కలం, నల్లగొండ బ్యూరో: గత బీఆర్ఎస్ పదేండ్ల పాలనలో తెలంగాణను వందేండ్లకు సరిపడా విధ్వంసం జరిగిందని, ఆ పార్టీని రాష్ట్ర ప్రజలు ఉప్పుపాతర వేశారని సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) అన్నారు. ‘‘పదేండ్లలో రూ. 8 లక్షల 11 వేల కోట్ల అప్పులు చేసి రాష్ట్రాన్ని లూటీ చేశారు. అధికారం కోల్పోయిన అక్కసుతో, కడుపు నిండా విషంతో మళ్లీ అధికారం కావాలని బావాబామ్మర్దులు (హరీశ్, కేటీఆర్) తోడేళ్లలా ఊరూరా తిరుగుతున్నారు. తెలంగాణ సమాజం వారిని శాశ్వతంగా సామాజిక బహిష్కరణ చేసింది” అని ఆయన తెలిపారు. ఆదివారం నల్లగొండ సభలో సీఎం రేవంత్ మాట్లాడారు. ‘‘సూర్యాపేటలో తులసి వనంలో గంజాయి మొక్కలా ఒకడు మిగిలాడు. అతడిని కూడా వదిలిపెట్టబోమని కాంగ్రెస్ కార్యకర్తలు చెబుతున్నారు” అని సూర్యాపేట బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డిని ఉద్దేశించి వ్యాఖ్యానించారు.
మూసీ ప్రక్షాళన చేసి తీరుతాం
నల్లగొండ జిల్లాను పీడిస్తున్న ఎస్ఎల్బీసీ సొరంగం ప్రాజెక్టును పదేండ్లపాటు పడకేయించిన దుర్మార్గుడు కేసీఆర్ అని సీఎం రేవంత్ (CM Revanth Reddy) దుయ్యబట్టారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చే ఎన్నికల నాటికి ఎస్ఎల్బీసీని పూర్తి చేసి 3 లక్షల ఎకరాలకు నీరందిస్తుందని స్పష్టం చేశారు. అలాగే మూసీ కాలుష్యం వల్ల నల్లగొండ ఆడబిడ్డలకు అంగవైకల్యంతో పిల్లలు పుడుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ‘‘మూసీ ప్రక్షాళన చేసి తీరుతానని ఒట్టు వేసి చెబుతున్నా. ఈ అభివృద్ధిని అడ్డుకోవాలని చూస్తే ఎంతటి వారినైనా మూసీలోనే వేసి తొక్కుతా’ అని హెచ్చరించారు.
– ‘‘ఫామ్‌హౌస్‌లో కూర్చున్న శుక్రాచార్యుడు, ఊరూరా తిరుగుతున్న సుబాహుడు, మారీచులు (హరీశ్, కేటీఆర్) చెప్పే అబద్ధాలను ప్రజలు నమ్మరని సీఎం రేవంత్ అన్నారు.
– సింగరేణిని కొల్లగొట్టారంటూ తప్పుడు ప్రచారం చేస్తున్న వారి జాతకాలన్నీ తెలంగాణ సమాజానికి తెలుసని సీఎం తెలిపారు. 2034 వరకు రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వమే ఉంటుందని ధీమా వ్యక్తం చేశారు.
పాలనపై అసెంబ్లీలో చర్చిద్దాం.. రెడీనా
– కాంగ్రెస్ ఏం చేసిందని ప్రశ్నిస్తున్న ప్రతిపక్షాలకు తాను బహిరంగ సవాల్ విసురుతున్నానని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.
– ‘‘పదేండ్ల బీఆర్ఎస్ పాలన, పన్నెండేండ్ల కేంద్ర బీజేపీ పాలన, మా ముప్పై నెలల (రెండున్నరేండ్ల) పాలనపై చర్చకు మేం సిద్ధం. కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ మేనిఫెస్టోలపై చర్చించడానికి ప్రత్యేక అసెంబ్లీ, శాసనమండలి సమావేశాలు ఏర్పాటు చేస్తాం. స్పీకర్, కౌన్సిల్ చైర్మన్‌కు ప్రతిపక్షాలు లేఖ రాయాలి. ఎవరు ఏం చేశారో సభలోనే తేల్చుకుందాం” అంటూ ఆయన సవాల్ విసిరారు.
– భార్యాభర్తల ఫోన్లు కూడా ట్యాపింగ్ చేసి విన్న పాపాల భైరవుల పాలన, ప్రశ్నపత్రాలు లీక్ చేసి కోట్లు సంపాదించిన ముఠాల పాలన రాష్ట్రానికి మళ్లీ అవసరం లేదని బీఆర్ఎస్పై సీఎం రేవంత్ రెడ్డి ఫైర్ అయ్యారు.
రెండున్నరేండ్లలో సంక్షేమ విప్లవం
రెండున్నరేళ్ల కాంగ్రెస్ పాలనలో సాధించిన విజయాలు సంక్షేమ విప్లవమని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. రూ. 16వేల కోట్ల వ్యయంతో 3 కోట్ల 28 లక్షల మందికి 6 కిలోల చొప్పున నాణ్యమైన సన్న బియ్యం అందిస్తున్నామని.. ఫామ్‌హౌస్‌లో కేసీఆర్, జన్వాడలో కేటీఆర్ తినే సన్న బియ్యమే నేడు పేదల పిల్లలు తింటున్నారని ఆయన తెలిపారు. పేదల ఆత్మగౌరవం కోసం 4.5 లక్షల ఇందిరమ్మ ఇండ్లను మంజూరు చేశామని, గృహ జ్యోతి కింద 200 యూనిట్ల ఉచిత విద్యుత్ ఇస్తుంటే ప్రతిపక్షాల కండ్ల కుడుతున్నాయన్నారు.
‘‘కేసీఆర్ గజ్వేల్‌లో 1000 ఎకరాల ఫామ్‌హౌస్, కొడుకు కేటీఆర్ జన్వాడలో, బిడ్డ శంకర్ రెడ్డి పల్లిలో ఫామ్‌హౌస్‌లు కట్టుకున్నారే తప్ప పేదల ఇళ్ల గురించి ఆలోచించలేదు” అని దుయ్యబట్టారు. రైతు రుణమాఫీ, రైతు భరోసా, రైతు బోనస్ కోసం రికార్డు స్థాయిలో రూ. 1.56 లక్షల కోట్లు ఖర్చు చేశామని చెప్పారు. కాళేశ్వరం ప్రాజెక్టు కూలేశ్వరం అయి చుక్క నీరు రాకపోయినా, 80 లక్షల టన్నుల ధాన్యం కొనుగోలు చేసి రికార్డు సృష్టించామన్నారు. ‘‘హరీశ్ రావు ఆ నాడు కాళేశ్వర్ రావు అని పిలిపించుకుని, అది కూలిపోతే అటు దిక్కు కూడా చూడలేదు” అని సీఎం విమర్శించారు.
హరీశ్ రావు.. అగ్గిపెట్టె రావు
తొలి, మలి తెలంగాణ ఉద్యమాల్లో నల్గొండ జిల్లా పోషించిన పాత్రను సీఎం రేవంత్ రెడ్డి కొనియాడారు. ‘‘తొలి దశ ఉద్యమంలో కొండా లక్ష్మణ్ బాపూజీ మంత్రి పదవిని త్యాగం చేస్తే, మలి దశ ఉద్యమంలో ఈ ప్రాంత బిడ్డ, మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తన పదవిని త్యాగం చేసి ఆమరణ నిరాహార దీక్షకు దిగారు. నల్లగొండ ప్రజలు గర్వంగా చెప్పుకునే నాయకుడు కోమటిరెడ్డి’’ అని తెలిపారు. తెలంగాణ కోసం అమరులైన శ్రీకాంతా చారి, కానిస్టేబుల్ కిష్టయ్య, యాదయ్య, ఇషాన్ రెడ్డి, వేణుగోపాల్ రెడ్డి బలిదానాలను స్మరించుకున్నారు. ఆ అమరుల త్యాగాల ముందు, పదేండ్లు మంత్రి పదవులు అనుభవించిన అగ్గిపెట్టె రావుల డ్రామాలు సాగవని హరీశ్ రావును ఎద్దేవా చేశారు.
పలు అభివృద్ది పనులకు శంకుస్థాపన
సీఎం రేవంత్ రెడ్డి నల్లగొండ జిల్లా పర్యటనలో భాగంగా పలు అభివృద్ది పనులకు శంకుస్థాపన చేశారు. రూ.13 వేల కోట్లతో ఆర్ అండ్ బీ చేపట్టనున్న హ్యామ్ రోడ్ల నిర్మాణ కనగల్ వేదికగా పైలాన్‌ను ఆవిష్కరించారు. నల్లగొండ ప్రజల దాహార్తిని తీర్చే తాగునీటి పథకానికి శంకుస్థాపన చేశారు. సభలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, నల్లగొండ జిల్లా ఇంచార్జి మంత్రి అడ్లూరి లక్ష్మణ్, మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, నల్లగొండ ఎంపీ కుందూరు రఘువీర్ రెడ్డి, ప్రభుత్వ విప్‌లు వేముల వీరేశం, బీర్ల అయిలయ్య తదితరులు పాల్గొన్నారు.

