కలం, సెంట్రల్ డెస్క్: రిషికి రైడింగ్ అంటే పిచ్చి. వీకెండ్ వచ్చిందంటే చాలు..ట్యాంక్ ఫుల్ చేయించుకుని బైక్‌పై ఒంటరిగా లాంగ్ రైడ్‌కు బయల్దేరిపోతాడు. కొత్త ప్రదేశాలు చూడడం, ప్రకృతిని ఆస్వాదించడం అతని హాబీ. ఈ ప్రయాణంలో ప్రకృతి, ప్రశాంతత అన్నీ ఉన్నాయి. అయినా ఎక్కడో ఏదో వెలితి. ఆ క్షణాన్ని, ఆ ఫీలింగ్ను తనలాగే బైక్ రైడింగ్‌ను ఇష్టపడే ఇంకొకరితో పంచుకుంటే.. ఆ ప్రయాణం ఇంకెంత బాగుండేదేమో అని..!
ఆ ఆలోచనతోనే ఓ వీకెండ్ రోజు సోషల్ మీడియాలో చిన్న పోస్టు పెట్టాడు.. ‘ఆదివారం ఉదయం అనంతగిరి రైడ్.. ఎవరైనా జాయిన్ అవుతారా?’ అని. అంతే ‘నేనూ వస్తా’, ‘ఎక్కడ కలుద్దాం?’, ‘నా రూట్ కూడా ఇదే’ అంటూ వరుసగా కామెంట్లు.. ఒక్కడిగా మొదలవుతుందని అనుకున్న రిషి ప్రయాణం.. చివరికి కొత్త దారిలో, కొత్త పరిచయాలతో గ్రూప్ రైడ్‌గా మారిపోయింది. బైకర్ల ప్రపంచంలో ఇప్పుడు ఇదో ట్రెండ్! దీని పేరే ‘సోలో టు సోషల్ రైడ్’!! హైదరాబాదీల్లో ఈ కొత్త ఓపెన్ రైడ్ కల్చర్ వేగంగా విస్తరిస్తున్నది. ఒంటరిగా ఉన్న వ్యక్తులకు కొత్త ప్రపంచాన్ని చూపిస్తున్నది. మేమున్నామనే భరోసా ఇస్తున్నది. వీకెండ్స్‌లో అల్లుకునే ఈ ఆత్మీయానుబంధం.. మరుపురాని జ్ఞాపకంగా మిగిలిపోతున్నది.
హైదరాబాద్లో బైకర్లు వీకెండ్ రాగానే సోషల్ మీడియాలో ‘Anyone joining?’, ‘Ride with me’, ‘Weekend Ride’, ‘Sunday Escape’ అంటూ పోస్టులు పెడుతున్నారు. ఒకప్పుడు బైక్ రైడ్ అంటే క్లబ్ సభ్యత్వం, ముందస్తు ప్రణాళిక తప్పనిసరి!! ఇప్పుడు మాత్రం ఒక సోషల్ మీడియా పోస్ట్ పెడితే చాలు.. తమలాగే రైడింగ్ను ఇష్టపడే వాళ్లు స్పందిస్తారు. ఒంటరిగా మొదలైన ప్రయాణం.. కొద్ది గంటల్లోనే ఒక చిన్న గ్రూప్‌గా మారిపోతుంది. రైడ్ ముగిసేసరికి నిన్నటి వరకు తెలియని వాళ్లు.. ఈరోజు స్నేహితులైపోతారు. ఒకే అభిరుచి ఉన్న వ్యక్తులను ఒకే రోడ్డుపైకి తీసుకొచ్చే కొత్త కాన్సెప్ట్ ఇది. ఇన్‌స్టా, వాట్సాప్ కమ్యూనిటీలు, టెలిగ్రామ్ ఛానళ్లే ఇప్పుడు ఈ ట్రెండ్‌కు ప్రధాన వేదికలు. ఒక పోస్టుకు స్పందించిన రైడర్లే… మరో వీకెండ్ రైడ్‌కు నిర్వాహకులుగా మారుతున్నారు.
సరికొత్త పరిచయాలు
ఒకప్పుడు బైక్ రైడ్స్ అంటే ప్రత్యేక బైకర్స్ క్లబ్బులే ఆధారం. సభ్యత్వం తీసుకోవాలి. క్లబ్ నిబంధనలు పాటించాలి. నిర్వాహకులు నిర్ణయించిన రూట్కే వెళ్లాలి. ఇప్పుడు ఆ పరిస్థితి మారిపోయింది. సోషల్ మీడియా వల్ల ఎవరికైనా రైడ్ ప్రకటించే అవకాశం వచ్చింది. అడ్మిన్లు, సభ్యత్వాలు, ఫీజులు అవసరం లేకుండానే ప్రయాణ సహచరులను సంపాదించుకుంటున్నారు. అందుకే యువత దీనిని ‘ఓపెన్ రైడ్ కల్చర్’గా అభివర్ణిస్తున్నది. ఈ రైడ్స్‌లో గమ్యం మాత్రమే కాదు.. ప్రయాణమే అసలు ఆకర్షణ. మార్గమధ్యంలో టీ స్టాళ్లు, వ్యూ పాయింట్లు, చిన్న హోటళ్లు, ఫొటోలు, సరదా సంభాషణలు.. ఇవే ఈ ట్రెండ్ ప్రత్యేకత. ఈ ట్రెండ్‌లో గుర్తుండిపోయేది గమ్యస్థానం కాదు… ప్రయాణంలో పరిచయమైన మనుషులు. ఒక్క రైడ్‌తో మొదలైన పరిచయం.. ఆ తర్వాత కాఫీ మీట్‌గా, మరో వీకెండ్ ట్రిప్‌గా, కొన్నిసార్లు జీవితాంతం కొనసాగే స్నేహంగా మారుతున్నది. అందుకే బైకర్లు ఒక మాట చెప్తున్నారు. సోలోగా బయలుదేరుదాం.. తిరిగొచ్చేసరికి కొత్త స్నేహితులతో మన ప్రపంచాన్ని ఇంకాస్త పెద్దది చేసుకుందాం.
ఒంటరితనానికి చెక్
- ఉద్యోగం, ట్రాఫిక్, రోజువారీ ఒత్తిళ్ల మధ్య చాలామంది తమ ఫ్రెండ్స్ సర్కిళ్లను కోల్పోతున్నారు. అలాంటి వారికి ఈ వీకెండ్ రైడ్స్ చిన్న ఉపశమనంగా మారుతున్నాయి.
- కొత్త వ్యక్తులతో మాట్లాడడం, కొత్త అనుభవాలు పంచుకోవడం వల్ల ఒంటరితనం తగ్గుతున్నదని రైడర్లు చెబుతున్నారు. కొన్ని గంటల ప్రయాణమే అయినా.. ఆ జ్ఞాపకాలు మాత్రం చాలాకాలం వెంట ఉంటాయని అంటున్నారు.
- అనంతగిరి హిల్స్, వికారాబాద్, నాగార్జునసాగర్, శ్రీశైలం, బాసర, కుంటాల, లక్నవరం, బొగత… హైదరాబాద్కు కొన్ని గంటల దూరంలో ఉన్న ప్రాంతాలే రైడర్లు ఎక్కువగా సెలెక్ట్ చేసుకుంటున్నారు. తెల్లవారుజామున బయలుదేరి, సాయంత్రానికి తిరిగి వచ్చేలా ప్రణాళికలు రూపొందిస్తున్నారు.
- హైదరాబాద్‌లో ప్రస్తుతం పలు బైకర్స్ కమ్యూనిటీలు చురుగ్గా కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయి. హైదరాబాద్ బైకర్స్ క్లబ్, హైదరాబాద్ మోటర్ క్లబ్ వంటివి చాలా ఉన్నాయి. ఇవి తరచూ వీకెండ్ రైడ్స్ నిర్వహిస్తున్నాయి. వీటితో పాటు మహిళా రైడర్ల కోసం ప్రత్యేకంగా ‘ఉమెన్ రైడర్స్ హైదరాబాద్’ ఉంది.
వీకెండ్ బ్రేక్‌ఫాస్ట్ రైడ్స్
హైదరాబాద్లోని మ్యాడ్ మ్యాక్స్ బైకింగ్ గ్రూప్ కూడా ఇలాంటి ‘సోలో టు సోషల్ రైడ్’ కల్చర్ను ప్రోత్సహిస్తున్నది. నిర్వాహకుడు చైతన్య ఆధ్వర్యంలో ప్రతి వీకెండ్ బ్రేక్‌ఫాస్ట్ రైడ్స్ నిర్వహిస్తూ కొత్త రైడర్లను ఆహ్వానిస్తున్నది. నెలలో లేదా రెండు మూడు నెలలకు ఒకసారి నగరానికి దూరంగా లాంగ్ రైడ్స్ కూడా ప్లాన్ చేస్తున్నది. ఈ రైడ్స్‌లో సభ్యత్వం కంటే రైడింగ్పై ఆసక్తికే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారు. కొత్తగా బైకింగ్ మొదలుపెట్టిన వారికీ అవకాశం కల్పిస్తూ, సేఫ్ రైడింగ్, పరస్పర సహకారం, కొత్త స్నేహాలకు వేదికగా ఈ గ్రూప్ నిలుస్తున్నది. ’’నేనో చీఫ్ ఇంజినీర్. పనిలో ఎంత బిజీగా ఉన్నా… 20 ఏండ్లుగా బైక్ నడుపుతున్నా… ఇప్పుడు రైడింగ్‌కు కొత్త అర్థం దొరికింది. ఒకప్పుడు గమ్యం కోసం వెళ్లేవాళ్లం. ఇప్పుడు ప్రయాణంతో పాటు మనుషుల కోసం కూడా వెళ్తున్నాం. ఈ ఓపెన్ రైడ్ కల్చర్ వల్ల బైకింగ్ అనేది కేవలం హాబీ కాకుండా, కొత్త పరిచయాలు, మంచి స్నేహాలకు వేదికగా మారింది. నాకిప్పుడు దేశవ్యాప్తంగా 4 వేల మంది రైడర్ ఫ్రెండ్స్ ఉన్నారు‘‘ అని అంటున్నాడు తిరుపతి, మ్యాడ్ మ్యాక్స్ క్లబ్‌కు చెందిన విష్ణువర్ధన్.

