కలం, వెబ్ డెస్క్: కేంద్ర ప్రభుత్వం డీలిమిటేషన్ (Delimitation) ప్రక్రియ చేపట్టేందుకు ముసాయిదా బిల్లు తయారుచేయడంతో తెలంగాణ సహా దక్షిణాది రాష్ట్రాలకు తీవ్ర అన్యాయం జరుగుతుందని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి (Revanth Reddy) లిఖితపూర్వకంగా ప్రధానికి వివరించారు. ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక, కేరళ, పుదుచ్చేరి రాష్ట్రాల ముఖ్యమంత్రులకు సైతం లేఖలు రాశారు. జనాభా లెక్కలను పరిగణనలోకి తీసుకుని ప్రొ-రేటా ప్రకారం సీట్ల సంఖ్యను పెంచేలా డీలిమిటేషన్ చేపడితే దక్షిణాది రాష్ట్రాలకు శాశ్వతంగా నష్టం జరుగుతుందని, ఇందుకోసం ఐక్యంగా కేంద్రంతో కొట్లాడాలని ఆ లేఖల్లో వారిని కోరారు. కేంద్రం అనుసరిస్తున్న ధోరణికి వ్యతిరేకంగా ఐక్యంగా నిలబడాలని కోరారు. ప్రస్తుతం డీలిమిటేషన్, మహిళా రిజర్వేషన్, లోక్‌సభ స్థానాల పెంపు అంశాలు వేర్వేరు అయినప్పటికీ ఒకే గాటన కట్టేలా కేంద్రం అనుసరిస్తున్న వైఖరితో గందరగోళం తలెత్తిందన్నారు.
లోక్‌సభ సీట్లను 543 నుంచి 850కు పెంచి ప్రోరాటా పద్ధతిలో పంచితే దక్షిణ రాష్ట్రాల ప్రాధాన్యం తగ్గిపోతుందని ఆ లేఖల్లో దక్షిణాది రాష్ట్రాల ముఖ్యమంత్రుల్ని అప్రమత్తం చేశారు. దేశ అభివృద్ధిలో భాగస్వామ్యం పంచుకునే రాష్ట్రాలు నష్టపోతూ, జనాభా ఎక్కువగా ఉన్న రాష్ట్రాలు లాభపడే పరిస్థితి తలెత్తిందన్నారు. అన్ని రాష్ట్రాలకూ న్యాయం జరిగేలా హైబ్రిడ్ మోడల్‌ను పరిశీలించాలని, ఈ అంశంపై రాష్ట్రాలు ఐక్యంగా ముందుకు రావాలని ఆయన (Revanth Reddy) కోరారు. హైబ్రిడ్ మోడల్ ప్రకారం కేంద్ర ప్రభుత్వం పెంచాలనుకుంటున్న సీట్లలో సగాన్ని దక్షిణాది రాష్ట్రాలకు కేటాయించాలన్నారు. మిగిలిన సగాన్ని మిగిలిన రాష్ట్రాలకు జనాభా నిష్పత్తిలో పెంచాలన్నారు. దక్షిణాదికి కేటాయించే సగం సీట్లను జీఎస్‌డీపీ, ఆర్థిక వృద్ధి రేటు ఆధారంగా రాష్ట్రాలకు పెంచాలన్నారు.
Read Also: కేటీఆర్ పాదయాత్ర.. కేసీఆర్ భిన్నాభిప్రాయం
Follow Us On: X(Twitter)

