కలం డెస్క్ : కాంగ్రెస్ (Congress), బీఆర్ఎస్ (BRS) మధ్య పొలిటికల్ ఫైట్ (Political Fight) కొత్త రూపం తీసుకుంటున్నది. రెండు పార్టీల మధ్య వాటర్ వార్ (Water War) మొదలైంది. ప్రస్తుతం ఇది మీడియా సమావేశాల వేదికగా జరుగుతున్నా రానున్న రోజుల్లో అసెంబ్లీకి చేరుతున్నది. ఇంతకాలం బీఆర్ఎస్ పార్టీని కాళేశ్వరం ప్రాజెక్టు (Kaleshwaram) పేరుతో కాంగ్రెస్ టార్గెట్ చేసింది. దానికి కౌంటర్‌గా పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టును (Palamuru Rangareddy Project) బీఆర్ఎస్ ఎంచుకున్నది. తెలంగాణ ఉద్యమంలో నీళ్ల అంశానికి ఒక ప్రత్యేకత ఉన్నది. ప్రజల్లో భావోద్వేగాలను రగిలించే సెంటిమెంటల్ ఇష్యూ. పార్టీ ఆవిర్భావం మొదలు రాష్ట్ర సాధన వరకు దీన్ని కేసీఆర్ కీలక అస్త్రంగా ఎంచుకున్నారు. అధికారాన్ని కోల్పోయిన తర్వాత రెండేండ్ల వరకు ఆయన ఫామ్ హౌజ్‌కే పరిమితమయ్యారు. జనంలోకి రావాలనుకుని ఇప్పుడు నదీ జలాల అంశాన్ని టేకప్ చేస్తున్నారు.
‘జలదృశ్యం’ మొదలు కాళేశ్వరం దాకా.. :
తెలంగాణ రాష్ట్ర సమితి పేరుతో రాజకీయ పార్టీని స్థాపించిన భవనం పేరు ‘జలదృశ్యం’. ఆ తర్వాత తెలంగాణ రాష్ట్ర సాధన కోసం జరిగిన ఉద్యమంలో కృష్ణా, గోదావరి జలాల అంశాన్ని విస్తృతంగా ప్రచారం చేశారు. ప్రజలకు అర్థమైన భాషలో వివరించి ఆకట్టుకున్నారు. మహబూబ్‌నగర్ ఎంపీగా ఆ జిల్లాలోని సాగునీటి ప్రాజెక్టుల గురించి అనేకసార్లు ప్రసంగాలు చేశారు. సమైక్య రాష్ట్రంలో అన్యాయం జరిగిందని, ఇకపైన కుర్చీ వేసుకుని కట్టిస్తా.. అనే హామీలిచ్చారు. కృష్ణా బేసిన్‌లోని (Krishna Basin) ప్రాజెక్టులు అసంపూర్ణంగా ఉండిపోయాయి. కాళేశ్వరం ప్రాజెక్టును మూడేండ్లలోనే పూర్తి చేశామని గర్వంగా చెప్పుకున్నారు. కానీ అదే సమయంలో ఉత్తర తెలంగాణపై చూపిన ప్రేమ దక్షిణ తెలంగాణపై (South Telangana) లేదనే అపవాదును మూటగట్టుకున్నారు. ఆ ప్రభావం 2023 అసెంబ్లీ ఎన్నికల్లో చవిచూసింది.
నాటి సంతకమే నేడు శాపమైందా? :
సమైక్య రాష్ట్రంలో తెలంగాణకు నదీ జలాల్లో అన్యాయం జరిగిందనేది తొలి నుంచీ కేసీఆర్ వాదన. ఉమ్మడి పాలమూరు జిల్లా ప్రజలు వలస వెళ్ళడానికి అదే కారణమని జనాలకు అర్థమయ్యే భాషలో ప్రసంగాలు చేశారు. స్వరాష్ట్రం ఏర్పడితే పాలమూరు జిల్లా పచ్చబడుతుందని హామీ ఇచ్చి ప్రజలకు కొత్త నమ్మకాన్ని కలిగించారు. కానీ పదేండ్ల పాలనలో ప్రాజెక్టులు పూర్తికాకపోవడం, కొన్ని లిఫ్ట్ పంపులు (Lift Pumps) ప్రారంభమైనా కాల్వలు లేకపోవడంతో సాగునీరు అందకపోవడం, కుర్చీ వేసుకుని కట్టిస్తానని చెప్పినవి అటకెక్కడం.. ఇలాంటివన్నీ ఆ జిల్లా ప్రజల్లో అసంతృప్తికి కారణమయ్యాయి. దీనికి తోడు జగన్‌తో (YS Jagan) ప్రగతిభవన్‌లో విందు సమావేశం, బేసిన్లు లేవ్.. భేషజాల్లేవ్.. అనే అవగాహన కుదరడం, ఏపీ ప్రభుత్వం కడుతున్న పలు ఎత్తిపోతల ప్రాజెక్టులకు బ్రేక్ వేయకపోవడం, 299 టీఎంసీలు (TMC) సరిపోతాయంటూ ఒప్పందాన్ని కుదుర్చుకోవడం.. ఇవన్నీ కేసీఆర్ (KCR) పట్ల నెగెటివ్ పెరగడానికి దారితీశాయి. ఆయన సంతకమే దక్షిణ తెలంగాణ జిల్లాలకు శాపంగా మారిందనే అభిప్రాయం ప్రజల్లో బలపడింది. దాన్ని కాంగ్రెస్ నేతలు విస్తృతంగా ప్రచారం చేశారు.
అసెంబ్లీ వేదికగా ఎండగట్టే ప్లాన్ :
కేసీఆర్ లేవనెత్తిన కృష్ణా, గోదావరి జలాల అంశాలన్నీ అబద్ధాలేనని మంత్రి ఉత్తమ్ (Minister Uttam) సహా పలువురు కాంగ్రెస్ నేతలు ఇప్పటికే కామెంట్ చేశారు. మీడియా సమావేశాలు, బహిరంగసభల ద్వారా అబద్ధాలను ప్రచారం చేస్తూ ఉంటే ఊరుకునే ప్రసక్తే లేదని, అసెంబ్లీ వేదికగానే వాస్తవాలను ప్రజలకు వివరించేందుకు కాంగ్రెస్ సిద్ధమవుతున్నది. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు (Palamuru Rangareddy Project) దయనీయ స్థితికి కేసీఆరే కారణమన్నది కాంగ్రెస్ ప్రధాన విమర్శ. ఉమ్మడి రాష్ట్రంలో జరిగిన అన్యాయం కంటే కేసీఆర్ పాలనలోనే ఎక్కువ అని ఇప్పటికే మంత్రి ఉత్తమ్ వ్యాఖ్యానించారు. అసెంబ్లీ వేదికగా లెక్కలతో సహా వివరించేలా సిద్ధమవుతున్నారు. కేంద్రంతో జరిగిన సమావేశాలు, ప్రాజెక్టుల అనుమతుల కోసం రాసిన లేఖలు, ఏపీతో సంతకాలు చేసిన మీటింగుల వివరాలను డాక్యుమెంట్లతో సహా అసెంబ్లీ సమావేశాల్లో వివరించి కేసీఆర్ నిర్వాకాన్ని బహిర్గతం చేయాలని ప్రభుత్వం భావిస్తున్నది. కేసీఆర్ అసెంబ్లీకి రావాలి.. ఆయన చేసిన సంతకం దక్షిణ తెలంగాణకు ఎలా శాపంగా మారిందో వినాలి… అనే అభిప్రాయం కాంగ్రెస్ నేతల నుంచి వ్యక్తమవుతున్నది.
Read Also: కృష్ణా జలాల్లో ద్రోహమెవరిది?
Follow Us On: X(Twitter)


