కలం, వెబ్ డెస్క్: హైదరాబాద్‌లోని సనత్‌నగర్‌లో నిర్మించిన తెలంగాణ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (Sanath Nagar TIMS)ను ప్రారంభించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ (Damodar Rajanarasimha) ఆదేశాల మేరకు శుక్రవారం నుంచి హాస్పిటల్‌లో ట్రయల్ రన్ నిర్వహించేందుకు ఆరోగ్యశాఖ ఏర్పాట్లు పూర్తి చేసింది. మే 1 నుంచి సుమారు నెల రోజుల పాటు ట్రయల్ రన్ కొనసాగనుంది. ఇందులో భాగంగా రోజూ ఉదయం 9 గంటల నుంచి 11 గంటల వరకు అవుట్ పేషెంట్, డయాగ్నసిస్ సేవలు అందుబాటులో ఉంటాయి. అలాగే కార్డియాలజీ, న్యూరాలజీ, నెఫ్రాలజీ, గ్యాస్ట్రోఎంటరాలజీ, యూరాలజీ, జనరల్ మెడిసిన్, జనరల్ సర్జరీతో పాటు మొత్తం 22 విభాగాల్లో ట్రయల్ రన్ జరగనుంది. ఇందుకోసం అవసరమైన డాక్టర్లు, పారా మెడికల్ సిబ్బందిని ఇప్పటికే అధికారులు నియమించారు. ఈ ట్రయల్ రన్ ద్వారా ఆసుపత్రి పనితీరును పరిశీలించి, త్వరలోనే పూర్తిస్థాయిలో వైద్య సేవలను విస్తరించేందుకు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ కసరత్తు చేస్తోంది.

