కలం, వెబ్ డెస్క్: గతంలో సీఎం చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడే టీటీడీ(TTD)కి భోలే బాబా డెయిరీ వచ్చిందని వైసీపీ సీనియర్ నేత సజ్జల రామకృష్ణా రెడ్డి(Sajjala Ramakrishna Reddy) అన్నారు. తిరుమల లడ్డూ వ్యవహారంలో కూటమి నేతలు చేస్తున్న ఆరోపణలపై సజ్జల ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు(Chandrababu) రాజకీయ దురుద్దేశంతోనే లడ్డూపై దుష్ప్రచారం చేశారన్నారు. నెయ్యిలో జంతువుల కొవ్వు కలవలేదనరి రిపోర్ట్ వచ్చినా ప్రజలకు క్షమాపణ చెప్పడం లేదన్నారు. లడ్డూ విషయంలో నోటికొచ్చినట్లు మాట్లాడి భక్తులను మానసిక క్షోభకు గురి చేసిన పాపం చంద్రబాబుదే అన్నారు. కల్తీ నెయ్యి సరఫరా చేసిందన్న భోలే బాబా డెయిరీ(Bhole Baba Dairy) 2018లో చంద్రబాబు హయాంలోనే టీటీడీకి వచ్చిందన్నారు. 2019 తర్వాత భోలే బాబా డెయిరీని బ్లాక్ లిస్ట్‌లో పెట్టామన్నారు. దీనికి సంబంధించి అన్ని రికార్డులు ఉన్నాయన్నారు. ఏదైనా ఉంటే కోర్టు సమక్షంలో వాస్తవాలు ముందు పెట్టాలని, ఇలా దుష్ప్రచారం చేయడం సరికాదన్నారు. రాజకీయం చేయాలంటే ఎన్నో అంశాలు ఉన్నాయని, దేవుడి మీద రాజకీయం చేయడం మానుకోవాలని హితవు పలికారు.
తిరుమల లడ్డూలో కల్తీ నెయ్యి వ్యవహారం దేశ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. వైసీపీ హయాంలో తిరుమల లడ్డూలో జంతువుల కొవ్వు కలిసిందని సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఆరోపించారు. సీబీఐ దీనిపై విచారణ చేపట్టి లడ్డూల తయారీకి కల్తీ నెయ్యి వాడారని, జంతువుల కొవ్వు ఏమీ కలవలేదని నివేదిక సమర్పించింది. అయినప్పటికీ వైసీపీ, కూటమి మధ్య వాదోపవాదాలు జరుగుతూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో టీటీడీకి కల్తీ నెయ్యిని సరఫరా చేసిన భోలే బాబా డెయిరీ చుట్టూ ఏపీ రాజకీయం తిరుగుతోంది.


