కలం, తెలంగాణ బ్యూరో: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇండ్ల (Indiramma Indlu) నిర్మాణాల్లో కొత్త నిబంధనలు అమలులోకి తేనుంది. దీనిపై ఇప్పటికే మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పలుమార్లు రివ్యూ చేశారు. ఇటీవలే సెకండ్ ఫేజ్‌నూ లాంఛనంగా ప్రారంభించారు. ఇప్పటివరకు జరిగిన గృహప్రవేశాలు, ముగింపు దశలోని ఇండ్ల నిర్మాణాలపై సమీక్షించిన అనంతరం వెలుగులోకి వచ్చిన అంశాలను పరిగణనలోకి తీసుకున్న గృహనిర్మాణ శాఖ కొన్ని రూల్స్ తప్పకుండా పాటించాలని లబ్ధిదారులకు స్పష్టం చేసింది. అవసరం లేకపోయినా శ్లాబ్ విస్తీర్ణాన్ని పెంచడంతో లబ్ధిదారులపై అదనపు ఆర్థిక భారం పడుతున్నదని పేర్కొన్నది. దీంతో గరిష్ట పరిమితిని నిర్దేశించింది. ఇంటి ముందు భాగంలో గరిష్టంగా మూడు అడుగుల వరకు మాత్రమే శ్లాబ్ పొడిగించుకోవచ్చని, మిగిలిన మూడు వైపులా ఒక్క అడుగు చొప్పున మాత్రమే పొడిగించాలని స్పష్టం చేసింది. ఉదాహరణకు 600 చదరపు అడుగుల ప్లింత్ ఏరియా ఉన్న ఇంటికి గరిష్టంగా 750 చదరపు అడుగుల శ్లాబ్ మాత్రమే ఉండాలని, 400 చదరపు అడుగుల ప్లింత్ ఏరియా ఉన్న ఇంటికి శ్లాబ్ విస్తీర్ణం 500 చదరపు అడుగులు మించకూడదని వివరించింది.
ప్రభుత్వానికి తెలంగాణ హౌసింగ్ కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్ అందించిన నివేదికలో, చాలా మంది లబ్ధిదారులు అనుమతించిన నమూనాకు మించి మూడు నుంచి ఎనిమిది అడుగుల వరకు శ్లాబ్‌ను పొడిగిస్తున్నారని పేర్కొన్నారు. దీంతో నిర్మాణ వ్యయం భారీగా పెరిగి, కొందరు ప్రైవేటుగా అప్పులు చేయాల్సి వస్తున్నదని తెలిపారు. మరికొందరు మధ్యలోనే ఇళ్ల (Indiramma Indlu) నిర్మాణాన్ని నిలిపివేస్తున్నారని వివరించారు. ఈ పరిస్థితి పేద నిరాశ్రయ కుటుంబాలకు ప్రభుత్వ ఆర్థిక సాయంతో ఇళ్లు అందించాలన్న లక్ష్యానికి విఘాతం కలిగిస్తున్నదని తెలిపారు. అదనంగా, ఇంటి తలుపులు, కిటికీల రక్షణ కోసం అన్ని వైపులా స్లాబ్‌ను పొడిగించకుండా సన్ షేడ్లు (సజ్జాలు) ఏర్పాటు చేసుకునేలా లబ్ధిదారులకు అవగాహన కల్పించాలని ప్రభుత్వం సూచించింది. ముందు భాగంలో నీడ అవసరమైతే ఆర్‌సీసీ స్లాబ్‌కు బదులుగా జీఐ షీట్ ఆధారిత షెడ్లను ఏర్పాటు చేసుకోవాలని సూచించింది. ఈ ఆదేశాలు ప్రస్తుతం రూఫ్ లెవల్, బేస్ లెవల్, గ్రౌండింగ్ దశలోని లేదా ఇంకా నిర్మాణం ప్రారంభించని లబ్ధిదారులందరికీ వర్తిస్తాయని ప్రభుత్వం పేర్కొంది. కలెక్టర్లు, ప్రాజెక్ట్ డైరెక్టర్లు, అసిస్టెంట్ ఇంజినీర్లు, పంచాయతీ కార్యదర్శుల ద్వారా లబ్ధిదారులకు విస్తృతంగా అవగాహన కల్పించాలని ఆదేశించింది. తదుపరి చర్యలు తీసుకోవాలని తెలంగాణ హౌసింగ్ కార్పొరేషన్‌ను ప్రభుత్వం ఆదేశించింది.

