కలం, కరీంనగర్: తెలంగాణలో కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం కొలువుదీరి 1000 రోజులు పూర్తయిన సందర్భంగా కరీంనగర్ జిల్లా కేంద్రంలోని ఇందిరా చౌక్ వద్ద జిల్లా కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో సంబరాలు అంబరాన్నంటాయి. పండుగ వాతావరణంలో జరిగిన ఈ వేడుకల్లో నాయకులు, కార్యకర్తలు బాణాసంచా పేల్చి, డీజే పాటలకు నృత్యాలు చేస్తూ ఉత్సాహంగా పాల్గొన్నారు. అనంతరం ఇందిరా చౌక్ వద్ద భారీ కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ఈ సందర్భంగా జిల్లా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి రూపురెడ్డి కశ్యప్ రెడ్డి సహకారంతో ఏర్పాటు చేసిన ఆహార ప్యాకెట్లను చొప్పదండి ఎమ్మెల్యే, జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు మేడిపల్లి సత్యం (Medipally Sathyam) పేదలకు పంపిణీ చేశారు.
7 లక్షల ఇందిరమ్మ ఇళ్లు మంజూరు..
అనంతరం ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం మాట్లాడుతూ.. తెలంగాణలో గత పదేళ్ల గడీల పాలనకు స్వస్తి పలికి, ప్రజల ప్రభుత్వమైన కాంగ్రెస్ అధికారం చేపట్టి 1000 రోజులు విజయవంతంగా పూర్తయిందన్నారు. ఈ 1000 రోజుల వ్యవధిలోనే ప్రభుత్వం అనేక చారిత్రాత్మక సంక్షేమ పథకాలను అమలు చేసిందని తెలిపారు. రాష్ట్రంలో 7 లక్షల ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేశామని, ప్రతి నియోజకవర్గానికి మొదటి విడతలో 3500, రెండో విడతలో 2000 ఇళ్లు కేటాయించామని పేర్కొన్నారు. అలాగే 15 లక్షల కుటుంబాలకు కొత్త రేషన్ కార్డులు అందజేశామన్నారు.
క్రమం తప్పకుండా పింఛన్లు..
రాష్ట్రంలో 53 లక్షల కుటుంబాలకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్, 43 లక్షల మందికి చేయూత పింఛన్లను క్రమం తప్పకుండా అందిస్తున్నామని చెప్పారు. ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించి, దానికి సంబంధించి ప్రభుత్వం ఆర్టీసీకి రూ. 11,000 కోట్లు చెల్లించిందని వివరించారు. రూ. 500 కే గ్యాస్ సిలిండర్ అందిస్తుండటంతో పాటు, 25 లక్షల మంది రైతులకు రూ. 2 లక్షల వరకు రుణమాఫీ చేశామని, సన్న వడ్లకు రూ. 500 బోనస్ చెల్లిస్తున్నామని అన్నారు.
కేసీఆర్‌పై ఫైర్..
బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో కేవలం 2 లక్షల ఉద్యోగాలు ఇచ్చామని చెప్పుకుంటే, కాంగ్రెస్ ప్రభుత్వం కేవలం 1000 రోజుల్లోనే 70 వేలకు పైగా నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించిందని, త్వరలోనే మిగిలిన ఖాళీలకు నోటిఫికేషన్లు ఇస్తామని స్పష్టం చేశారు. ప్రతిపక్ష నేత కేసీఆర్ ఫామ్‌హౌస్‌కే పరిమితమై 1000 రోజులుగా ప్రజల మధ్యకు రావడం లేదని, ఆయన తక్షణమే తన పదవికి రాజీనామా చేయాలని ఎమ్మెల్యే డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ నాయకులు ఓటమి ఫ్రస్ట్రేషన్లో ఏదేదో మాట్లాడుతున్నారని, రాబోయే ఎన్నికల్లో కూడా తెలంగాణ ప్రజలు కాంగ్రెస్‌కే పట్టం కట్టడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.
ఈ కార్యక్రమంలో కార్పొరేషన్ కాంగ్రెస్ అధ్యక్షుడు వైద్యుల అంజన్ కుమార్, హుజురాబాద్ నియోజకవర్గ ఇంచార్జ్ ఒడితెల ప్రణవ్ బాబు, పీసీసీ ప్రధాన కార్యదర్శి రహమత్ హుస్సేన్, మాజీ సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే ఆరెపల్లి మోహన్, కాంగ్రెస్ నేత ఆల్ఫోర్స్ నరేందర్ రెడ్డి, ఇతర ముఖ్య నేతలు పురుమల్ల శ్రీనివాస్, ఒడితెల ప్రణవ్, గడ్డం విలాస్ రెడ్డి, ఉప్పుల అంజని ప్రసాద్, సిరాజ్ హుస్సేన్, మల్లికార్జున రాజేందర్, పెద్ద సంఖ్యలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

