కలం, ఖమ్మం బ్యూరో: రాజకీయాల్లో ఎంతటి ఉన్నత స్థాయికి ఎదిగినా.. గురువు ముందు తాను ఎప్పటికీ ఓ వినయపూర్వకమైన శిష్యుడినేనని పినపాక (Pinapaka) ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు (MLA Payam) చాటుకున్నారు. ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకుని శనివారం తన చిన్ననాటి గురువును స్వయంగా కలిసి ఆశీస్సులు తీసుకున్నారు. పినపాక మండల కేంద్రంలో నివాసముంటున్న తన చిన్ననాటి హైస్కూల్ తెలుగు ఉపాధ్యాయుడు ఎల్లాప్రగడ రామ్మూర్తి ఇంటికి ఎమ్మెల్యే పాయం ఎలాంటి ఆర్భాటం లేకుండా నేరుగా వెళ్లారు. గురువును చూడగానే ఆప్యాయంగా పలకరించి, పూలబొకే అందించారు. అనంతరం శాలువాతో సత్కరించి, గురువు పాదాలకు నమస్కరించి ఆశీస్సులు తీసుకున్నారు.
శిష్యుడి ఎదుగుదల చూసి గురువు భావోద్వేగం
ఒక సాధారణ విద్యార్థి స్థాయి నుంచి నేడు ప్రజాప్రతినిధిగా ఎదిగిన తన శిష్యుడు తనను గుర్తు పెట్టుకుని ఇంటికి వచ్చి సత్కరించడంతో తెలుగు ఉపాధ్యాయుడు ఎల్లాప్రగడ రామ్మూర్తి భావోద్వేగానికి లోనయ్యారు. గురుశిష్యుల మధ్య ఉన్న ఆప్యాయత ఈ సందర్భంగా మరోసారి కనిపించింది. ప్రజాప్రతినిధిగా ఉన్నప్పటికీ తన చిన్ననాటి గురువును మరచిపోకుండా స్వయంగా ఇంటికి వెళ్లి గౌరవించడం ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు వినయానికి నిదర్శనమని స్థానికులు, విద్యాభిమానులు ప్రశంసించారు. గురువును గౌరవించే సంస్కృతికి ఈ ఘటన నేటి తరానికి ఆదర్శంగా నిలుస్తుందని పేర్కొన్నారు.

