కలం, వెబ్ డెస్క్: నల్గొండ సభలో సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో ఎంపీ రఘువీర్ రెడ్డి (Raghuveer Reddy) సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘నల్గొండ పార్లమెంట్ పరిధిలో ఇద్దరు మంత్రులున్నారు. నిధులు ఎక్కువ శాతం వారి నియోజకవర్గాలకే వెళ్తున్నాయి. మిగతా చిన్న నియోజకవర్గాలపై కూడా ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి’ అని సీఎం రేవంత్ రెడ్డిని కోరారు. నాగార్జునసాగర్ నియోజకవర్గంలో ఎస్సెల్బీసీ భూ సేకరణ పనులు పూర్తయితే, రైతులకు సాగు నీరు వస్తుందన్నారు. అలాగే దేవరకొండ, మిర్యాలగూడ నియోజకవర్గాల్లో కూడా ఇంకా భూసేకరణ పనులు పూర్తి కాలేదన్నారు. దీనిపై సీఎం స్థాయిలో సమీక్ష చేస్తే, సమస్యలు త్వరగా పరిష్కారమవుతాయని విన్నవించారు.
12 చోట్ల కాంగ్రెస్ పార్టీనే గెలుపు..
గత ఎన్నికల్లో ఉమ్మడి నల్గొండ జిల్లాలో సూర్యాపేట తప్ప మిగతా అన్ని చోట్ల కాంగ్రెస్ గెలిచిందని.. వచ్చే ఎన్నికల్లో మాత్రం 12 అసెంబ్లీ స్థానాల్లో మొత్తం కాంగ్రెస్ పార్టీనే గెలుస్తుందని ఎంపీ రఘువీర్ రెడ్డి స్పష్టం చేశారు. ఎన్నికల్లో హామీ ఇచ్చినట్లుగా పనులు చేసేలా చొరవ తీసుకోవాలని సీఎంను కోరారు. కాగా, నిధుల విడుదలపై ఎంపీ చేసిన వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యత సంతరించుకున్నాయి. గతంలో అసెంబ్లీ వేదికగా మునుగోడు ఎమ్మెల్యే రాజ్ గోపాల్ రెడ్డి సైతం ఇలాంటి వ్యాఖ్యలు చేసిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తుకు తెచ్చుకుంటున్నారు.

