కలం, వెబ్ డెస్క్ : ప్రేమించిన వ్యక్తితో పెళ్లి చేయాలంటూ ఓ యువతి హై టెన్షన్ విద్యుత్ టవరెక్కి రచ్చ చేసింది. ప్రియుడితో పెళ్లి కోసం 9 గంటల పాటు పోలీసులకు చక్కలు చూపించింది. ఈ ఘటన బీహార్ (Bihar) వైశాలిలోని చోటు చేసుకుంది. మహనార్ ప్రాంతానికి చెందిన యువతి 100 అడుగుల విద్యుత్ టవర్ ఎక్కి, తన పెళ్లి డిమాండ్ నెరవేర్చకపోతే దూకేస్తానని బెదిరించింది. అయితే, ఆమె ప్రేమించిన వ్యక్తి పెళ్లికి సుముఖత వ్యక్తం చేయలేదు. దీంతో యువతి టవర్ పైనే ఉండడంతో ఆ ప్రాంతంలోని ప్రజలంతా భయాందోళనకు గురయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని వెంటనే విద్యుత్ శాఖను సమాచారం అందించి పవర్ సరఫరాను నిలిపేశారు.
అనంతరం యువతిని కిందికి దిగమని పదేపదే ఒప్పించే ప్రయత్నం చేశారు. అధికారులు హామీలు, విజ్ఞప్తులు చేసినా యువతి వినలేదు. ఓ పోలీసు ఉన్నతాధికారి ‘తమ ఉద్యోగాలకు ఎసరు పెట్టొద్దు. నీకు గంటలో పెళ్లి చేస్తా’ అని హామీ ఇచ్చినా ఫలితం లేకుండా పోయింది. యువతిని రక్షించడానికి 100 మందికి పైగా పోలీసులు సంఘటనా స్థలంలో మోహరించారు. సాయంత్రం అయ్యే కొద్ది రెస్క్యూ ఆపరేషన్ మరింత కష్టంగా అయింది. లైటింగ్ ఏర్పాటు చేసి మరి యువతికి నచ్చజెప్పారు. చివరికి యువతి ప్రియుడిని సంఘటనా స్థలం దగ్గరకు రప్పించారు. దీంతో యువతి కిందికి వచ్చింది. ట్విస్ట్ ఏంటంటే యువతి కిందికి వచ్చిన తరువాత కూడా ఆ యువకుడితో పెళ్లి జరగలేదు. ఈ ఘటన బీహార్ లో తీవ్ర చర్చనీయాంశంగా మారడంతో పాటు సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది.
Read Also: డీజీపీ కాన్వాయ్ ట్రయల్ రన్‌లో ప్రమాదం.. దెబ్బతిన్న వాహనాలు
Follow Us On : WhatsApp

