కలం, వెబ్ డెస్క్ : మూసీ నది పునరుజ్జీవ ప్రాజెక్టులో భాగంగా గండీపేట మండలం మంచిరేవుల వద్ద నిర్మించనున్న శ్రీ ఓంకారేశ్వర స్వామి దేవాలయానికి (Omkareshwara Temple) ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Revanth Reddy), డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో కలిసి శనివారం శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి దంపతులు పాల్గొని శాస్త్రోక్తంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. శృంగేరి శారదాపీఠం పండితుల సూచనలు, సలహాల మేరకు ఈ ఆలయ నిర్మాణాన్ని చేపట్టడం విశేషం.
దాదాపు 700 కోట్ల రూపాయల భారీ వ్యయంతో, 8 ఎకరాల విస్తీర్ణంలో ఈ అద్భుత ఆధ్యాత్మిక కేంద్రాన్ని తీర్చిదిద్దనున్నారు. దాతలు, ప్రైవేటు సంస్థల స్వచ్ఛంద సహకారంతో ఈ నిర్మాణాన్ని పూర్తి చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ ప్రాజెక్టులో ప్రధాన ఆకర్షణగా మూసీ నది మధ్యలో 100 అడుగుల ఎత్తుతో భారీ శివుడి విగ్రహాన్ని ప్రతిష్టించనున్నారు. ఆలయంతో (Omkareshwara Temple) పాటు గోశాల ఏర్పాటుకు కూడా ప్రణాళికలు సిద్ధం చేశారు.
మూసీ పరివాహక ప్రాంతాన్ని సర్వమత సౌభ్రాతృత్వానికి వేదికగా మార్చాలన్న లక్ష్యంతో ప్రభుత్వం ఈ ఆధ్యాత్మిక ప్రాజెక్టును రూపొందించింది. ఇందులో భాగంగా కేవలం దేవాలయమే కాకుండా, ఇతర మతాల ప్రార్థనా మందిరాలను కూడా నిర్మించనున్నారు. పురానాపూల్ వద్ద మసీదు, గౌలిగూడ ప్రాంతంలో గురుద్వారా, నాగోల్ వద్ద చర్చిని నిర్మించేందుకు సర్కారు నిర్ణయం తీసుకుంది. మూసీ సుందరీకరణలో భాగంగా చేపట్టిన ఈ ప్రాజెక్టు భవిష్యత్తులో నగరం యొక్క ఆధ్యాత్మిక ముఖచిత్రాన్ని మార్చనుంది.
Read Also: పురుషాధిక్య రాజకీయాల్లో.. నారీ భేరీ
Follow Us On: Instagram

