Mobile Popup Ad
Mobile Popup Ad

గ్రేటర్ వరంగల్‌కు కొత్త బాస్.. భారీ సవాళ్లు!

కలం, వరంగల్ బ్యూరో : గ్రేటర్ వరంగల్ (Greater Warangal) కార్పొరేషన్ కొత్త కమిషనర్ (New Commissioner) కు సమస్యలు స్వాగతం పలుకుతున్నాయి. ఓ వైపు వర్షాకాలం, మరోవైపు పెండింగ్ అభివృద్ధి పనులు, పారిశుద్ధ్యం, అక్రమ నిర్మాణాలు, ట్రాఫిక్, ఆదాయ వసూళ్లు, త్వరలో జరిగే కార్పొరేషన్ ఎన్నికలు.. ఇలా ఒక్కోటి సవాల్‌గా మారనున్నాయి. సోమవారం ఆయన బాధ్యతలు చేపట్టనున్న నేపథ్యంలో సమస్యలు ఏ విధంగా అధిగమిస్తారో అనే చర్చ జరుగుతున్నది. భారీ వర్షాలు కురిసిన ప్రతిసారి సిటీలోని పలు లోతట్టు కాలనీలు నీటమునిగిపోతున్నాయి.

ప్రధానంగా హంటర్ రోడ్ పరిసరాలు, కాజీపేటలోని కొన్ని కాలనీలు, హనుమకొండలోని లోతట్టు ప్రాంతాలు, వరంగల్ తూర్పు ప్రాంతాల్లో వర్షపు నీరు డ్రైనేజీలు సామర్థ్యానికి మించి నిండిపోవడం, నాలాల ఆక్రమణలు, వర్షపు నీటి కాల్వల నిర్వహణ సరిగా లేకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రధాన నాలాలు, ఉప నాలాలు ఆక్రమణలకు గురయ్యాయి. వీటిని గతంలోనే అధికారులు గుర్తించారు. ఆక్రమణల తొలగింపు నెమ్మదిగా సాగుతుండటంతో వర్షపు నీటి ప్రవాహం ఆగిపోతున్నది. దీంతో చిన్న వర్షానికే కాలనీలు జలమయమవుతున్నాయి. అప్పటికప్పుడు ప్రత్యామ్నాయ చర్యలు తీసుకుంటున్నప్పటికీ శాశ్వత పరిష్కారం చూపడం లేదనే విమర్శలున్నాయి.

అధ్వానంగా రోడ్లు..

స్మార్ట్ సిటీ పనుల కోసం తవ్విన రోడ్లు కొన్ని చోట్ల పూర్తిగా పునరుద్ధరించలేదు. దీంతో వాహనదారులు ప్రమాదాలకు గురవుతున్నారు. పారిశుద్ధ్యం చెత్త నిర్వహణలోను ఇబ్బందులు ఉన్నాయి. కొన్ని డివిజన్లలో చెత్త పేరుకుపోవడం, డంపింగ్ పాయింట్ల నిర్వహణ సరిగా లేకపోవడం, వర్షాకాలంలో దోమల వ్యాప్తి పెరగడం ప్రజలను ఆందోళనకు గురిచేస్తున్నది. కొన్ని ప్రాంతాల్లో తాగునీరు సక్రమంగా అందకపోవడం, తక్కువ ప్రెషర్ తో నీరు రావడం, పైప్‌లైన్ లీకేజీలు, కలుషిత నీటి ఫిర్యాదులు తరచూ వస్తున్నాయి. స్మార్ట్ సిటీ కింద చేపట్టిన కొన్ని పనులు పూర్తయినా, మరికొన్ని పనులు ఇంకా నత్తనడకన సాగుతున్నాయనే విమర్శలు ఉన్నాయి.

పేరుకుపోయిన ఫైళ్లు

భవనాలు, లే అవుట్ అనుమతులు, ట్రేడ్ లైసెన్సులు, ఆస్తి పన్ను వివాదాలు, అభివృద్ధి పనుల బిల్లులు వంటి వందలాది ఫైళ్లు పెండింగ్‌లో ఉన్నాయని వ్యాపారులు, ప్రజలు ఆరోపిస్తున్నారు. కొందరు అధికార పార్టీ నేతలు ప్రజాప్రతినిధులు ఒత్తిడితో గతంలో పనిచేసిన అధికారులు ఇష్టారాజ్యంగా ఇండ్లకు అపార్ట్ మెంట్లకు అనుమతులు ఇచ్చారు. ప్రతి సోమవారం ప్రజావాణిలో ఇలాంటి సమస్యలపై కుప్పలు తెప్పలుగా ఫిర్యాదులుతున్నాయి. ఈ క్రమంలో అనుమతులకు విరుద్ధంగా నిర్మాణాలు, నాలాలపై ఆక్రమణలు, ప్రభుత్వ స్థలాల ఆక్రమణ వంటి అంశాలపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.

త్వరలో మున్సిపల్ ఎన్నికలు

మున్సిపల్ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ఓటరు జాబితా, పోలింగ్ కేంద్రాల ఏర్పాట్లు, సిబ్బంది సమన్వయం, ఎన్నికల నియమావళి అమలు వంటి పరిపాలనా బాధ్యతలు కూడా కీలకం కానున్నాయి. ఎన్నికల సమయంలో సిటీలో ప్రాథమిక సౌకర్యాలపై ప్రజల దృష్టి ఎక్కువగా ఉంటుంది. కొత్త కమిషనర్ కార్యాలయానికే పరిమితం కాకుండా క్షేత్రస్థాయిలో పర్యటించి, ముంపు ప్రాంతాలు, డ్రైనేజీలు, రోడ్లు, పారిశుద్ధ్యం, పెండింగ్ పనులపై ప్రత్యేక దృష్టి సారించాలని నగరవాసులు కోరుతున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>