువచ్చి రియల్ ఎస్టేట్ వెంచర్లుగా మార్చి ప్లాట్లను అమ్ముతున్నారనే విమర్శలు లేకపోలేదు. పారిశ్రామికంగా రానున్న రోజుల్లో ఎంతో అభివృద్ధి కానున్న జహీరాబాద్ నియోజకవర్గంలోని నిమ్జ్ పరిసర ప్రాంతాల్లో వేలాది ఎకరాల ప్రభుత్వ, అసైన్డ్ భూముల రికార్డులను మార్చి సొంతం చేసుకున్నరనే ఆరోపణలు ఉన్నాయి.
హరీష్‌రావు టార్గెట్‌గా మంత్రి పొంగులేటి కౌంటర్
సెక్షన్ 22ఏ విషయంలో ప్రభుత్వంపై విమర్శలు వస్తున్న నేపధ్యంలో రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఇటీవల నిర్వహించిన ప్రెస్ మీట్ లో బీఆర్ఎస్ ముఖ్య నేత హరీష్ రావు గురించి ఉమ్మడి మెదక్ జిల్లాకు చెందిన ప్రభుత్వ, అసైన్డ్ భూముల వ్యవహరంపై ప్రత్యేకంగా ప్రస్తవించారు. మెదక్ జిల్లా నర్సాపూర్ నియోజకవర్గంలో చిప్పల్ తుర్తి గ్రామంలోని 122 ఎకరాలు, సికింద్లాపూర్ గ్రామంలోని 400 ఎకరాల ప్రభుత్వ భూములను సాధారణ ఎన్నికలకు రెండు నెలల కంటే ముందు ఓఅర్సీల పేరుతో రియల్ కంపెనికి 522 ఎకరాల ప్రభుత్వ భూములను అప్పగించడంలో హరీష్ రావు ప్రధాన పాత్రదారి గా ఉన్నాడని పొంగులేటి సంచలన ఆరోపణలు చేశారు.
సంగారెడ్డి జిల్లా పొతిరెడ్డిపల్లి లోని 7 సర్వే నెంబర్లలో ఉన్న అసైన్డ్ భూములను 1958 యాక్ట్ ను అడ్డం పెట్టుకొని, ప్రభుత్వం దగ్గర ఎలాంటి రికార్డులు లేకపొయినప్పటికీ అడ్డదారిలో వందల ఎకరాల అసైన్డ్ భూములను రియల్ ఎస్టేట్ కంపెనీలకు అమ్ముకున్నారని మంత్రి పొంగులేటి హరీష్ రావు ను ఉద్దేశించి విమర్శలు చేశారు. పేదలకు అసైన్డ్ చేసిన భూములను రియల్ ఎస్టేట్ కంపెనీలకు అప్పగించారని మంత్రి ఫైర్ అయ్యారు.
సంగారెడ్డి జిల్లా గుమ్మదిదల మండలం అన్నారం గ్రామంలో సర్వే నెంబర్ 172 ప్రభుత్వ స్ధలమని, సర్వే నెంబర్ 173 ప్రైవేటు భూమి ఉంది. అయితే అనుమతులు ప్రైవేటు పేరుతో 173 లో తీసుకొని, నిర్మాణలు ప్రభుత్వ భూమిలో 172 సర్వే నెంబర్ లో చేస్తురని , బీఆర్ఎస్ ప్రభుత్వ హయంలోనే ఈ అనుమతులు, అక్రమాలు జరిగయని మంత్రి తెలిపారు.
ముందు నుయ్యి .. వెనక గొయ్యి
ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా వేలాది ఎకరాల వ్యవసాయ, వ్యవసాయేతర భూముల సెక్షన్ 22 ఏ పరిధిలోకి వచ్చినప్పటికీ ఏడుగురు ఎమ్మెల్యేలు ఉన్న ఉమ్మడి మెదక్ బీఅర్ఎస్ పార్టీ క్షేత్రస్థాయిలో ఏం చేయాలో అయోమయంలో ఉన్నట్లు కనిపిస్తోంది. బీజేపీ సెక్షన్ 22 ఏ పై ఇప్పటికే క్షేత్రస్ధాయిలో సభలను నిర్వహిస్తోంది. సిద్ధిపేట, నర్సాపూర్, పటాన్ చెరులో ఆ పార్టీ ఎంపీలు సెక్షన్ 22 ఏ పై సభలను నిర్వహించారు.
సెక్షన్ 22 ఏ పై 15 వేల మంది భూ బాధితులతో అమీన్ పూర్ లో భారీ బహిరంగసభ అని ప్రకటించిన బీఆర్ఎస్ చివరికి ఫంక్షన్ హాల్ సమావేశంతో సరిపెట్టింది. ఈ అంశంపై అగ్రెసివ్ గా వెళ్తే ..తమ ప్రభుత్వ హయంలో జరిగిన భూ వ్యవహరాలు బయటకు వస్తే…అది తమకు రాజకీయంగా, అర్ధికంగా ఇబ్బందులు తెస్తాయని కారు పార్టీ ముఖ్య నాయకులు దోబూచులాడుతున్నట్లు తెలుస్తోంది. బీఆర్ఎస్ నేతలకు సంబంధించిన భూములు సైతం సెక్షన్ 22 ఏ జాబితాలో ఉండటంతో ప్రభుత్వాన్ని ఢీకొడితే అది తమకు వ్యక్తిగతంగా నష్టచేస్తుందని భావిస్తున్నారట.
సెక్షన్ 22 ప్రభావిత కాలనీవాసుల, సామన్య ప్రజల మద్దతు ఇవ్వడం వరకు పరిమితం కావాలని… ప్రభుత్వంపై విమర్శలు, భారీ పోరాటలు చేస్తే తమ భూ వ్యవహరాలను బయటకు వస్తయని జాగ్రత్త పడుతున్నారని పార్టీలో చర్చించుకుంటున్నారు. ఉమ్మడి మెదక్ జిల్లా బీఆర్ఎస్ ముఖ్యనాయకులకు చెందిన వేల కోట్ల విలువైన భూములు నిషేధిత జాబితాలో ఉండటంతో, వీటికి సంబంధించి తదుపరి చర్యలు, పరిష్కారాలపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ప్రభుత్వం వీరి విషయంలో ఎలా వ్యవహరించబోతుందనేది వేచిచూడలి. తీగ లాగితే డొంక కదులుతుందని బీఆర్ఎస్ నాయకులు సెక్షన్ 22 ఏ అంశంలో సైలెంట్ ఉంటూ వ్యవహారాన్ని సెటిల్ చేసుకుంటారా లేక ఫైట్ చేస్తారా అనేది ఆసక్తికరంగా మారింది.

