కలం, వెబ్ డెస్క్: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ‘క్యూర్’ (CURE) ప్రాంతంలో పలు ప్రభుత్వ విభాగాల్లో అవినీతి, అవకతవకల ఆరోపణలు రావడంతో విజిలెన్స్ విభాగం అప్రమత్తమైంది. కొంత కాలం క్రితమే ఆరోపణలు, ఫిర్యాదులు వచ్చినా క్షేత్ర స్థాయి సోదాలు నిర్వహించడానికి అవసరమైన ఆధారాలను సేకరించడానికి సమయం తీసుకున్నది. ‘క్యూర్’ (CURE) ప్రాంతంలో సోమవారం ఆకస్మికంగా సోదాలు నిర్వహించగా దాని కొనసాగింపుగా ఫైళ్ళ పరిశీలన మంగళవారం స్పీడప్ అయింది. పాలనలో పారదర్శకతను తీసుకురావడానికి, అవినీతిని రూపుమాపడానికి ప్రత్యేక దృష్టి సారించిన ప్రభుత్వం ఒకవైపు ఏసీబీ సోదాలను నిర్వహిస్తూనే మరోవైపు విజిలెన్స్ తనిఖీలనూ (Vigilance Raids) ముమ్మరం చేసింది. అందులో భాగంగా గండిపేట ఎమ్మార్వో కార్యాలయం, మూసారంబాగ్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం, ఉప్పల్ ఆర్టీఏ (RTA) కార్యాలయం, జీహెచ్ఎంసీ కవాడిగూడ (సర్కిల్-40) డిప్యూటీ కమిషనర్ ఆఫీస్, పటాన్‌చెరు మంజీర రబ్బర్ ఇండస్ట్రీస్, పటాన్‌చెరు ఎస్పీడీసీఎల్ డివిజినల్ ఇంజినీర్ (ఆపరేషన్స్) కార్యాలయం.. ఇలా పలు చోట్ల విజిలెన్స్ తనిఖీలు జరుగుతున్నాయి.
సిబ్బంది దగ్గర లెక్కల్లో లేని నగదు :
విజిలెన్స్ సోదాల్లో (Vigilance Raids) ఆయా కార్యాలయాల్లో పనిచేస్తున్న ప్రభుత్వ సిబ్బంది దగ్గర లెక్కల్లోకి రాని నగదు భారీ స్థాయిలో లభ్యమైనట్లు సమాచారం. మూసారంబాగ్, ఆజాంపుర సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో ఫైళ్ళ పరిశీలన క్రమంలో ఈ నగదు లభ్యమైంది. నిబంధనల ప్రకారం సిటిజన్ ఛార్టర్‌లో పేర్కొన్నమేరకు అప్లికేషన్లు, డాక్యుమెంట్ల స్క్రూటినీ, పరిష్కారం పూర్తికావాల్సి ఉన్నదని, కానీ దానికి విరుద్ధంగా దాదాపు 65 డాక్యుమెంట్లు పెండింగ్‌లోనే ఉన్నాయని, వాటిని క్లియర్ చేసేందుకు లంచం రూపంలో నగదును తీసుకున్నట్లు సోదాలు చేసిన అధికారులు అనుమానిస్తున్నారు. ప్రభుత్వ కార్యాలయంలో అనధికారికంగా కొందరు ఏజెంట్లు రికార్డులను హ్యాండిల్ చేయడం ఈ అనుమానాలకు బలం చేకూరినట్లయింది. భూములకు సంబంధించిన పలు రెవెన్యూ రికార్డులలో మార్పులు చేసినట్లు అనుమానం కలగడంతో, అధికారులు తదుపరి విచారణ కోసం స్వాధీనం చేసుకున్నారు. ఉప్పల్‌లోని ఆర్టీఏ కార్యాలయంలో సైతం డ్రైవింగ్ లైసెన్సులు, వాహనాల ఫిట్‌నెస్ సర్టిపికెట్ల జారీలో బ్రోకర్లు (ఏజెంట్ల), దళారుల జోక్యం ఉన్నట్లు సోదాల సందర్భంగా అధికారులు ధృవీకరించుకున్నారు. నిర్ణయించిన ఫీజుకంటే ఎక్కువ మొత్తాన్ని ప్రజల నుంచి వసూలు చేస్తున్నట్లు ఫిర్యాదులు రావడంతో ఈ సోదాలు అనివార్యమైనట్లు అధికారులు తెలిపారు.
ఎస్పీడీసీఎల్‌లో బిల్లింగ్ అక్రమాలు :
పటాన్‌చెరులోని ఎస్పీడీసీఎల్ డివిజనల్ ఇంజినీర్ (ఆపరేషన్స్) కార్యాలయంలో సైతం వివిధ రకాల అనుమతుల జారీలో అవకతవకలు జరుగుతున్నట్లు వచ్చిన ఫిర్యాదులను పరిశీలించిన విజిలెన్స్ అధికారులకు కొన్ని వివరాలు లభ్యమైనట్లు తెలిసింది. పరిశ్రమలకు అనుమతులు ఇవ్వడంలో భాగంగా పర్యావరణపరమైన నిబంధనలను డివిజనల్ ఇంజినీర్ పరిశీలించాల్సి ఉన్నదని, కానీ కొన్ని అవకతవకలు జరిగినట్లు తేలింది. వీటితో పాటు విద్యుత్ చౌర్యం, బిల్లింగ్ అక్రమాలను అరికట్టడానికి, ఆపరేషన్ లాసెస్ నియంత్రణ కోసం తీసుకుంటున్న చర్యలపైనా అధికారులు ఆరా తీశారు. పారిశ్రామికవాడల్లో ఏవైనా ఇండస్ట్రీస్ పన్నును ఎగవేసినా లేదా విద్యుత్‌ను అక్రమంగా వినియోగిస్తున్నా ఎస్పీడీసీఎల్ జరిమానా విధించాల్సి ఉంటుంది. అలాంటి అంశాల్లో నిబంధనలకు విరుద్ధంగా ఎస్పీడీసీఎల్ అధికారులు వ్యవహరిస్తున్నట్లు ఫిర్యాదులు రావడంతో విజిలెన్స్ ఈ సోదాలు నిర్వహించింది.
Read Also: విజయన్ తప్పుకోవాల్సిన టైం వచ్చింది: సీఎం రేవంత్
Follow Us On : WhatsApp

