కలం, వెబ్ డెస్క్: సూర్యాపేట జిల్లా కోదాడ(Kodad) పట్టణానికి చెందిన దళిత యువకుడు కర్ల రాజేశ్ పోలీస్ కస్టడీలో మృతి చెందిన ఘటనపై తెలంగాణ రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ (Telangana HRC) తీవ్రంగా స్పందించింది. ఈ కేసులో మానవ హక్కుల ఉల్లంఘనల ఉందని గుర్తించిన కమిషన్, సమగ్ర విచారణ చేపట్టాలని ఆదేశించింది. కమిషన్ SR నంబర్లు 4129 మరియు 4130 ఆఫ్ 2025 కింద నమోదైన రెండు ఫిర్యాదులను కలిపి పరిశీలించింది.
మృతుడి తల్లి కర్ల లలిత, ప్రముఖ సామాజిక కార్యకర్త మంద కృష్ణ మాదిగ(Manda Krishna Madiga), మాజీ ఎంపీ వెంకటేశ్ నేత తదితరులు సమర్పించిన ఫిర్యాదుల ఆధారంగా కమిషన్ (Telangana HRC) ఈ నిర్ణయం తీసుకుంది. ఫిర్యాదుల ప్రకారం, చిల్కూరు, కోదాడ రూరల్ పోలీస్ స్టేషన్ల పరిధిలో రాజేశ్‌ను నవంబర్ 4 నుంచి 9 వరకు అక్రమంగా నిర్బంధించి, థర్డ్ డిగ్రీ పద్ధతులతో తీవ్ర హింసకు గురిచేశారని ఆరోపణలు వచ్చాయి.
కుటుంబ సభ్యులను కలవనీయకుండా చేసి, తప్పుడు క్రిమినల్ కేసులో ఇరికించారని తెలిపారు. నవంబర్ 10న కోర్టుకు తరలించినప్పుడు రాజేశ్‌లో తీవ్ర గాయాలు కనిపించాయి. అనంతరం సబ్ జైలు నుంచి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినా, కస్టడీలో జరిగిన హింస వల్లే అతడు మృతి చెందాడని కమిషన్ గమనించింది. ఈ ఘటనలో మానవ హక్కుల ఉల్లంఘనలు తీవ్రంగా ఉన్నాయని పేర్కొన్న కమిషన్, హోం శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ నుంచి సమగ్ర నివేదిక కోరింది.
Read Also: బీఆర్ఎస్‌ను ‘నీళ్ళ’తో కడిగేద్దాం : సీఎం
Follow Us On: Youtube


