కలం, వెబ్ డెస్క్: కేరళ సీఎం విజయన్.. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Revanth Reddy) మధ్య మాటల యుద్ధం సాగుతూనే ఉంది. ఇద్దరు నేతల మధ్య సవాళ్లు, ప్రతి సవాళ్లు జరుగుతున్నాయి. కేరళ ఎన్నికల ప్రచారంలో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి విజయన్‌పై అక్కడి ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. విజయన్ కూడా అదే స్థాయిలో బదులిచ్చారు. తాజాగా సీఎం రేవంత్ రెడ్డి విజయన్‌కు ఓ లేఖ రాశారు. కేరళ ఇప్పటివరకు సాధించిన విజయాలన్నీ గతంలోని యూడీఎఫ్ ప్రభుత్వాల పనితీరు ఫలితమేననే విషయాన్నిగుర్తించాలని రేవంత్ రెడ్డి తన లేఖలో ప్రస్తావించారు.
ఎల్డీఎఫ్ చేసిందేంటి?
ఎల్డీఎఫ్ (LDF) వరుసగా రెండు సార్లు కేరళలో ప్రభుత్వం స్థాపించి ఏం చేసిందని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. రెండు ప్రభుత్వాల హయాంలో ఏం జరిగిందో ఆ రాష్ట్ర ప్రజలకు తెలియజేయాలని రేవంత్ డిమాండ్ చేశారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో చర్చకు దిగే ఉద్దేశం తనకు లేదని కేరళం ముఖ్యమంత్రి విజయన్ (Pinarayi Vijayan) రాసిన లేఖకు రేవంత్ మంగళవారం ప్రత్యుత్తరం రాశారు. కేరళ ప్రభుత్వ (Kerala Govt) పనితీరుపై తాను గౌరవంగా, హుందాగా స్పందించాలని అనుకున్నానని, కానీ విజయన్‌ను అభ్యంతరకరమైన భాషను ఉపయోగించారని పేర్కొన్నారు. ప్రత్యర్థుల తొందరపాటు వ్యాఖ్యలపై తానెప్పుడూ ఆవేశపూరితంగా స్పందించనని సీఎం తెలియజేశారు. మీరు తెలంగాణ రాష్ట్రానికి వచ్చినప్పుడు, ఒక అతిథికి ఇవ్వాల్సిన గౌరవ, మర్యాదను ఇస్తానని విజయన్‌కు సీఎం రేవంత్ రెడ్డి స్పష్టంగా తెలియజేశారు.
పదే పదే తప్పుడు ఉదాహరణలు
నీతి ఆయోగ్ (NITI Aayog) ఎస్డీజీ సూచిక 2023-24ను తెలంగాణ రాష్ట్రానికి విజయన్ తప్పుగా ఉదహరిస్తున్నారని రేవంత్ రెడ్డి (Revanth Reddy) పేర్కొన్నారు. ఆ సమయంలో తెలంగాణలో అధికారంలో ఉన్నది ప్రస్తుత ప్రజా ప్రభుత్వం కాదని, అది పదేళ్ల బీఆర్ఎస్-బీజేపీ పదేళ్ల దుష్పరిపాలన చివరి దశ అని విజయన్‌కు సీఎం తెలియజేశారు. తెలంగాణలో తమ ప్రజా ప్రభుత్వం 28 నెలలు పూర్తి చేసుకున్నందున ఈ కాలంలో తమ పనితీరు ఆధారంగా తమని అంచనా వేయాలని కేరళం ముఖ్యమంత్రి విజయన్‌ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కోరారు. 2024-25లో తెలంగాణ జీఎస్‌డీపీ రూ.16.12 లక్షల కోట్లుగా నమోదైందని, ఇది 10.7% వృద్ధి రేటుతో జాతీయ సగటు 9.9% కంటే ఎక్కువని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. తెలంగాణ తలసరి ఆదాయం రూ.3.87 లక్షలకు చేరుకుందని, ఈ గణాంకాల ఆధారంగా తెలంగాణ భారతదేశంలోనే ముందు స్థానంలో నిలిచిందని సీఎం స్పష్టం చేశారు. ఆర్‌బీఐ హ్యాండ్‌బుక్ 2024-25 గణాంకాల ప్రకారం కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్ర, కేరళం రాష్ట్రాలను తెలంగాణ అధిగమించిదన్నారు…
పేదరికాన్ని నిర్మూలించారా?
2025, చివరి నాటికి తీవ్ర పేదరికాన్ని (ఎక్సట్రీమ్ పావర్టీ) పూర్తిగా నిర్మూలించిన మొదటి రాష్ట్రంగా కేరళం నిలవనుందని మీరు ట్వీట్ చేశారని కేరళం ముఖ్యమంత్రి విజయన్‌కు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గుర్తు చేశారు. ఇది 2026, ఏప్రిల్ నెల, కానీ మీరు రాసిన లేఖలో 64,006 కుటుంబాలు ఇప్పటికీ పథకాలను పొందుతున్నాయని పేర్కొన్నందున మీరు పేదరికాన్ని నిర్మూలించారా అని సీఎం రేవంత్ రెడ్డి సూటిగా ప్రశ్నించారు. 2025, నవంబర్ 1వ తేదీ నాటి మీ ప్రకటన ఎందుకు ఆచరణలోకి రాలేదని విజయన్ ను సీఎం ప్రశ్నించారు.
ఆ కేసుల సంగతేంటి?
నీతి ఆయోగ్ కరప్షన్ ర్యాంకింగ్‌లను తాను గౌరవిస్తానని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. అదే సమయంలో విజయన్ చెప్పినట్లు కేరళం ప్రభుత్వం స్వచ్ఛమైనదైతే బంగారు స్మగ్లింగ్ వ్యవహారంలో మీ కార్యాలయంలోని ఉన్నతాధికారులు, కీలకమైన వ్యక్తులకి సంబంధాలున్నాయని డాక్యుమెంట్లతో సహా నిరూపించబడిన ఆ కేసు ఎందుకు అపరిష్కృతంగా మిగిలిపోయిందని విజయన్‌ను సీఎం రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. శబరిమల అయ్యప్ప ఆలయం నుంచి 4.5 కిలోల బంగారం అక్రమ తరలింపు ఆరోపణలకు ఎందుకు జవాబు చెప్పడం లేదని సీఎం రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. తమ ప్రజా ప్రభుత్వం తెలంగాణ రైజింగ్ 2047 దార్శనికతతో ముందుకు వెళుతోందని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. హైదరాబాద్ సమీపంలోని ఫ్యూచర్ సిటీ, జహీరాబాద్‌లోని జాతీయ పారిశ్రామిక కారిడార్ వంటివి నిర్మించి ఒక దశాబ్దంలోనే రూ.1 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థను సాధించడమే లక్ష్యంగా తాము ముందుకు వెళుతున్నట్లు సీఎం స్పష్టం చేశారు. అలాగే కేరళంలో రాబోయే కొద్ది రోజుల్లో ఏర్పాటయ్యే కొత్త ప్రభుత్వం ‘నవ కేరళం’ దార్శనికతను అమలు చేస్తుందని తాను బలంగా విశ్వసిస్తున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. కేరళం ప్రజలు త్వరలోనే ఈ మేరకు నిర్ణయం తీసుకుంటారని, జరగాల్సినది కూడా అదేనని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.
Read Also: ఏపీ ఎండోమెంట్ కమిషనర్ శాంతి అరెస్ట్
Follow Us On: Facebook

