Mobile Popup Ad
Mobile Popup Ad

ఆర్టీసీ ఉద్యోగులను వెంటనే ప్రభుత్వంలో విలీనం చేయాలి: ఇదురు వెంకన్న

కలం, కరీంనగర్ బ్యూరో: ఆర్టీసీ ఉద్యోగులందరిని ప్రభుత్వంలో విలీనం చేస్తూ అపాయింట్‌మెంట్‌ డేట్‌ ప్రకటించాలని ఆర్టీసీ ఎంప్లాయిస్ యూనియన్ (RTC Union Demands) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఇదురు వెంకన్న డిమాండ్ చేశారు. బుధవారం కరీంనగర్ (Karimnagar) నగరంలోని బద్దం ఎల్లారెడ్డి భవన్ లో ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ రీజినల్ సమావేశంలో భవిష్యత్ కార్యచరణపై దిశానిర్దేశం చేశారు. అనంతరం మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.

2019లో బీఆర్ఎస్ ప్రభుత్వంలో 55 రోజుల సమ్మెను నిర్దాక్షిణ్యంగా అణచివేశారని వాపోయారు. ఈ క్రమంలో ఆర్టీసీ కార్మికులు 36 మంది ఆత్మబలిదానాలు చేసుకున్నా అప్పటి ప్రభుత్వం కనికరించకపోగా ఏ ఒక్క సమస్య పరిష్కరించలేదన్నారు. కార్మిక సంఘాలు లేకుండా రద్దు చేశారని మండిపడ్డారు. ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనం, కార్మికుల వేతన సవరణ, కేటగిరీల ఖాళీల భర్తీ, పనిభారం తగ్గింపు వంటి డిమాండ్ల కోసం ఉద్యమించామన్నారు. 2023లో కాంగ్రెస్ మేనిఫెస్టోలో తమ డిమాండ్లకు సానుకూలంగా స్పందించి అధికారంలోకి రాగానే పరిష్కరిస్తామని హామీ ఇచ్చారని తెలిపారు. అధికారంలోకి వచ్చి ఏళ్లు గడుస్తున్నా సమస్యలు పరిష్కారం కాకపోవడంతో ఏప్రిల్ 22న సమ్మెకు దిగామని, ఈ క్రమంలో తొందరపడి శంకర్ గౌడ్ అనే కార్మికుడు మరణించడం బాధాకరమన్నారు.

విలీనం కావాలా? గుర్తింపు సంఘం ఎన్నికలు కావాలా?

దీంతో ప్రభుత్వం వెంటనే స్పందించి అత్యవసర కేబినెట్‌లో మంత్రులతో కమిటీ ఏర్పాటు చేసి చర్చలకు పిలిచింది. అప్పుడు సీఎం ముందుగా విలీనం కావాలా? గుర్తింపు సంఘం ఎన్నికలు కావాలా? అని అడిగితే కార్మిక సంఘాలకు ముందు గుర్తింపు ఎన్నికలు నిర్వహించాలని కోరినట్లు తెలిపారు. ప్రస్తుతం ముందుగా గుర్తింపు సంఘం ఎన్నికల తర్వాతే విలీనం అంటూ సంబంధిత మంత్రి పొన్నం ప్రభాకర్ (Ponnam Prabhakar) ప్రకటించి కార్మికులను అయోమయానికి గురిచేస్తున్నారన్నారు. ముందుగా గుర్తింపు సంఘం ఎన్నికలు నిర్వహిస్తామని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని ఆర్టీసీ జేఏసీ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు తెలిపారు. ముందుగా ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనమే చేయాలని సీఎం రేవంత్ రెడ్డికి రాతపూర్వకంగా వినతిపత్రం ఇచ్చినట్లు స్పష్టం చేశారు.

ఆర్టీసీ సమ్మె తర్వాత ఈ ఏడాది మే1న ఆర్టీసీ కార్మిక సంఘాలతో సీఎం రేవంత్ రెడ్డి (Revanth Reddy) మాట్లాడినప్పుడు తాము విలీనమే ముందు జరగాలని విజ్ఞప్తి చేసినట్లు తెలిపారు. అన్ని కార్మిక సంఘాలు కూడా ముందు విలీనానికే మొగ్గు చూపుతున్నందున సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం కార్మిక సంఘాల ఎన్నికల ప్రక్రియను ఆపేసి విలీన ప్రక్రియను చేపట్టాలని కోరారు. 18న కేబినెట్ సమావేశంలో చర్చించి విలీన ప్రక్రియను ప్రకటించి కార్మికుల గందరగోళ పరిస్థితులకు తెరదించాలన్నారు. ఆర్టీసీ ఉద్యోగులందరిని ప్రభుత్వంలో విలీనం చేస్తూ అపాయింట్‌మెంట్‌ డేట్‌ ప్రకటించాలన్నారు. ప్రభుత్వం స్పందించక పోతే మరో ఉద్యమానికి ఆర్టీసీ కార్మికులు సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు.

ప్రెస్ మీట్ లో ఏఐటీయూసీ రాష్ట్ర కార్యదర్శి టేకు మల్ల సమ్మయ్య, ఆర్టీసీ ఎంప్లాయిస్ యూనియన్ రాష్ట్ర కార్యదర్శి బెజ్జంకి కాళిదాస్, రీజనల్ కార్యదర్శి కొమ్మ కొమురయ్య యాదవ్, జోనల్ కమిటీ సభ్యులు ఎ. శ్రీనివాస్ రావు, బొడిగే మహేష్, మంథని, జగిత్యాల డిపో కార్యదర్శులు జి.రమేష్, లక్ష్మణ్, మంథని డిపో అధ్యక్షులు వై.ఎస్.రెడ్డి, కరీంనగర్ 2వ డిపో కమిటీ సభ్యులు జీఎల్.నారాయణ, టి.సదయ్య గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

Read Also: రేవంత్ వల్లే తెలంగాణలో పక్క రాష్ట్రాల నేతల రాజకీయం : కవిత

Follow Us On: X(Twitter)

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>