కలం, తెలంగాణ బ్యూరో : ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో రాజ్యసభ మాజీ ఎంపీ జోగినిపల్లి సంతోష్ (Santhosh Rao) వాంగ్మూలాన్ని సిట్ (SIT) పోలీసులు రికార్డు చేశారు. ఏడున్నర గంటలకు పైగా విచారణలో అనేక అంశాలపై ఆధారాలను ముందు ఉంచి సమాచారాన్ని రాబట్టినట్లు తెలిసింది. కేసీఆర్‌కు ఎప్పుడూ వెన్నంటి ఉండే వ్యక్తిగా ఎవరెవరి ఫోన్లను ట్యాపింగ్ చేయాలనే నిర్ణయానికి సంబంధించి లోతుగా ప్రశ్నించారు. ఐపీఎస్ అధికారి ప్రభాకర్‌రావు రిటైర్ అయిన తర్వాత కూడా ఆయనను ఇంటెలిజెన్స్ విభాగం బాధ్యతల్లో నియమించడం వెనక నిర్ణయం ఎవరిదంటూ ప్రశ్నించారు. ఆయన ద్వారా చేయించిన ఫోన్ ట్యాపింగ్ ఉద్దేశం గురించి కూడా ఆరా తీశారు. గతంలో ప్రభాకర్‌రావు, రాధాకిషన్ రావు ఇచ్చిన స్టేట్‌మెంట్లు, వారు వెల్లడించిన అంశాల ఆధారంగా సంతోష్‌ను ప్రశ్నలతో ముంచెత్తారు.
కీలకమైన విషయాలు వెలుగులోకి :
కేసీఆర్‌ను (KCR) ఎవరు కలవాలన్నా ముందుగా ఆ సమాచారాన్ని చేరేవేసే వ్యక్తిగా ఫోన్ ట్యాపింగ్ విషయంలో ఎవరెవరి పేర్లను ఇంటెలిజెన్స్ చీఫ్‌గా ప్రభాకర్‌రావుకు చేరవేశారో సంతోష్ (Santhosh Rao) ద్వారా పోలీసులు ఆరా తీశారు. స్లిప్పుల్లో నెంబర్లను లేదా పేర్లను రాసి ఇచ్చే బాధ్యత తీసుకున్నట్లుగా వచ్చిన ఆరోపణలపై ఆయన వివరణ తీసుకున్నారు. గతంలో విచారణకు హాజరైనవారిలో చాలా మంది ‘పెద్దాయన’ అని పేర్కొనడంతో దాని గురించి వివరాలను సేకరించినట్లు తెలిసింది. మరెవరికంటే సన్నిహితంగా ఉండే వ్యక్తిగా అప్పటి ఫోన్ ట్యాపింగ్ అంశాలపై కొన్ని ఆధారాలను చూపి సమాధానాలను రాబట్టారు. హరీశ్‌రావు, కేటీఆర్ ఇచ్చిన సమాధానాల్లోంచి కూడా కొన్ని ప్రశ్నలు వేసి కొన్ని అదనపు లీడ్‌లను రాబట్టినట్లు తెలిసింది. తదుపరి దర్యాప్తుకు అవసరమైన ఆధారాలు లభించినట్లు సమాచారం.
ట్యాపింగ్ వెనక రాజకీయ ప్రయోజనాలు :
రాజకీయ ప్రత్యర్థుల కదలికలను, సమాచారాన్ని రాబట్టేందుకే ఫోన్ ట్యాపింగ్‌ను ఎంచుకున్నారా?.. ఎన్నికలు, ఉప ఎన్నికల సమయంలో పొలిటికల్ బెనిఫిట్ పొందే లక్ష్యంతోనే జరిగిందా?.. దుబ్బాక, హుజూరాబాద్, నాగార్జునసాగర్.. లాంటి ఉప ఎన్నికల్లో ఎందుకు వాడారు?.. ఎంతకాలం నుంచి ఫోన్ ట్యాపింగ్ జరిగింది?.. ఆ నిర్ణయం తీసుకున్నదెవరు?.. ఈ ప్రక్రియలో పాలుపంచుకున్నదెవరు?.. విదేశాల నుంచి సమకూర్చుకున్న ఎక్విప్‌మెంట్ ఎక్కడున్నది?.. దాని కొనుగోలుకు చెల్లించిన డబ్బు ఎక్కడిది?.. టార్గెట్ వ్యక్తులెవరు?.. అందులో రాజకీయ నాయకులెవరు?.. వ్యాపారవేత్తలెవరు?.. చాలామంది చేసిన ఫిర్యాదుల్లో బలమైన ఆరోపణలు ఎందుకొస్తున్నాయి?.. ఫోన్ ట్యాపింగ్ చేయకుండానే వివరాలు ఎలా తెలిశాయి?.. ఇలాంటి అనేక అంశాలపై లోతుగా ప్రశ్నించినట్లు తెలిసింది.
కేసీఆర్ విచారణకు అవసరమైన లీడ్స్ :
ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో నిర్ణయం కేసీఆర్‌దేననే ప్రాథమిక ఆధారాలు లభించడంతో ఆయనను కూడా విచారించే అవకాశాలున్నాయి. ఆ విచారణకు అవసరమైన చాలా ఆధారాలు, వివరాలు ఇప్పటివరకు హాజరైనవారి స్టేట్‌మెంట్లు, సమాధానాల్లో పోలీసులకు లభించినట్లు తెలిసింది. వీరిచ్చిన సమాధానాల ఆధారంగా పోలీసులు సైతం కొన్ని ఆధారాలను సిద్ధం చేసుకుని కేసీఆర్‌ను ఎంక్వయిరీ చేసే సందర్భంగా లోతుగా ప్రశ్నించే అవకాశమున్నది. కొద్దిమంది జడ్జీల ఫోన్‌లను కూడా ట్యాప్ చేసినట్లు ఆరోపణలు రావడంతో ఆ అంశాన్ని కేసీఆర్ ఎంక్వయిరీ సందర్భంగా ప్రస్తావించే అవకాశమున్నది. మరోవైపు బాధితులుగా కల్వకుంట్ల కవిత భర్తను సైతం విచారణకు పిలిచేలా సిట్ పోలీసులు సన్నాహాలు చేస్తున్నారు. ఏ గంటలోనైనా నోటీసులు జారీ అయ్యే అవకాశమున్నది. ఆ విచారణలో వెల్లడయ్యే అంశాలు కూడా భవిష్యత్తులో కేసీఆర్ ఎంక్వయిరీకి కీలకం కానున్నాయి.
Read Also: ఈయూ డీల్: చాక్లెట్స్ To లగ్జరీ కార్స్.. ఇండియాలో ఇక డెడ్ చీప్
Follow Us On : WhatsApp


