ఆంధ్ర సీఎం చంద్రబాబుపై మాజీ మంత్రి, వైసీపీ నేత గుడివాడ అమర్నాథ్(Gudivada Amarnath) విమర్శలు గుప్పించారు. ఆయనలా మాటలు మార్చడం తమ పార్టీ నేతలకు తెలియదని అన్నారు. అధికారంలో ఉంటే ఒకలా మాట్లాడటం.. అధికారం పోతే మరోలా మాట్లాడటం చంద్రబాబు(Chandrababu)కే చెల్లుతుందని చురకలంటించారు. మొదటి నుంచి కూడా విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంశంలో వైసీపీ ఒకే మాటపై ఉందని స్పష్టం చేశారు. తాము స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు అప్పుడూ వ్యతిరేకమని, ఇప్పుడూ వ్యతిరేకమని, రానున్న రోజుల్లో కూడా వ్యతిరేకంగానే ఉంటామని చెప్పారు. ఈ నెల 9న మాజీ ముఖ్యమంత్రి జగన్.. విశాఖలో పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో సోమవారం విశాఖలో నిర్వహించిన సన్నాహక సమావేశంలో గుడివాడ అమర్నాథ్ పాల్గొన్నారు. ఈ సమావేశంలో 9 నియోజకవర్గాల మీదుగా రోడ్ షోగా వెళ్లే అవకాశంపై చర్చించారు.
‘‘కేంద్రం చేస్తున్న ఆలోచనలు తెలిసి కూడా వాటిని అడ్డుకోవడంలో విఫలమైన కేంద్రమంత్రి కింజారపు రామ్మోహన్ నాయుడు(Ram Mohan Naidu) వెంటనే రాజీనామా చేయాలి’’ అని డిమాండ్ చేశారు. ‘‘చంద్రబాబులా అధికారం ఉంటే ఒకలా, లేకపోతే మరోలా మాట్లాడటం మాకు, మా అధినేత జగన్‌కు తెలీదు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత స్టీల్ ప్లాంట్‌లో 10వేల మంది ఉద్యోగాలు కోల్పోయారు. కూటమి ప్రభుత్వం పేదోళ్ల కడుపుకొడుతోంది. పేదవాడికి ఉచిత వైద్యం ఇష్టం లేకనే మెడికల్ కాలేజీలను ప్రైవేటు పరం చేస్తున్నారు చంద్రబాబు’’ అని Gudivada Amarnath విమర్శించారు.

