epaper
Thursday, January 15, 2026
spot_img
epaper

బంగారం ధరను ఎలా లెక్కకట్టాలో అర్థం కావట్లేదా.. అయితే ఇది మీకోసమే..

కలం, డెస్క్ :  బంగారం కొనాలనే కోరిక ఉండనిదెవరికి? కాస్త డబ్బు చూసుకుని ఏదో ఒక బంగారపు వస్తువు కొనుక్కోవాలని చాలా మంది భావిస్తారు. తీరా కొనడానికి వెళ్తే.. అక్కడ వాళ్లు సీజీఎస్‌టీ, ఎస్‌జీఎస్‌టీ, తయారీ ఖర్చు ఇలా చాలా చెప్పి.. మనం అంచనా వేసుకున్న దానికన్నా తక్కువ బంగారాన్ని ఇస్తారు. దీంతో చాలా మంది బంగారపు వస్తువులు, ఆభరణాలు కొనాలంటే పెద్ద తలనొప్పిగా భావిస్తారు. రికార్డ్ స్థాయిలో పెరుగుతున్న ధరలతో (Gold Prices) బంగారానికి డిమాండ్ కూడా బాగానే పెరుగుతుంది. కొంటే ఇప్పుడే కొనాలి.. రేపు కొనగలమో లేదో అని చాలా మంది బంగారం కొనడానికి తొందరపడుతున్నారు. కానీ, బంగారం కొనేటప్పుడు వేసుకునే లెక్కలు ఎలానో అర్థం కాక అయోమయంలో పడుతున్నారు. మీరు కూడా ఇదే కోవలో ఉన్నారా? అయితే ఈ వార్త మీకోసమే..

బంగారం ధరలు (Gold Prices) ఆరు సెషన్లుగా కొత్త రికార్డులు క్రియేట్ చేసాయి. 24 క్యారెట్ బంగారం 10 గ్రాముల కోసం దాదాపు రూ.1.44 లక్షలు, 22 క్యారెట్ సుమారు రూ.1.32 లక్షలు, 18 క్యారెట్ దాదాపు రూ.1.08 లక్షల వద్ద ట్రేడవుతోంది. పండుగల సీజన్ కావడం, లోహ్రి, మకర సంక్రాంతి, మాఘ్ బిహు, పొంగల్ వంటి పండగలు తక్కువ గ్యాప్‌తో రావడంతో బంగారం ఇప్పుడు మరింత కాస్ట్లీగా మారింది. అయినప్పటికీ, GST, మేకింగ్ చార్జీలు కలిపి ఖర్చు ముందే లెక్కించవచ్చు.

జనవరి 15న బంగారం ధరలు

జనవరి 15న బంగారం ధరలు మరోసారి కొత్త రికార్డులు కొట్టాయి. 24 క్యారెట్ 10 గ్రాములు రూ.1,46,470, 22 క్యారెట్ 10 గ్రాములు రూ.1,31,250గా ఉంది.. 18 క్యారెట్ 10 గ్రాములు రూ.1,07,390కి చేరింది. ఈ ఏడాది జనవరిలో ఇప్పటివరకు బంగారం ధరలు 6.3 శాతం పెరిగాయి. డిసెంబర్ 2025లో పెరిగిన 3.4 శాతం ధరతో పోలిస్తే ఇది మరింత ప్రభావవంతమైన పెరుగుదల. మార్కెట్ విశ్లేషకులు, పెట్టుబడిదారులు బంగారం ఆకర్షణీయంగా ఉందని చెబుతున్నారు.

బంగారం కొనడానికి ముందు ఇవి తెలుసుకోవాలి

బంగారం కొనడానికి ముందు మనం ఏ నాణ్యత ఉన్న బంగారం కొనాలి అనుకుంటున్నామో ఒక స్పష్టత ఉండాలి. 24కే, 22కే, 18కే మనకు ఏది కావాలన్నది తెలియాలి. అసలు ఈ 24కే, 22కే, 18కే బంగారం ఏంటేంటే.. 24 క్యారెట్ బంగారం 100 శాతం స్వచ్ఛమైనది, గాఢ పసుపు రంగు కలిగి ఉంటుంది. మృదువుగా ఉండటం వల్ల ఆభరణాలకు ఎక్కువ ఉపయోగం లేదు. దీనిని నాణేలు, గోల్డ్ బార్స్ కోసం ఎక్కువగా వాడతారు.

22 క్యారెట్ 91.67% బంగారం, మిగతా 8.33% లోహాల మిశ్రమం. భారతీయ ఆభరణాల కోసం ఎక్కువగా వాడతారు. 18 క్యారెట్ 75% బంగారం, మిగతా 25% లోహాలు కలిపి, తేలికపాటి డిజైనర్ ఆభరణాలకు ఉపయోగకరంగా ఉంటుంది.

తయారీ ఖర్చులు ఇలా..

బంగారం ధరతో పాటు మేకింగ్ చార్జీలు కూడా తుది ధరను పెంచుతాయి. తయారీ ఖర్చులను అనేక అంశాలు ప్రభావితం చేస్తాయి. నగరం, షాప్, డిజైన్ ఆధారంగా ఇవి మారతాయి. కస్టమైజ్డ్, స్టోన్ వర్క్ లేదా హ్యాండ్‌క్రాఫ్టెడ్ ఆభరాణాల్లో ఈ తయారీ ఛార్జ్‌లు ఎక్కువగా ఉంటాయి.

ఇయర్ రింగ్స్ 21-30 శాతం, ఉంగరాలు 14-27 శాతం, బ్రేస్‌లెట్లు 21-28 శాతం, నెక్లెస్‌లు 23-26 శాతం, చెయిన్‌లు 13-28శాతం వరకు తయారీ ఖర్చులను కలిగి ఉంటాయి.

బంగారంపై జీఎస్టీ

బంగారం విలువపై 3 శాతం జీఎస్‌టీ ఉంది. అందులో 1.5 శాతం సెంట్రల్ జీఎస్‌టీ, 1.5శాతం స్టేట్ జీఎస్‌టీ. మేకింగ్ చార్జీలపై 5 శాతం జీఎస్‌టీ ఉంటుంది. అదే ప్రత్యేకంగా తయారు చేయించుకున్న వాటిపై అయితే మరో 3శాతం జీఎస్‌టీ ఉంటుంది.

బంగారం ధర ఎలా లెక్కించాలి

బంగారం ధర లెక్కించాలంటే ముందుగా మనకు కావాల్సిన బంగారం ఎన్ని క్యారెట్లదో నిర్ధారించుకోవాలి. ఆ తర్వాత బేస్ విలువను లెక్కించుకోవాలి. బరువు × ఒక్క గ్రాము ధర (1 తులం = 11.664 గ్రాములు) ద్వారా బేస్ విలువను లెక్కించవచ్చు. ఆ తర్వాత దానికి తయారీ ఖర్చులను కలపాలి. ఇప్పుడు ఈ ఆభరణంపై పడే జీఎస్‌టీని కలుపుకోవాలి. వీటికి బంగారం జీఎస్‌టీని, తయారీ ఖర్చుల జీఎస్‌టీని విడివిడిగా లెక్కించి కలుపుకోవాలి.

వీటితో పాటుగా బంగారం కొనే సమయంలో డిస్కౌంట్ ఆఫర్లు చూడాలి, హాల్‌మార్క్ గుర్తు చెక్ చేసుకోవాలి. అంతేకాకుండా మేకింగ్ చార్జీల్లో మనం కాస్త బేరం ఆడొచ్చు. బంగారాన్ని పెట్టుబడిలా కొంటుంటే 24కే కి వెళ్లడం మంచిది.. నాణేలు, గోల్డ్ బార్స్ కొనడం మంచిది. బంగారం కొనుగోలు బిల్ జాగ్రత్తగా భద్రపరుచుకోవాలి.

Read Also: దడపుట్టిస్తున్న గోల్డ్ ధరలు.. పెళ్లిళ్ల సీజన్ లో తిప్పలు

Follow Us On: X(Twitter)

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>