కలం, కరీంనగర్ బ్యూరో: హైదరాబాద్‌లోని యశోద హాస్పిటల్స్(Yashoda Hospitals) వైద్య బృందం అరుదైన అత్యాధునిక చికిత్స ద్వారా 29 ఏళ్ల మహిళ ప్రాణాలను కాపాడినట్లు క్రిటికల్ కేర్ వైద్యుడు డా. ఎం. కార్తిక్ తెలిపారు. కరీంనగర్‌లోని యశోద సెంటర్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన ఈ వివరాలు వెల్లడించారు. సెప్టిక్ షాక్ కారణంగా గుండె పనితీరు తీవ్రంగా దెబ్బతిని, రక్తపోటు ప్రమాదకర స్థాయికి పడిపోయిన పరిస్థితిలో రోగిని అత్యవసరంగా ఆసుపత్రికి తరలించినట్లు ఆయన తెలిపారు. రక్తపోటును నిలబెట్టేందుకు అధిక మోతాదులో మందులు ఇవ్వాల్సి వచ్చిందని చెప్పారు.
పరిస్థితి అత్యంత క్రిటికల్‌గా ఉండటంతో క్రిటికల్ కేర్, కార్డియోథొరాసిక్, పల్మనాలజీ విభాగాల వైద్యులు కలిసి డా. ఎం.వి. రావు మార్గదర్శకత్వంలో వెంటనే వీనో-ఆర్టీరియల్ ఎక్స్ట్రాకార్పోరియల్ మెంబ్రేన్ ఆక్సిజనేషన్ (VA-ECMO) చికిత్సను ప్రారంభించినట్లు తెలిపారు. ఈ ప్రత్యేక జీవనాధార యంత్రం ద్వారా రక్తాన్ని శరీరం నుంచి బయటకు తీసి ఆక్సిజన్ జోడించి తిరిగి శరీరంలోకి పంపుతుందని వివరించారు. దీని వల్ల గుండె, ఊపిరితిత్తులు తాత్కాలికంగా విశ్రాంతి తీసుకుని కోలుకునే అవకాశం లభిస్తుందని చెప్పారు. అదే సమయంలో యాంటీబయోటిక్స్ ద్వారా ఇన్ఫెక్షన్‌ను నియంత్రించినట్లు తెలిపారు. ఈ చికిత్సతో రోగి ప్రాణాలను కాపాడగలిగామని వైద్యులు వెల్లడించారు.
ఆరు రోజుల తర్వాత గుండె పనితీరు మెరుగుపడటంతో ECMOను తొలగించి, రోగిని స్థిరమైన పరిస్థితిలో డిశ్చార్జ్ చేసినట్లు తెలిపారు. ఇటువంటి అత్యాధునిక చికిత్సలు ఎంపిక చేసిన కొన్ని హాస్పిటల్స్‌లో మాత్రమే అందుబాటులో ఉంటాయని చెప్పారు. అత్యవసర పరిస్థితుల్లో ECMO సదుపాయం ఉన్న హాస్పిటల్స్‌కు సమయానికి తరలించడం ఎంతో కీలకమని వైద్యులు సూచించారు.
Read Also: లీడర్లు వెళ్లినా కేడర్ మనదే: సీఎంకు జగిత్యాల నేతల భరోసా
Follow Us On: Instagram

