కలం, స్పోర్ట్స్ : 2026 ఆసియా క్రీడల్లో భారత అథ్లెట్ సావన్ బర్వాల్(Sawan Barwal) అద్భుత చరిత్ర సృష్టించారు. శనివారం జపాన్‌లోని నాగోయాలో జరిగిన పురుషుల మారథాన్‌లో (Marathon) ఆయన రజత పతకం సాధించారు. దీనితో ఈ విభాగంలో పతకం కోసం భారత్ ఎదురుచూస్తున్న 44 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణకు తెరపడింది. సావన్ బర్వాల్ 2 గంటల 11 నిమిషాల 37 సెకన్లలో రేసు పూర్తి చేసి తన వ్యక్తిగత ఉత్తమ సమయాన్ని నమోదు చేశారు.
జపాన్‌కు చెందిన ఇచ్చితాక యమాషితా 2:10:49 సమయంతో స్వర్ణం గెలవగా, చైనాకు చెందిన పేయు ఫెంగ్ 2:12:13 సమయంతో కాంస్యం దక్కించుకున్నారు. భారత కాలమానం ప్రకారం శనివారం ఉదయం 4 గంటలకు ఈ పోటీ ప్రారంభమైంది. మొత్తం 19 మంది రేసర్లలో సావన్ బర్వాల్, కార్తీక్ కర్కేరా భారత్ తరఫున బరిలోకి దిగారు. ఆరంభం నుంచే ముందంజలో ఉన్న సావన్, సగం దూరం ముగిసేసరికి 1:05:54 సమయంతో రెండో స్థానంలో నిలిచారు.
రేసు చివర వరకు అదే వేగాన్ని కొనసాగించారు. చివరి ఏడు కిలోమీటర్ల దూరంలో విజేత యమాషితాను అందుకోవడానికి సావన్ ప్రయత్నించారు. జపాన్ రన్నర్ కాస్త ఆధిక్యం సాధించినప్పటికీ, సావన్ తన పట్టు సడలించకుండా రెండో స్థానాన్ని ఖాయం చేసుకుని రజతం గెలుచుకున్నారు. 1982 ఢిల్లీ ఆసియా క్రీడల తర్వాత భారత్‌కు మారథాన్‌లో పతకం (Marathon Medal) రావడం ఇదే తొలిసారి.
అలాగే విదేశీ గడ్డపై భారత్ గెలిచిన మొదటి మారథాన్ పతకం కూడా ఇదే కావడం విశేషం. ఇటీవలే రొట్టెర్‌డామ్‌లో జరిగిన మారథాన్‌లో సావన్ 48 ఏళ్ల జాతీయ రికార్డును తిరగరాశారు. ఇప్పుడు ఆ ఫామ్‌ను కొనసాగిస్తూ అంతర్జాతీయ పతకాన్ని సాధించారు. ఆసియా క్రీడల చరిత్రలో భారత్‌కు ఇది నాలుగో మారథాన్ పతకం. 1951లో ఛోటా సింగ్ స్వర్ణం, సూరత్ సింగ్ కాంస్యం సాధించగా, 1982లో సీతారామ్ కాంస్యం గెలుచుకున్నారు. ఈ రేసులో పాల్గొన్న మరొక భారత అథ్లెట్ కార్తీక్ కర్కేరా 2 గంటల 22 నిమిషాల 41 సెకన్ల సమయంతో 17వ స్థానంలో నిలిచారు.

