కలం, వెబ్ డెస్క్ : ఏపీ వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాలు, ముఖ్యంగా ఉత్తరాంధ్ర జిల్లాల్లో నెలకొన్న వరద పరిస్థితులపై సీఎం చంద్రబాబు (CM Chandrababu) , సీఎస్ సాయిప్రసాద్ సహా ఉన్నతాధికారులతో టెలికాన్ఫరెన్స్ ద్వారా ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా వివిధ జిల్లాల్లో నివాస ప్రాంతాలు జలమయం కావడం, పంట పొలాలు నీట మునగడంపై ఆరా తీసిన సీఎం.. ముంపు ప్రాంతాల్లో చేపడుతున్న పునరావాస చర్యలను సమీక్షించారు. ఈ క్రమంలోనే గత ఐదు రోజులుగా సముద్రంలో వేటకు వెళ్లలేక తీవ్ర ఇబ్బందులు పడుతున్న మత్స్యకార కుటుంబాలను ఆదుకోవాలని అధికారులను ఆదేశిస్తూ, ప్రతి కుటుంబానికి ఉచితంగా 50 కేజీల బియ్యం పంపిణీ చేయాలని ఆదేశాలు జారీ చేశారు.
సమీక్షలో భాగంగా ఉత్తరాంధ్రలోని నదీ ప్రవాహాలు, ముంపు పరిస్థితులను సీఎం చంద్రబాబు దృష్టికి మంత్రి అచ్చెన్నాయుడు తీసుకెళ్లారు. హీరమండలం లిఫ్ట్ ప్రాజెక్టుకు విద్యుత్ సౌకర్యం కల్పించే ప్రక్రియను తక్షణమే వేగవంతం చేసి, వంశధార వరద నీటిని హీరమండలం రిజర్వాయర్‌లోకి తరలించేలా చర్యలు తీసుకోవాలని ఇరిగేషన్, విద్యుత్ శాఖల ఉన్నతాధికారులను సీఎం చంద్రబాబు సూచించారు. అలాగే కృష్ణానదిలో ఎగువ నుండి ప్రవాహాలు లేనప్పటికీ, స్థానిక వరద నీటితో ప్రకాశం బ్యారేజీ వద్ద నీటిమట్టం పెరుగుతోందని అధికారులు వివరించగా, ఈ నీటిని నిల్వ చేసేందుకు పులిచింతల దిగువన, ప్రకాశం బ్యారేజీకి ఎగువన , అలాగే దిగువన బ్యారేజీల నిర్మాణం ఎంతో అవసరమని సీఎం అభిప్రాయపడ్డారు. గతంలో ప్రతిపాదించిన ఈ రెండు బ్యారేజీల నిర్మాణ ప్రతిపాదనలను వేగంగా ముందుకు తీసుకెళ్లి, కేంద్ర ప్రభుత్వానికి నివేదికలు పంపాలని ఆదేశించారు.
మరోవైపు రాష్ట్రంలో ఇటీవల కురిసిన వర్షాల కారణంగా వర్షపాతం లోటు గణనీయంగా తగ్గిందని అధికారులు సీఎం చంద్రబాబుకు తెలిపారు. గతంలో 50 శాతంగా ఉన్న లోటు ప్రస్తుతం 31 శాతానికి తగ్గిందని, ఇందులో కోస్తాంధ్రలో 19.80 శాతం, రాయలసీమలో 42 శాతం మేర లోటు వర్షపాతం నమోదైందని తెలిపారు. ప్రస్తుతం వర్షాల తీవ్రత తగ్గినప్పటికీ ఉత్తరాంధ్రలోని నదుల్లోకి ఎగువ ప్రాంతాల నుంచి వరద నీరు వచ్చి చేరుతుండటంతో అధికారులు నిరంతరం అప్రమత్తంగా ఉండాలని సీఎం హెచ్చరించారు.

