కలం, వెబ్ డెస్క్: మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్‌లో (Bhopal) వ్యాన్, ట్రాక్టర్ ఢీకొన్న ప్రమాదంలో ఐదుగురు మృతి చెందగా, 10 మంది గాయపడ్డారని పోలీసులు గురువారం తెలిపారు. జిల్లాలోని బెరాసియా ప్రాంతంలో బుధవారం రాత్రి ఈ ప్రమాదం జరిగిందని తెలిపారు. మకర సంక్రాంతి సందర్భంగా నర్మదాపురంలో పుణ్యస్నానం ఆచరించిన భక్తులు ట్రాక్టర్‌లో తిరిగి వెళ్తుండగా, నర్మదాపురం వైపు వెళుతున్న వ్యాన్ ఎదురెదురుగా ఢీకొన్నాయి. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని దెబ్బతిన్న వాహనాల్లో చిక్కుకున్న ప్రయాణికులను బయటకు తీశారు.
ఈ ప్రమాదంలో (Road Accident) వ్యాన్‌లో ఉన్న ఐదుగురు అక్కడికక్కడే మృతిచెందారు. వీరిలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు ఉన్నారు. మృతులను ముఖేష్ అహిర్వార్ (40), బాబ్రీ బాయి (60), దీపక్ (14), లక్ష్మీ బాయి (60), హరి బాయి (60)గా గుర్తించారు, వీరంతా సిరోంజ్ నివాసితులు అని పోలీసులు తెలిపారు. రెండు వాహనాల్లోని ముగ్గురు పిల్లలు సహా పది మంది గాయపడ్డారు. వారిని చికిత్స కోసం భోపాల్‌లోని (Bhopal) ఇతర ప్రైవేట్ ఆసుపత్రులకు తరలించారు.
Read Also: ప్రజాస్వామ్యంలో స్పీకర్లదే గొప్ప పాత్ర: పీఎం నరేంద్ర మోడీ
Follow Us On : WhatsApp


