కలం, నిజామాబాద్ బ్యూరో: నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణం రాకాసిపేట్ లోని ‘సహారా మీ సేవ’ కేంద్రంగా నకిలీ ప్రభుత్వ సర్టిఫికెట్లు (Fake Certificate) తయారు చేసే దందను పోలీసులు గుట్టు రట్టు చేశారు. విశ్వసనీయ సమాచారం మేరకు, నిజామాబాద్ పోలీస్ కమీషనర్ ఆదేశాలతో నిజామాబాద్ CCS ACP శ్రీశైలం, CCS సిబ్బంది బోధన్ పోలీస్ సిబ్బంది మీ సేవా కేంద్రంలో తనిఖీలు నిర్వహించారు.
మీ సేవ ఆపరేటర్ షేక్ వసీమ్ తక్కువ సమయంలో ఎక్కువ డబ్బులు సంపాదించాలనే దురాశతో గత రెండేళ్ల నుండి మీ సేవ యజమాని మహమ్మద్ ముక్రమ్ ఇతరులతో కలిసి తన మీ సేవ సెంటర్ లో ఇంటిదగ్గర నకిలీ మీ సేవ సర్టిఫికేట్ లు తయారు చేసి ఇస్తున్నాడు. సర్టిఫికేట్ లపై సంబందిత రబ్బర్ స్టాంప్ లు వేసి ఒరిజినల్ సర్టిఫికేట్ ల లాగా ఇస్తున్నారు. ఒక్కో సర్టిఫికెట్ కు రూ. 5,000/- నుండి రూ. 10,000/- వరకు వసూలు చేసి పంచుకునేవారు. ఆ సర్టిఫికేట్లను తీసుకున్నవారు మోసపూరితముగా ప్రభుత్వము నుండి లబ్ది పొందడానికి ఆ నకిలీ సర్టిఫికేట్ లను ఉపయోగిస్తున్నారని తెలిసింది.
పోలీసులు దాడి చేసి నిందితులను అరెస్ట్ చేశారు. తయారు చేసిన నకిలీ మీసేవ సర్టిఫికేట్ లు-05, ఇప్పటికే తయారు చేసి ఇచ్చిన నకిలీ మీసేవ జనన ధృవీకరణ జిరాక్స్ పత్రాలు-22, తయారు చేయడానికి ఉంచిన మీసేవ ఖాళీ ఒరిజినల్ సర్టిఫికేట్లు- 38, రబ్బర్ స్టాంప్-01, తయారు చేసిన నకిలీ T.C. బోనఫైడ్ లు-13, షాదీ ముబారక్ కు సంబంధించి తయారు చేసిన నకిలీ జిరాక్స్ కాపీలు-01, ల్యాప్‌టాప్ – 01, కలర్ ప్రింటర్ – 01, సెల్ ఫోన్ -02 పత్రాలను ఎలక్ట్రానిక్ పరికరాలను స్వాధీనం చేసుకున్నారు. పరారీలో ఉన్న మిగతా నిందితుల గాలింపు చేపట్టారు.

