కలం, వెబ్ డెస్క్ : కేరళలోని కోవళంలో జరిగిన యూడీఎఫ్ (UDF) ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి (Revanth Reddy)ఎల్డీఎఫ్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. పినరయి విజయన్ (Pinarayi Vijayan) నేతృత్వంలోని పదేళ్ల పాలన కేవలం వైఫల్యాలకే ప్రతీకగా నిలిచిందని, ఆయన తప్పుకోవాల్సిన సమయం ఆసన్నమైందని వ్యాఖ్యానించారు. కేరళలో విద్యావంతులు, నైపుణ్యం కలిగిన యువతకు సరైన ఉపాధి అవకాశాలు లేకపోవడం వల్లే వారు విదేశాలకు వలస వెళ్తున్నారని, దీనివల్ల రాష్ట్రంలో కేవలం వృద్ధులు, చిన్న పిల్లలే మిగిలే దురదృష్టకర పరిస్థితి నెలకొందని అన్నారు. గతంలో కాంగ్రెస్ ముఖ్యమంత్రులు కరుణాకరన్, ఊమెన్ చాందీలు నిర్మించిన పంచాయతీరాజ్ వ్యవస్థను ప్రశంసించిన రేవంత్, రాబోయే ఎన్నికల్లో యూడీఎఫ్ మూడింట రెండొంతుల మెజారిటీతో విజయం సాధించి తీరుతుందని ధీమా వ్యక్తం చేశారు.
తెలంగాణలో అమలవుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను కేరళకు కూడా పరిచయం చేస్తామని ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి (Revanth Reddy) హామీ ఇచ్చారు. తాము అధికారంలోకి వచ్చిన స్వల్ప కాలంలోనే 67 వేల ఉద్యోగ నియామకాలు చేపట్టామని, 25 లక్షల రైతు కుటుంబాలకు సంబంధించి రూ. 20,670 కోట్ల రుణమాఫీ చేశామని వివరించారు. అలాగే 4 లక్షల ఇందిరమ్మ ఇళ్లు, ఉచిత విద్యుత్, రూ. 500లకే గ్యాస్ సిలిండర్ వంటి హామీలను క్షేత్రస్థాయిలో అమలు చేస్తున్నామని పేర్కొన్నారు. పినరయి విజయన్‌తో పాటు కేరళ కమ్యూనిస్టు మహిళా నేతలు ఎవరైనా తెలంగాణకు వచ్చి తమ పాలనను స్వయంగా పరిశీలించవచ్చని ఆయన సవాల్ విసిరారు. ఈ ఎన్నికలు కేరళ, తెలంగాణ మధ్య కాదని, అది కేవలం యూడీఎఫ్, ఎల్డీఎఫ్ (LDF) సిద్ధాంతాల మధ్య జరుగుతున్న పోరాటమని స్పష్టం చేశారు. ప్రజలు మార్పు కోరుకుంటున్నారని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.
Read Also: పెళ్లి కోసం టవరెక్కిన యువతి.. 9 గంటల పాటు రచ్చ.. చివరికి ఏమైందంటే?
Follow Us On: Pinterest

