epaper
Thursday, January 15, 2026
spot_img
epaper

బీఆర్ఎస్‌ను ‘నీళ్ళ’తో కడిగేద్దాం : సీఎం

కలం డెస్క్ : పాలమూరు ప్రాజెక్టుపై (Palamuru Rangareddy Project) కేసీఆర్ చెప్తున్నవన్నీ పచ్చి అబద్ధాలు.. అని మాట్లాడుతున్న కాంగ్రెస్ నేతలు అసెంబ్లీ వేదికగానే ఆయనను కడిగేయాలనే నిర్ణయానికి వచ్చారు. రెండేండ్లలో కాంగ్రెస్ సాధించిన ప్రగతిని, పదేండ్ల బీఆర్ఎస్ పాలనలో జరిగిన విధ్వంసాన్ని ప్రజలకు ఆ వేదిక ద్వారానే బహిర్గతం చేయాలనుకుంటున్నారు. ‘నీళ్ళు’ అంశంతో సెంటిమెంట్ రేకెత్తించాలని కేసీఆర్ కుట్ర పన్నుతున్నారని, ఆ అంశంతోనే ఆయనను రాజకీయంగా సమాధి చేయాలని కాంగ్రెస్ భావిస్తున్నది. పలువురు మంత్రులతో కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి (Revanth Reddy) సోమవారం రాత్రి సుదీర్ఘంగా చర్చించారు. సర్పంచ్ ఎన్నికల్లో సాధించిన విజయాల మొదలు ఇకపైన రాబోయే ఎన్నికల్లోనూ అదే ఉత్సాహాన్ని ప్రదర్శించడంపై విస్తృతంగా చర్చ జరిగింది.

సాధించాల్సింది చాలా ఉంది :

ఇటీవల జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ సాధించిన విజయాలను సీఎం రేవంత్ ప్రస్తావించారు. మంచి ఫలితాలనే సాధించామని సంతృప్తి వ్యక్తం చేశారు. చేయాల్సిన పనులు, సాధించాల్సింది ఇంకా చాలా ఉన్నదని గుర్తుచేశారు. పలు జిల్లాల్లో మెజారిటీ స్థానాలు కైవశం చేసుకోవడంలో మంత్రులు పోషించిన పాత్రను అభినందించారు. ఈ విజయాలతోనే సరిపెట్టుకోలేమని సూచించారు. మరింత ఉత్సాహంతో రానున్న అన్ని రకాల ఎన్నికల్లోనూ కాంగ్రెస్ సరికొత్త చరిత్రను సృష్టించాలని అన్నారు. మరింత బలంగా ప్రజామోదాన్ని పొందాలని వ్యాఖ్యానించారు. జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలను ఎప్పుడు పెట్టాలనే అంశంపై ఏకపక్షంగా నిర్ణయం తీసుకోకుండా అన్ని పార్టీల అభిప్రాయాలను అసెంబ్లీ వేదికగా తీసుకున్న తర్వాత డిసైడ్ చేద్దామని మంత్రులకు సూచించినట్లు తెలిసింది.

నదీ జలాలే ప్రధాన ఎజెండా :

నదీ జలాలపై కేసీఆర్ లేవనెత్తిన అంశాలను సీరియస్‌గా తీసుకున్న ప్రభుత్వం బలంగా తిప్పికొట్టాలని నిర్ణయించింది. వాస్తవాలను ప్రజల ముందుకు తీసుకెళ్ళాలని భావిస్తున్నది. ఈ నెల 29 నుంచి అసెంబ్లీ సమావేశాలను నిర్వహించడంపై సూత్రప్రాయంగా మంత్రులతో కలిసి నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. ఈ అసెంబ్లీ సమావేశాల్లో నదీ జలాల అంశాన్ని ప్రధాన ఎజెండాగా చేపట్టాలని ప్రభుత్వం భావిస్తున్నది. సమైక్య రాష్ట్రంలో జరిగిన జల దోపిడీని గణాంకాలతో సహా వివరించాలనుకుంటున్నది. తెలంగాణ ఏర్పడిన తర్వాత పదేండ్ల బీఆర్ఎస్ పాలనలో కేసీఆర్ ఎలాంటి ద్రోహానికి పాల్పడ్డారో ప్రజలకు తెలియజేయాలని అనుకుంటున్నది. ఏ పాలనలో ఏపీ నదీ జలాలను ఏ మేరకు కొల్లగొట్టిందో అధికారిక లెక్కలను బహిర్గతం చేయాలనుకుంటున్నది. కేసీఆర్‌(KCR)ను సభకు రప్పించేలా తగిన వ్యూహాన్ని కాంగ్రెస్ రచిస్తున్నది.

Read Also: కాళేశ్వరానికి కౌంటర్‌గా పాలమూరు

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>