కలం డెస్క్ : రాష్ట్రవ్యాప్తంగా వివిధ డిపార్టుమెంట్లలో (Departments) సుమారు 40 వేల మంది ఔట్‌సోర్సింగ్ (Bogus Outsourcing Employees) ఉద్యోగులు బోగస్ అని తేలింది. కాగితాల మీద మాత్రమే ఉనికిలో ఉన్న ఈ ఉద్యోగులు ఫిజికల్‌గా లేరనేది తేటతెల్లమైంది. ఆఫీసర్లు, ఔట్‌సోర్సింగ్ ఏజెన్సీలు కుమ్మక్కై ప్రభుత్వ ఖజానాకు గండికొట్టినట్లు ప్రాథమిక నివేదికలో వెల్లడైంది. రాష్ట్రం మొత్తంమీద సుమారు 4.95 లక్షల మంది ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులున్నారు. ఇందులో నకిలీ సర్టిఫికెట్లతో చేరినవారు కొందరైతే, అసలు ఉద్యోగమే చేయకుండా ప్రతి నెలా వేతనం అందుకుంటున్నవారు ఇంకొందరు. ఇలా మొత్తంగా సుమారు 40 వేల మంది బోగస్ ఉద్యోగులున్నట్లు ఇటీవల ఫోరెన్సిక్ ఆడిట్‌లో (Forensic Audit) తేలింది. బోగస్ ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులను ఏరివేసే పనిని ప్రభుత్వం మొదలుపెట్టింది. ఆ ప్రక్షాళనలో భాగంగానే ఇటీవల ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులందరి ఆధార్ కార్డులను (Aadhar Card Details) ప్రభుత్వం సేకరించింది. దీంతో అసలు భాగోతం వెలుగులోకి వచ్చింది.
రికవరీ, ఆస్తుల జప్తుకు సర్కారు సిద్ధం :
బోగస్ ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులున్నట్లు ఆరోపణలు రావడంతో ప్రభుత్వం అప్రమత్తమైంది. అలాంటివారిని ఏరివేయాలని నిర్ణయం తీసుకున్నది. ఇంతకాలం వారికి చెల్లించిన జీతభత్యాలను రికవరీ (Salary Recovery) చేయాలనుకుంటున్నది. రికవరీ సాధ్యం కాకుంటే ఉద్యోగుల, ఔట్‌సోర్సింగ్ ఏజెన్సీల ఆస్తులను జప్తు (Asset confiscation) చేయనున్నది. ఉద్దేశపూర్వకంగా ప్రభుత్వాన్ని మోసం చేసి ఖజానాకు తూట్లు పొడిచినందున అటు శాఖాపరమైన, ఇటు క్రిమినల్ కేసులు నమోదు చేసి చట్టబద్ధంగా శిక్షించాలన్నది ప్రభుత్వం ఆలోచన. మోసం చేసినట్లు రుజువైతే రికవరీ, ఆస్తుల జప్తుతో పాటు జైలుశిక్షా తప్పకపోవచ్చు. రాష్ట్రంలో సుమారు 40 ఔట్‌సోర్సింగ్ ఏజెన్సీలు ఈ మోసానికి పాల్పడినట్లు ఆ నివేదికలో శాంతికుమారి పేర్కొన్నట్లు తెలిసింది. దాదాపు 400 మందిపై చట్టపరమైన చర్యలు ఉండొచ్చని సమాచారం.
అధికారుల కుమ్మక్కుతో మోసం :
ఔట్‌సోర్సింగ్ ఏజెన్సీల నుంచి బోగస్ ఉద్యోగులు(Bogus Outsourcing) పుట్టుకురావడం వెనక హెచ్ఓడీలుగా ఉండే అధికారులు, ఏజెన్సీల ప్రతినిధులు కుమ్మక్కు కావడమేనని ప్రాథమిక సమాచారం. నిజాన్ని నిగ్గు తేల్చేందుకు రిటైర్డ్ చీఫ్ సెక్రటరీ శాంతికుమారి ఆధ్వర్యంలో ప్రభుత్వం విచారణ కమిటీని నియమించింది. దళారీ విధానాలను ఆమె స్టడీ చేసి ప్రభుత్వానికి నివేదిక సమర్పించారు. ఎక్కువగా విద్య, వైద్యారోగ్య, మునిసిపల్ అడ్మినిస్ట్రేషన్, రెవెన్యూ, పోలీస్, పంచాయితీ రాజ్ శాఖల్లో ఉన్నట్లు తేలింది. సుమారు 40 వేల మంది ఉన్నట్లు సమాచారం. అధికారుల సహకారంతో నెలకు సగటున రూ. 50 కోట్ల చొప్పున ఏజెన్సీలకు ముడుతున్నట్లు తెలిసింది. రాష్ట్రంలో వివిధ ప్రభుత్వ శాఖలకు ఉద్యోగులను సమకూర్చడానికి దాదాపు 400కు పైగా ఔట్‌సోర్సింగ్ ఏజెన్సీలు పనిచేస్తున్నాయి.
ఏటా రూ. 600 కోట్ల మేర మోసం :
నకిలీ వివరాలను ప్రభుత్వానికి సమర్పించే ఔట్‌సోర్సింగ్ ఏజెంట్లు ఖజానాకు గండికొడుతున్నాయి. అధికారుల అండదండలతో ఏటా కమిషన్ రూపంలో రూ. 600 కోట్లు ఏజెన్సీలకు ముడుతున్నట్లు తెలిసింది. ప్రతి నెలా జీతాల కోసం ఏజెన్సీలు ప్రభుత్వానికి పంపుతున్న జాబితాలో పెద్ద ఎత్తున తేడాలు రావడంతో బోగస్ ఔట్ సోర్సింగ్ ఉద్యోగులున్నట్లు అనుమానాలు పొడసూపాయి. ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులకు ప్రభుత్వం నెలనెలా శాలరీల రూపంలో రూ. 1115 కోట్ల మేర చెల్లిస్తున్నది. ప్రభుత్వ ఉద్యోగుల్లాగానే ఔట్‌సోర్సింగ్ ఎంప్లాయీస్‌కు సైతం సకాలంలో జీతాలు ఇవ్వాలన్నది ప్రభుత్వం ఒక విధానంగానే భావించింది. ఇందుకోసం క్రమం తప్పకుండా, జాప్యం లేకుండా ఏజెన్సీలకు పేమెంట్ చేస్తున్నది. కానీ ఏజెన్సీలు మాత్రం ఉద్యోగులకు జీతం ఇవ్వకుండా తాత్సారం చేస్తున్నది. రోజులు, వారాల తరబడి ఏజెన్సీల బ్యాంకు ఖాతాల్లోనే ఆ డబ్బులు మూలుగుతున్నాయి. దీంతో వడ్డీల రూపంలో ఏజెన్సీలకు అదనంగా ఆదాయం సమకూరుతున్నది. ఇంకోవైపు రకరకాల కారణాలతో ఉద్యోగులకు జీతంలో కోత పెడుతూ అందినకాడికి ఏజెన్సీలు మింగేస్తున్నాయి. వీటన్నింటికీ చెక్ పెట్టాలని ప్రభుత్వం సీరియస్‌గా ఆలోచిస్తున్నది.
ఔట్‌సోర్సింగ్ కోసం త్వరలో కార్పొరేషన్ :
రకరకాల పేర్లతో ఔట్‌సోర్సింగ్ కంపెనీలు పుట్టుకొస్తుండడంతో వీటిని గాడిన పెట్టడానికి ప్రభుత్వం చర్యలకు శ్రీకారం చుట్టింది. ప్రత్యేకంగా ఒక కార్పొరేషన్‌ను ఏర్పాటు చేయాలనుకుంటున్నది. ఇకపైన ప్రభుత్వంలోని ఏ డిపార్టుమెంటులో ఔట్‌సోర్సింగ్ ఉద్యోగిని నియమించాలనుకున్నా ఈ కార్పొరేషన్ ద్వారానే జరగాల్సి ఉంటుంది. జవాబుదారీతనం, పారదర్శకత కోసం ఈ నూతన విధానానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టనున్నది. చట్టబద్ధంగా అన్ని అర్హతలు ఉండేలా, ఒకే విధానం ద్వారా ఉద్యోగుల భర్తీ జరిగేలా చూడడం ఈ కార్పొరేషన్ బాధ్యత. దీని ఫంక్షనింగ్, పర్యవేక్షణ బాధ్యతలకు కూడా ప్రభుత్వం ప్రత్యేక మెకానిజాన్ని రూపొందించనున్నది. ప్రభుత్వ ఖజానాకు భారీ స్థాయిలో గండి పడుతున్నందున ఈ కార్పొరేషన్ ఏర్పాటు అనివార్యం కానున్నది.
Read Also: కాళేశ్వరానికి కౌంటర్‌గా పాలమూరు
Follow Us On: X(Twitter)


