లద్దాఖ్(Laddak) అల్లర్ల నేపథ్యంలో అరెస్ట్ అయిన ఉద్యమ నేత సోనమ్ వాంగ్‌చుక్(Sonam Wangchuk)కు సుప్రీంకోర్టులో ఊరట లభించింది. అతని అరెస్ట్‌ను ఛాలెంజ్ చేస్తూ వాంగ్‌చుక్ భార్య గీతాంజలి జో అంగ్మో.. సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. తన భర్తను జాతీయ భద్రతా చట్టం(NSA) కింద అరెస్ట్ చేయడాన్ని ఆమె తప్పుబట్టారు. ఆమె పిటిషన్‌ను స్వీకరించిన న్యాయస్థానం కేంద్రం, జమ్మూకశ్మీర్ యంత్రాంగం, రాజస్థాన్ ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. ఈ క్రమంలో వాంగ్‌చుక్‌కు సుప్రీంకోర్టులో భారీ ఊరట లభించింది. వాంగ్‌చుక్‌ను ఎన్‌ఎస్‌ఏ కింద నిర్బంధించడానికి ముందు అతని భార్య గీతాంజలికి ఎందుకు ముందస్తు నోటీసులు ఇవ్వలేదని అత్యున్నత న్యాయస్థానం.. కేంద్రాన్ని ప్రశ్నించింది. ఈ అంశంపై అఫిడవిట్ దాఖలు చేయాలని కేంద్రం, జమ్మూకశ్మీర్ యంత్రాంగం, రాజస్థాన్ ప్రభుత్వాన్ని ఆదేశించింది.
అయితే తన భర్తను అరెస్ట్ చేయడం అన్యాయమని గీతాంజలి పేర్కొన్నారు. ఆయన(Sonam Wangchuk)ను తక్షణమే విడుదల చేసేలా ఆదేశాలివ్వాలని పిటిషన్‌లో కోరారు. తన భర్తను ఎటువంటి విచారణ లేకుండానే రాజస్థాన్‌లోని జోధ్‌పుర్ జైలులో నిర్భందించారని, అతనిని వెంటనే న్యాయస్థానం ముందు హాజరుపరచాలని ఆమె కోరారు. సెప్టెంబర్ 26న అరెస్ట్ చేసినప్పటి నుంచి ఇప్పటి వరకు తన భర్తతో మాట్లాడటానికి కూడా అంగీకరించడం లేదని, కలవనివ్వట్లేదని ఆమె ఆరోపించారు. తన భర్తతో మాట్లాడటానికి అవకాశం కల్పించాలని కూడా ఆమె అభ్యర్థించారు.

