కలం, స్పోర్ట్స్ బ్యూరో: ఒకే స్థానానికి ఐదారుగురు పోటీ పడితే అది జట్టు బలమా? లేదా బలహీనతా? ప్రస్తుతం టీమిండియాలో (Team India) అదే పరిస్థితి నెలకొన్నది. ఓపెనర్లతో టాలెంట్ పొంగిపొర్లుతున్నా.. మ్యాచ్‌ను ముగించే ఫినిషర్ల అన్వేషణ ఇంకా కొనసాగిస్తూనే ఉన్నది.
భారత క్రికెట్‌లో ప్రతిభకు కొదవలేదు. కానీ ఆ ప్రతిభ అంతా ఇప్పుడు ఒకే చోట గుమిగూడుతున్నది.. అదే ఓపెనింగ్ స్లాట్..! ఇద్దరు ఆడే చోట ఐదారుగురు..! టెస్టుల్లో శుభ్‌మన్ గిల్, యశస్వీ జైస్వాల్, కేఎల్ రాహుల్, సాయి సుదర్శన్.. వన్డేల్లో రోహిత్తో పాటు భవిష్యత్ ఓపెనర్ల చర్చ.. టీ20ల్లో అభిషేక్ శర్మ, సంజూ శాంసన్, రుతురాజ్ గైక్వాడ్, యశస్వి, కొత్తగా వైభవ్ సూర్యవంశీ.. ఇలా పేర్ల జాబితా పెరుగుతూనే ఉన్నది. సెలెక్టర్లకు ఇదొక తియ్యని తలనొప్పే కావొచ్చు.. కానీ, ఇదే సమయంలో మరో ప్రమాదకరమైన సమస్య నిశ్శబ్దంగా వేళ్లూనుకుంటున్నది. టాప్ ఆర్డర్‌లో ఇంతమంది పోటీదారులున్నప్పుడు.. మ్యాచ్‌ను ముగించే ఫినిషర్లు అసలు ఎవరన్నది ఇప్పుడు అంతుచిక్కని ప్రశ్నగా మిగిలుతున్నది.
ఒక్కో ఫార్మాట్.. ఒక్కో ప్రయోగం
ఆధునిక క్రికెట్‌లో టాప్ ఆర్డర్ మ్యాచ్‌ను సెట్ చేస్తే, లోయర్ ఆర్డర్ మ్యాచ్‌ను ఫినిష్ చేస్తున్నది. వరల్డ్ కప్లు, నాకౌట్ మ్యాచ్‌లు, ఛేజ్లు.. ఇవన్నీ చివరి 10 ఓవర్లలోనే తేలిపోతున్నాయి. అక్కడ నంబర్-5, 6, 7 బ్యాటర్లు తేడా చూపించాలి. భారత్ దగ్గర ఈ స్థానాల్లో స్థిరత్వం ఇంకా పూర్తిగా కనిపించడం లేదు. ఒక్కో సిరీస్‌కు ఒక్కో కాంబినేషన్, ఒక్కో ఫార్మాట్‌కు ఒక్కో ప్రయోగం. జట్టు గెలుస్తూనే ఉంది.. కానీ, ఫినిషింగ్ యూనిట్ కోసం అన్వేషణ మాత్రం ఇంకా కొనసాగుతూనే ఉంది.
ఆ బలం ఇప్పుడెక్కడ..?
ఒకప్పుడు టీమిండియాకు (Team India) అసలైన బలం మిడిల్ ఆర్డరే. యువరాజ్ సింగ్, ఎంఎస్ ధోనీ, సురేశ్ రైనాతో పాటు విరాట్ కోహ్లీ తన కెరీర్ తొలి దశలో మిడిల్ ఆర్డర్లో ఆడిన రోజులు ప్రత్యర్థి బౌలర్లకు పీడకలగా ఉండేవి. టాప్ ఆర్డర్ విఫలమైనా జట్టులో ఎటువంటి భయం ఉండేది కాదు. ధోనీ చివరి వరకు క్రీజులో ఉంటే మ్యాచ్ టీమిండియాదే అన్న నమ్మకం ఉండేది. యువరాజ్ క్రీజులో ఉంటే రన్‌రేట్ గురించి ఆలోచించాల్సిన అవసరమే ఉండేది కాదు. రైనా స్పిన్నర్లను చీల్చి చెండాడేవాడు. ఒత్తిడిని అవకాశంగా మార్చుకోగల ఆ మిడిల్ ఆర్డరే అప్పటి టీమిండియాకు అసలైన బలం.
హార్దిక్ లేకుంటే మరో రూపం
ఇప్పుడు పరిస్థితి భిన్నంగా ఉంది. స్టార్ ఓపెనర్లు ఎక్కువ.. టాప్-3 కోసం పోటీ తీవ్రం. కానీ, మిడిల్ ఆర్డర్లో ఆటగాళ్ల పాత్రలు ఇంకా ఖరారు కాలేదు. హార్దిక్ పాండ్యా అందుబాటులో ఉంటే జట్టుకు ఒక రూపం.. లేదంటే మరో రూపం. ఫినిషర్, ఫాస్ట్ బౌలింగ్ ఆల్రౌండర్.. ఇలా జట్టుకు కావాల్సిన బ్యాలెన్స్ హార్దిక్ వల్ల సాధ్యమవుతున్నది. అతను జట్టులో లేకపోతే ఆరో బ్యాటర్ ఎవరు? ఏడో స్థానంలో మ్యాచ్ను ముగించేది ఎవరు? అన్న ప్రశ్నలు మళ్లీ తెరపైకి వస్తాయి. టీమిండియా ప్రస్తుతం ఎదుర్కొంటున్న అతిపెద్ద సవాలు ఇదే.
ఆ నమ్మకమే ముఖ్యం
ఆశలు లేవని కాదు. రవీంద్ర జడేజా అనుభవం, అక్షర్ పటేల్ అందించే విలువైన పరుగులు, రింకూ సింగ్ చివరి ఓవర్లలో మ్యాచ్‌ను తిప్పేయగల సామర్థ్యం జట్టుకు భరోసానిస్తున్నాయి. మరోవైపు, నితీశ్ కుమార్ రెడ్డి మూడు విభాగాల్లోనూ రాణించగల ఆధునిక ఆల్రౌండర్గా ఎదుగుతున్నాడు. వీరందరిలోనూ ప్రతిభ ఉంది. కానీ వారికి స్పష్టమైన పాత్రలు, వరుస అవకాశాలు, జట్టు మేనేజ్మెంట్ ఇచ్చే నమ్మకం ఎంతో అవసరం.
కొత్త ప్రయోగాలు వద్దు
ప్రతి సిరీస్లోనూ కొత్త ప్రయోగాలు చేయడం కంటే.. ముగ్గురు లేదా నలుగురు మిడిల్ ఆర్డర్ ఆటగాళ్లను ఎంపిక చేసి, వారిని దీర్ఘకాలిక ప్రణాళికతో తీర్చిదిద్దాలి. నంబర్-5, 6, 7 స్థానాల్లో ఎవరు ఉండాలో స్పష్టత ఉండాలి. నిర్ణీత ఆటగాళ్లకే వరుస అవకాశాలు ఇచ్చి, వారిపై నమ్మకాన్ని ఉంచాలి. ద్వైపాక్షిక సిరీస్‌లో, క్లిష్టమైన పరిస్థితుల్లో వారిని పరీక్షించాలి. ఐపీఎల్ ప్రదర్శనను మాత్రమే ప్రమాణంగా తీసుకోకుండా, అంతర్జాతీయ వేదికపై వారిని బాధ్యతాయుతంగా సిద్ధం చేయాలి. అప్పుడే ఒక స్థిరమైన ఫినిషింగ్ యూనిట్ తయారవుతుంది.
ఆ ఒత్తిడిని జయించేది వారే..
శుభ్‌మన్ గిల్ కెప్టెన్సీలో కొత్త తరం టీమిండియా రూపుదిద్దుకుంటున్నది. యువ ఆటగాళ్లు వస్తున్నారు, పోటీ పెరుగుతున్నది.. బెంచ్ స్ట్రెంగ్‌తో బలపడుతున్నది. కానీ ప్రపంచ క్రికెట్లో ఆధిపత్యం కొనసాగించాలంటే.. టాప్ ఆర్డర్‌లో ఐదుగురు ఓపెనర్లు ఉండటం కంటే లోయర్ ఆర్డర్లో ముగ్గురు నమ్మకమైన ఫినిషర్లు ఉండటం ఎంతో ముఖ్యం. ఎందుకంటే ఓపెనర్లు మ్యాచ్‌ను మంచి ఆరంభాన్ని ఇవ్వగలరు. కానీ కప్పులు గెలిపించేది మాత్రం చాలా సందర్భాల్లో చివరి 10 ఓవర్లలో ఒత్తిడిని తట్టుకుని నిలబడే మిడిల్, లోయర్ ఆర్డరే.

